ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:09:40

అండగా నిలిచి.. మనసు గెలిచి

అండగా నిలిచి.. మనసు గెలిచి

  • ముమ్మరంగా వరద సహాయ చర్యలు.. 
  • వేలమంది బాధితులకు ఆహారం సరఫరా.. 
  • పలుచోట్ల వసతి ఏర్పాటుచేసి తోడ్పాటు
  • జనంలోనే ఉంటూ భరోసానిచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు

‘సుట్టుపక్కల మొత్తం నీళ్లొచ్చినయ్‌.. ఇగ సూశెటోళ్లు లేరనుకున్న. తిండిలేకనే సస్తనేమో అని బుగులైంది. కానీ టీఆర్‌ఎస్‌ పార్టోళ్లు సొంత బిడ్డల్లెక్కనే వచ్చిండ్రు. కడుపు నిండ తిండి పెట్టిండ్రు. వొండుకోనికె ఇన్ని సామన్లిచ్చిండ్రు. ధైర్యంగా ఉండుమని చెప్పి పొయ్యిండ్రు’ హైదరాబాద్‌లోని ఓ ముసలవ్వ మాటలివి.‘ఇండ్లళ్లకు మొత్తం నీళ్లు వచ్చినయి. బయటకొచ్చినా అట్లనే ఉన్నది. వొండనీకె జాగలేదు. ఉన్న గింజలు తడిసిపొయినయి. కండ్ల ముంగటనే పిల్లలు ఆకలైతందని ఏడుస్తుండ్రు. ఆళ్లను సూస్తెనే దుఖమొచ్చింది. ఎట్లరా అని అనుకుంటుంటే టీఆర్‌ఎస్‌ లీడర్లు వచ్చి ఆకలి తీర్చిండ్రు. ఆళ్లు సల్లగుండాలె’ నగరంలోని ఓ ముంపు ప్రాంతంలో చిక్కుకున్న ఓ తల్లి దీవెనిది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భీకర వానలతో బిక్కుబిక్కుమంటూ ఉన్న వరద బాధితులకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. వరదల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. కన్నోళ్లలా కన్నీళ్లు తుడిచారు. తోబుట్టువుల్లా సాయంచేసి బాధితుల మనసు గెలిచారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసాఇచ్చి తమవంతు సాయం అందించారు. హైదరాబాద్‌లో వేలమందికి భోజనాలు, బియ్యం, మంచి నీళ్లు, నిత్యావసర సరుకులను పంపిణీచేశారు. రాత్రినక పగలనక ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్నారు. మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఈటల రాజేందర్‌, సత్యవతిరాథోడ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు గురువారం కూడా ప్రజల మధ్యే ఉన్నారు. వేలమందికి వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనాలను ఏర్పాటుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఉచిత వసతిని ఏర్పాటుచేసింది. 

కాలనీల్లో పర్యటించి సాయం

మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని నల్లకుంట శ్రీరామ్‌నగర్‌ బస్తీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని ప్రేమ్‌నగర్‌, పటేల్‌నగర్‌కాలనీ, టోలిచౌకిలోని నదీం కాలనీల్లో పర్యటించారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మారుతినగర్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌, ఎంఎస్‌ మక్తా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం తార్నాక , లాలాపేట ప్రాంతాల్లో డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావు వరద బాధితుల ఒక్కో కుటుంబానికి 15 కిలోల బియ్యం అందించారు. 128 చింతల్‌ డివిజన్‌ పరిధిలోని ముంపు ప్రాతాల్లో ధోబీఘాట్‌లో 500 మందికి భోజనాలు ఏర్పాటుచేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో, మంత్రి సత్యవతి రాథోడ్‌ వరంగల్‌ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్‌ లింగోజిగూడ డివిజన్‌ పరిధిలోని గ్రీన్‌పార్క్‌ తదితర కాలనీల్లో స్థానిక కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, గ్రీన్‌పార్క్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జగన్‌రెడ్డి తదితరులు ఇంటింటికీ తిరిగి ఆహార పొట్లాలు అందించారు.


logo