గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 00:47:23

రియల్టీ.. పడిపోతే..!

రియల్టీ.. పడిపోతే..!

  • ఓటు మారితే.. కుప్పకూలడమే 
  • శాంతి భద్రతలే.. రియల్‌కు ఊపిరి
  • తళుకులీనుతున్న రియల్‌ఎస్టేట్‌ రంగం 
  • ఆరేండ్లు శ్రమపడి అద్దాలమేడను నిర్మించిన టీఆర్‌ఎస్‌ 
  • హైదరాబాద్‌లో 25 లక్షల మందికి ఉపాధి  
  • ఒక్క రాయి తగిలినా ఆశలసౌధం నేలమట్టం

 హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అడ్డాకూలీల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా ఇందులో ఉన్నారు. తెలంగాణతోపాటు ఐదారు రాష్ర్టాలవారికి తిండిపెడుతున్నది. మనంవేసే ఒక్కఓటు వారందరి ఉపాధిపై ప్రభావం చూపుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగమంటే ఓ అద్దాల మేడ. ఆరేండ్లుగా ఎంతో జాగ్రత్తగా ఇది నిర్మాణమవుతూ వస్తున్నది. లక్షల మందికి ఉపాధినిస్తూ.. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆన్‌గోయింగ్‌లో ఉన్నాయి. ఏ చిన్నతప్పు చేసినా విద్వేషపు చీకట్లలో అద్దాలమేడ పేకమేడలా కూలుతుంది. 

తెలంగాణ సిద్ధించాక రియల్‌ఎస్టేట్‌ రంగం కుప్పకూలుతుందని, భూములను ఎవరూ కొనరని, ఆంధ్రప్రాంతం వాళ్లు ఆస్తులు అమ్ముకొనిపోతారని.. ఇలా అనేక అవమానాలు. వాటన్నింటినీ పటాపంచలు చేసి గర్వంగా తలెత్తుకొని నిలబడ్డం. ఇప్పుడు విషం చిమ్మేవారికి అధికారం అప్పగించి తలదించుకొని బతుకుదామా?

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చి రియల్‌ ఎస్టేట్‌రంగానికి కొత్త ఊపిరులూదింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌లో ఆస్తులు కొనాలని ఆరాటపడుతున్నారు. ఇలాంటి హైదరాబాద్‌ను మత పిచ్చిపట్టినవాళ్ల చేతిలో రాయిగా మార్చుదామా?

కల్లోలం.. విద్వేషం.. కర్ఫ్యూలు ఎక్కడ వస్తాయోనని రియల్‌ ఎస్టేట్‌ రంగం, దానిపై ఆధారపడిన 25 లక్షల మంది గజగజ వణుకుతున్నారు. మనం వేసే ఓటు అభివృద్ధి రూటు మారితే అందరి బతుకులపైనా కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం. టీఎస్‌ బీ పాస్‌ కావాలా? కర్ఫ్యూపాస్‌లు కావాలా? ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రియల్‌ ఎస్టేట్‌ అంటే భూములు కొనడం, అమ్మడం అనే భావన అందరిలోనూ ఉన్నది. ఏదైనా జరిగితే మహా అయితే భూముల ధరలు పడిపోతాయని, వెంచర్లు వేసినవాళ్లు, ప్లాట్లు కొన్నవాళ్లు మాత్రమే నష్టపోతారని అనుకుంటారు. కానీ, వారిద్దరే కాదు.. సుమా రు 250కిపైగా రంగాలు రియల్‌ఎస్టేట్‌పై ఆధారపడి ఉంటాయి. వాటిపై ఆధారపడి కొన్ని కోట్ల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రియల్‌ఎస్టేట్‌ ఏ రాష్ర్టానికైనా ఆయువుపట్టు వంటింది. ఒక్క హైదరాబాద్‌నే తీసుకుంటే రియల్‌ ఎస్టేట్‌, దాని అనుబంధ రంగాలు కలిపి సుమారు 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో అడ్డాకూలీలు మొదలుకొని.. తాపీ మేస్త్రీలు, మార్బుల్‌ కటింగ్‌, వైరింగ్‌, పుట్టి, పెయింటింగ్‌ వర్కర్స్‌, సైట్‌ సూపర్‌వైజర్లు, సివిల్‌ ఇంజినీర్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇటు క బట్టీలు, ఇసుక వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, ఆర్కిటెక్చర్లు.. ఇలా బడా పారిశ్రామికవేత్తల వరకు ఉన్నారు. ఒక్క రియల్‌ రంగం కుప్పకూలితే వీళ్లందరి బతుకు లు ఆగమైపోతాయి. ఆరేండ్లుగా నిర్మించుకున్న అద్దాలమేడ.. పేకమేడలా కుప్పకూలుతుంది.

