సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 07:52:12

అంజిరెడ్డి ఇంట్లో 1,387 పేజీల పత్రాలు

అంజిరెడ్డి ఇంట్లో 1,387 పేజీల పత్రాలు

  • శ్రీనాథ్‌, అంజిరెడ్డిలకు చెందిన రెండు కార్లు స్వాధీనం 
  • విచారణ సందర్భంగా తాసిల్దార్‌ సహా నలుగురికి పీపీఈ కిట్లు 
  • ఏసీబీ రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ పట్టుబడిన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర తాసిల్దార్‌ నాగరాజు కేసులో కీలకంగా ఉన్న రాంపల్లి దయారాకు చెందిన అంజిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాల్లోనూ పెద్దసంఖ్యలో పలు పత్రాలు లభించాయి. వివిధ రకాలవి కలిపి మొత్తం 1,387 పేజీల డాక్యుంమెంట్లను స్వాధీనంచేసుకున్నట్టు ఏసీబీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు సూచన మేరకు మూడురోజులపాటు విచారణ సమయంలో తాసిల్దార్‌ నాగరాజు సహా మిగిలిన ముగ్గురికి పీపీఈ కిట్లు వేయించినట్టు సమాచారం. కేసులో కీలకమైన తాసిల్దార్‌ లంచంగా తీసుకున్న రూ.కోటీ 10 లక్షలతోపాటు సోదాల్లో దొరికిన సొమ్ము కలిపి రూ.కోటీ 40 లక్షలు, 531 గ్రాముల బంగారం, ఒక లాకర్‌ తాళం పట్టుబడినట్టు ఏసీబీ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. కేసులో ఏ1గా తాసిల్దార్‌ నాగరాజు, ఏ2గా రాంపల్లి వీఆర్‌ఏ బీ సాయిరాజ్‌, ఏ3గా సాయి డెవలపర్స్‌కు చెందిన సీహెచ్‌ శ్రీనాథ్‌యాదవ్‌, ఏ4గా కే అంజిరెడ్డిలను ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రాంపల్లి దయారాలో సర్వే నంబర్‌ 614లోని 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించి సెటిల్‌మెంట్‌ కోసం తాసిల్దార్‌ నాగరాజు లంచం తీసుకున్నట్టు అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనాథ్‌యాదవ్‌కు చెందిన టీఎస్‌08జీసీ2858 వోక్స్‌వ్యాగన్‌ కారు, అంజిరెడ్డికి చెందిన టీఎస్‌08జీఈ6789 టయోటా ఫార్చ్యునర్‌ కార్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.logo