గురువారం 09 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:03

ఆర్థికానికి ఆర్‌ఆర్‌ఆర్‌.. రికవర్‌.. రీబూట్‌.. రీస్టార్ట్‌

ఆర్థికానికి ఆర్‌ఆర్‌ఆర్‌.. రికవర్‌..  రీబూట్‌.. రీస్టార్ట్‌

  • కాస్త మెల్లగానైనా పుంజుకోవటం ఖాయం
  • కేంద్రం సాహస నిర్ణయాలతోనే సాధ్యం
  • సంస్కరణల అమలు అత్యంత అవసరం
  • జౌళి రంగంలో పెరుగాల్సిన ఎగుమతులు
  • వచ్చే దశాబ్దిలో వైద్యరంగంలో భారీ ఉపాధి
  • తెలంగాణకు చైనా కంపెనీల కోసం కసరత్తు
  • రాష్ట్రంలో కరోనా మరణాలు 2.3 శాతమే
  • వ్యాక్సిన్‌ రిసెర్చ్‌లో 4 తెలంగాణ కంపెనీలు 
  • ఫిక్కీ వెబినార్‌లో పరిశ్రమల మంత్రి కేటీఆర్‌

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలి. ఇతర దేశాల్లోని భారతసంతతి ప్రజలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేలా కృషిచేయాలి. గత కొన్నేండ్లుగా దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంద్వారా దాదాపు పది కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందాయి. ఇదే తరహాలో రాబోయే దశాబ్ద కాలంలో వైద్యరంగంలో కూడా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభం నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ ‘రికవర్‌, రీబూట్‌, రీస్టార్ట్‌' విధానంతో మళ్లీ పుంజుకోగలదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశ ఆర్థికరంగం ఆంగ్ల ఆక్షరం ‘వీ’ ఆకారంలో కాకపోయినా ‘యూ’ ఆకారంలో వృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఫిక్కీ గురువారం నిర్వహించిన ‘రీబిల్డింగ్‌ అండ్‌ రీబూటింగ్‌ తెలంగాణ ఎకానమీ- పోస్ట్‌ కొవిడ్‌-19’ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోకి భారీగా పెట్టుబడులు రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని, సంస్కరణలు అమలుచేయాలని చెప్పారు. దీనిపై కేంద్రంలోని వివిధ శాఖల మంత్రులకు ఇప్పటికే లేఖరాశానన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలని అన్నారు. ఇతర దేశాల్లోని భారతసంతతి ప్రజలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంద్వారా దాదాపు పది కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందాయని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇదే తరహాలో రాబోయే దశాబ్ద కాలంలో వైద్యరంగంలో కూడా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు. ఇతర దేశాల పరిశ్రమలను ఆకర్షించడానికి దేశంలో మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌లను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్‌ను, వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌పార్కును ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. ఫార్మాసిటీని కొన్ని నెలల్లో ప్రారంభిస్తామని, ఇప్పటికే దీనికోసం పదివేల ఎకరాలు సేకరించామని, మరో రెండువేల ఎకరాల సేకరణ తుదిదశకు చేరిందని చెప్పారు. రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లను ఏర్పాటుచేశామని, ఆ స్థలంలో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లను మంజూరుచేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్రపంచంలో భారతదేశం వ్యాక్సిన్‌, మందుల తయారీలో ముందున్నదని, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) సరఫరా చేయాలంటూ స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మన ప్రధానిని అడిగారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. 

ప్రొత్సాహకాలను ఇస్తాం కానీ..

పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1500కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతమున్న ఆర్థిక ఇబ్బందులు అందరికీ తెలిసినవేనని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయ, వ్యయాలను అంచనావేసి ప్రోత్సాహకాలను విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తరువాత నిర్మాణరంగం రెండో స్థానంలో ఉన్నదని, ఈ రంగానికి ప్రోత్సాహం అవసరమని వెల్లడించారు. కరోనా కారణంగా టూరిజం, ఆతిథ్య రంగం, వైమానిక రంగం ప్రభావితమయ్యాయని చెప్పారు. టీ-ఫైబర్‌ పూర్తికాగానే రాష్ట్రంలో కోటి ఇండ్లకు కనెక్షన్‌ ఇస్తామని కేటీఆర్‌ తెలిపారు. హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలకే రాబోయే కాలంలో భవిష్యత్‌ ఉంటుందని, వీటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెస్‌ఎంఈలను ఆదుకోవడానికి ఇప్పటికే  ఆయా కంపెనీలు, సంస్థలకు సంబంధించిన ఆస్తిపన్ను, విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీల చెల్లింపులను మూడునెలలపాటు వాయిదా వేశామని గుర్తుచేశారు. ఆత్మ నిర్భర్‌ పథకం అమలులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్‌ సంగీతారెడ్డి, మాజీ అధ్యక్షుడు సందీప్‌ సోమిని, నాయకులు నైనాలాల్‌ కిద్వాయ్‌, హర్ష్‌పాటి సింగానియా, పింకీరెడ్డి, తెలంగాణ ఫిక్కీ అధ్యక్షుడు మురళీధరన్‌, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి తదితరులు పాల్గొన్నారు. 

త్వరలో రాష్ర్టానికి భారీ పెట్టుబడులు

అతి తక్కువ వయస్సుగల తెలంగాణ.. దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించడానికి సులభ వాణిజ్యం (ఈవోడీబీ)పైనే కాకుండా కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, క్వాలిటీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై దృష్టి పెట్టామని చెప్పారు. చైనా నుంచి తరలిపోవడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలను, అలాగే యురోపియన్‌ దేశాలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తూ వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, వైద్యం, ఎలక్ట్రానిక్స్‌, టైక్స్‌టైల్‌ రంగాల్లో తమ సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

కరోనా కట్టడితోపాటు వాణిజ్యమూ ముఖ్యమే

రాష్ట్రంలో కొవిడ్‌-19 నియంత్రణలో ఐసీఎంఆర్‌, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, తెలంగాణలో కరోనా మరణాలు 2.3% మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వైద్యరంగానికి కరోనా సవాల్‌గా మారిందని, ప్రపంచ ఆర్థిక నగరంగా గుర్తింపుపొందిన న్యూయార్క్‌ను కూడా వైరస్‌ వదిలిపెట్టలేదని వైద్య సదుపాయాలు భారీగా ఉన్న దేశాలు కూడా కరోనా వల్ల అతలాకుతలమవుతున్నాయన్నారు. కరోనాను నియంత్రించడంతోపాటు వాణిజ్య కార్యకలాపాలు కూడా ముఖ్యమేనని, అందుకే వాటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, వాటిలో నాలుగు తెలంగాణకు చెందినవి ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చేవరకు జాగ్రత్తగా ఉంటూ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ఆయన ప్రజలకు, వ్యాపారవేత్తలకు సూచించారు. తెలంగాణలో పండే పత్తి నాణ్యమైనదని, ఇక్కడి పత్తిని తమిళనాడు సహా పలు రాష్ర్టాలకు చెందినవారు కొంటారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. టెక్స్‌టైల్‌ రంగంలో భారత్‌ ఎంతో వెనుకబడి ఉన్నదని, ప్రపంచ అవసరాలకు మనవద్ద నుంచి కేవలం 4 శాతం మాత్రమే ఎగుమతి జరుగుతున్నదని తెలిపారు. మరోవైపు చైనా నుంచి 40 శాతం, శ్రీలంక నుంచి ఆరు శాతం, బంగ్లాదేశ్‌ నుంచి ఎనిమిదిశాతం ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. ఈ రంగంలో వృద్ధి చెందడానికి చాలా అవకాశాలున్నాయని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.


logo