టేకాఫ్‌.. 2.0 దశలోకి

హైదరాబాద్‌లో రియల్‌రం గం శరవేగంతో వృద్ధి చెందుతున్నది. ఇది ‘రియల్‌ ఎస్టేట్‌ 2.0’ దశలోకి వెళ్తున్నదని నిపుణులు చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు ప్రాజెక్టులు ఇండ్లు, నివాస సముదాయాలు, అపార్ట్‌మెంట్‌ల స్థాయిలో ఉండేది. ప్రభు త్వం నూతనంగా ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020’ని ప్రవేశపెట్టడం, ఔటర్‌ వెలుపల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇకపై టౌన్‌షిప్‌ల ప్రాజెక్టులు వస్తాయని అంటున్నారు.

శాంతి భద్రతలే గీటురాయి

పొద్దున లేస్తే గొడవలు, కొట్లాటలు ఉండేచోట నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఎవరూ అనుకోరు. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుగాలంటే శాంతి భద్రతలే గీటురాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్లలో పోలీసింగ్‌ స్వరూపాన్నే మార్చేసింది. సుమారు 50 లక్షల సీసీ కెమెరాలతో నగరంపై నిఘా వేసింది. నేరం జరిగిన గంటల్లోనే ఛేదిస్తూ.. తెలంగాణ పోలీసులు దేశంలోనే ‘టాప్‌ కాప్స్‌'గా మన్ననలు అందుకుంటున్నారు. ఫలితంగా రియల్‌ రం గం రెక్కలు విప్పుకొని ఎల్లలు దాటుతున్నది.

ప్రాణంపోసిన ప్రభుత్వ పాలసీలు 

తెలంగాణ వచ్చేనాటికి రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊగిసలాటలో ఉన్నది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్‌, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ రియ ల్‌ ఎస్టేట్‌, నిర్మాణం, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపిరులు ఊదేలా సంస్కరణలను ప్రవేశపెట్టారు. టీఎస్‌ఐపాన్‌, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020, ఆన్‌లైన్‌ వ్యవస్థలతో అవినీతికి చెక్‌పెట్టారు. అనుమతుల్లో మానవ ప్ర మేయాన్ని తగ్గించడం, నిర్మాణరంగంలో పలు సడలింపులు ఇవ్వ డం, బకాయి పన్నులు, ఫీజులను వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. ఫలితంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. హైదరాబాద్‌ రియల్‌రంగం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది.  

ధరణి.. టీఎస్‌ బీపాస్‌తో రాకెట్‌ వేగం 

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి, టీఎస్‌బీపాస్‌ పాలసీతో రియల్‌ ఎస్టేట్‌ రంగం రాకెట్‌ వేగాన్ని అం దుకోనున్నది. ఓవైపు సుస్థిరపాలన, మరోవైపు అ త్యుత్తమ పాలసీల వల్ల రియల్‌సంస్థలు భరోసాతో, గుండెమీద చేయివేసుకొని ప్రశాంతంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో రియల్‌ రంగం 2014 నుంచి 2019 మధ్య 172 శాతం వృద్ధిరేటు కనబరిచినట్టు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అనే సంస్థ పేర్కొన్నది.   

డైనమిక్‌ సిటీ 

జేఎల్‌ఎల్‌ సంస్థ ఈ ఏడాది హైదరాబాద్‌ను ప్రంపంచలోనే బెస్ట్‌ డైనమిక్‌ సిటీగా ప్రకటించింది. ప్రపంచంలోని 131 నగరాలను పరిగణనలోకి తీసుకొని.. చట్టాలు, పాలసీల అమలు, పారదర్శక సేవ లు, జవాబుదారీతనం వంటి అంశాలను పరిశీలించింది. ఇందులో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది.  ఈ జాబితాలో హైదరాబాద్‌ టాప్‌లో నిలువగా మిగతా మెట్రో నగరాల్లో చెన్నై 14, ముంబై 20, ఢిల్లీ 88వ స్థానంలో నిలిచాయి.

లాక్‌డౌన్‌లోనూ అండగా

జాతీయస్థాయిలో లాక్‌డౌన్‌ సందర్భం గా నిర్మాణ రంగం కుదేలు కాకుండా ప్రభు త్వం అనేక చర్యలు తీసుకున్నది. వలసకార్మికులను ఆదుకొనేందు కు ప్రత్యేకంగా 208 లేబర్‌ క్యాంపులు ఏర్పాటుచేసి, వారికి భోజనం అందించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ని ర్మాణాలను కొనసాగించుకునేందుకు అనుమతిచ్చిం ది. పన్నుల భారం తగ్గించింది. వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌  ఆఫర్లు ఇచ్చింది. లాక్‌డౌన్‌ తర్వా త వేగంగా రికవరీ అవుతున్న మహానగరాల్లో హైదరాబాద్‌ టాప్‌లో ఉన్నదని జేఎల్‌ఎల్‌ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఆలోచించి ఓటేద్దాం.. 

సొంతిల్లు కట్టుకోవడం ప్రతిఒక్కరి కల. కొందరు ఇల్లు కట్టుకొనేందుకు స్థలాలు కొంటే మరికొందరు భవిష్యత్తులో పిల్లల చదువులు, పెండ్లి.. ఇలా అవసరాలకు భూమిపై పెట్టుబడి పెడుతారు. మరికొందరు ప్రశాంతంగా బతుకొచ్చనే ఆశతో రూపాయి ఎక్కువైనా పెట్టి హైదరాబాద్‌లో స్థలాలు కొంటున్నారు. ఇలాంటి సమయంలో విద్వేషాలు చెలరేగితే? విషం నిండిన నేతలు అధికారంలోకి వచ్చి నిత్యం ఘర్షణ లు జరిగితే? భాగ్యనగరం.. కల్లోల నగరంగా మారి తే? మన భూములు ఏమవుతాయి? మన ఆస్తుల విలువ కరిగిపోదా? తాత్కాలిక ఆవేశంతో మనంవే సే ఓటు మన భవిష్యత్తును నాశనం చేయదా? అభివృద్ధికి ఓటేస్తేనే మనకు విలువ.. మతత్వానికి ఓటేస్తే మన బతుకులను మనమే ఆగం చేసుకున్నట్టు. కాబట్టి.. సోచో హైదరాబాదీ.. సోచో.

ఐదేండ్లలోనే ప్రాజెక్టుల విలువ లక్ష కోట్లకు.. 

హైదరాబాద్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విలువ రూ.లక్ష కోట్లు అని అంచనా. 2014లో అప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విలువ సుమారు రూ.50 వేల కోట్లు. అంటే.. ఐదేండ్లలోనే ప్రాజెక్టుల రాక రెట్టింపయింది. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణం. పారదర్శక, సరళీకృత విధానాల కారణంగా వేగంగా అనుమతులు రావడం, పెట్టుబడులను ఆకర్షించడం ఇందుకు కారణాలు. ఫలితంగా నిర్మాణ అనుమతుల సంఖ్య రెండున్నర రెట్లు పెరుగగా, ఆదాయం డబుల్‌ అయింది. 


ఆఫీస్‌ స్పేస్‌ అదరహో.. 

ఆఫీస్‌ స్పేస్‌ను అందివ్వడం, అగ్రిమెంట్లు చేసుకోవడంలో భాగ్యనగరం అదరహో అనిపించింది. రాష్ట్రంలో ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 11 శాతంగా ఉంటే.. 2019లో అది 22 శాతానికి ఎగబాకింది. ఐదేండ్లలోనే రెట్టింపయింది. 2019లో ఏకంగా 1.2 బిలియన్‌ చదరపు మీటర్ల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. ఇదొక రికార్డు. ఇక 2014-19 మ ధ్య ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో 211 శాతం పెరుగుదల నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ నివేదిక తెలిపింది. దీంతో అద్దెలు  పెరిగాయి. 

దక్షిణ భారత్‌ న్యూయార్క్‌.. 

హాలిఫై.కామ్‌ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్‌ నంబర్‌ 1గా నిలిచింది. భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన, సుస్థిరాభివృద్ధి కలిగిన, స్థిరమైన పాధి కల్పించే నగరంగా పేర్కొన్నది. దక్షిణ భారత్‌ న్యూయార్క్‌గా హైదరాబాద్‌ రూపాంతరం చెందుతున్నదని ప్రశంసించింది.  

మెర్సస్‌ సంస్థ ఏటా నిర్వహిస్తున్న సర్వేలో వరుసగా ఐదేండ్లుగా హైదరాబాద్‌ టాప్‌లో నిలుస్తున్నది. 

‘రియల్‌'.. ఒక విత్తనం.. మహావృక్షం 

భూములు అమ్మడం, కొనడం అనేది రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఒక విత్తనం మాత్రమే. ఆ తర్వాతి పరిణామాలతో అది ఒక మహావృక్షంగా మారుతుంది. భూమి కొనుగోలు చేసిన తర్వాత దానిని డెవలప్‌ చేసి, ప్లాట్లు చేసి అమ్ముతారు. తర్వాత అక్కడికి ఇండ్లు/వాణిజ్య భవనాలు/ పరిశ్రమలు వస్తాయి. అవి కాలనీలుగా మారితే.. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. రాకపోకలు పెరిగితే చిన్న దుకాణాల నుంచి షాపింగ్‌ మాల్స్‌ వరకు వస్తాయి. నాయీబ్రాహ్మణులు, రజకులు, వడ్రంగి, కంసాలి.. ఇలా కుల వృత్తుల వారందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇవేకాకుండా అనేక రకాల దుకాణాలు వెలుస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వేసిన ఒక విత్తనం వేలమందికి ఉపాధి కల్పించే మహావృక్షంగా మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్‌ రంగం క్రమంగా మహావృక్షంగా మారుతున్నది. నగరం పరిధి విస్తరిస్తున్నది. శివారు ప్రాంతం అనేమాటే వినపడటం లేదు. ఔటర్‌ దాకా హైదరాబాదే. ‘చేతులు నరుకుతా’ అంటూ బెదిరింపులకు దిగుతున్నవారి చేతుల్లో మన హైదరాబాద్‌ను పెట్టి ఈ మహావృక్షాన్ని నరుక్కుందామా? 

ప్రశాంతంగా ఉంటేనే బిజినెస్‌ సాగుతుంది

ప్రశాంతంగా ఉంటేనే మా బిజినెస్‌ సాగుతుంది. గతంలో మతకల్లోలాలు జరిగిన సమయంలో చాలా నష్టపోయిన పరిస్థితులను ప్రత్యక్షంగా చూశా. ఆరేండ్లుగా రాష్ట్రంలో ఎలాంటి గొడవలు లేవు. ప్రభుత్వం కూడా సంస్కరణలు తీసుకొచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది. రాష్ట్రంలో, స్థానిక సంస్థల్లో ఒకేపార్టీ అధికారంలో ఉంటే మెరుగు.

- ప్రభాకర్‌రావు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు

శాంతి భద్రతలు ముఖ్యం

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం. అప్పుడే మనరాష్ట్రంతోపాటు ఇతరరాష్ర్టాల ప్రజలు కూడా రావడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది. ప్రభుత్వ పాలసీలు బాగున్నాయి. వివిధ రాష్ర్టాలకు చెందినవారు హైదరాబాద్‌లో ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఆరేండ్లలో అన్నిరంగాలు టేకాఫ్‌ అయ్యాయి.

- విజయ్‌ సాయి మేక, ట్రెడా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 

అలర్లతో ఏ నగరమూ అభివృద్ధి చెందదు

అల్లర్లతో ఏ నగరమూ అభివృద్ధి చెందదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన శాటిలైట్‌ టౌన్‌షిప్‌ పాలసీ నగరానికి గొప్ప సంస్కరణగా మారుతుంది. త్వరలో సరికొత్త అభివృద్ధిని చూడబోతున్నాం. గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీఏ తరఫున టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నాం.

- జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుlogo