మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 13:17:42

రెడీగా ఉన్న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లకు త్వరలో ప్రారంభోత్సవాలు

రెడీగా ఉన్న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లకు త్వరలో ప్రారంభోత్సవాలు

జనగామ : సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్వరలో ప్రారంభోత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. మిగ‌తా మిగతా ఇండ్లను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాల‌ని, పూర్తి చేయ‌ని కాంట్రాక్టర్లను బ్లాక్ లీస్టులో చేర్చుతామ‌ని పంచాయ‌తీరాజ్, శాఖ మంత్రి  ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు హెచ్చరించారు. అలాగే క‌ల్లాలు, రైతు వేదిక‌ల నిర్మాణానికి గ‌డువు ముగిసినందున మ‌రో వారం పొడ‌గిస్తూ అదేశాలు జారీ చేశారు. 

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, కొడ‌కండ్ల‌, దేవ‌రుప్పుల మండ‌లాల ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి ప‌నుల‌పై మంత్రి సంబంధిత శాఖ‌ల జిల్లా, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు స‌మ‌న్వయ స‌మితి స‌భ్యుల‌తో పాల‌కుర్తి క్యాంపు కార్యాల‌యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శాఖ‌ల వారీగా సుదీర్ఘంగా స‌మీక్షించిన మంత్రి మాట్లాడుతూ..ప్రగతిలో ఉన్న వివిధ ప‌థ‌కాల ప‌నుల‌ను వేగం చేయాల‌ని ఆదేశించారు. 

క‌రోనా నేప‌థ్యంలో మంద‌గించిన ప‌నుల‌ను త్వరిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఉన్న డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాల‌కు ఏర్పాట్లు చేయాల‌ని అధికారులు, ప్రజాప్రతినిధుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ ల‌క్ష్యాన్ని దెబ్బకొడుతూ, డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో అల‌క్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టుల్లోకి పంపిస్తామ‌ని హెచ్చరించారు. ఆయా బెడ్ రూం ఇండ్ల‌ను వేగంగా పూర్తి చేయ‌డంలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు భాగ‌స్వాములు కావాల‌ని సూచించారు. 


క‌ల్లాలు, రైతు వేదిక‌ల‌కు మ‌రో వారం గ‌డ‌వు ఇప్పటికే పూర్తయినప్పటికీ, క‌రోనా కార‌ణంగా కొంద‌రు రైతులు ద‌ర‌ఖాస్తులు చేసుకోలేక‌పోయారన్నారు. అలాంటి వాళ్ళంద‌రి కోసం క‌ల్లాలు, రైతు వేదిక‌ల ద‌ర‌ఖాస్తుల‌కు మ‌రో వారం రోజుల‌పాటు గ‌డ‌వు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. పాకుల‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో మంజూరైన 18 చెక్ డ్యామ్ లు, 5 పీఎంజీఎస్ వై రోడ్లు, 43 పంచాయ‌తీరాజ్, బీటీ రినివ‌ల్స్  రోడ్లు,  జిల్లా మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ ఫండ్ నిధుల నుంచి మంజూరైన 6 ఆర్ అండ్ బి రోడ్లు త‌దిత‌ర ప‌నుల‌న్నింటీనీ నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

కరోనాతో అప్రమత్తంగా ఉండాలన్నారు. హ‌రిత హారం ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేయాలన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పాల‌కుర్తి రైతు వేదిక‌కు శంకుస్థాప‌న చేశారు. అలాగే తెలంగాణ‌కు 6వ విడ‌త హ‌రిత హారంలో భాగంగా క్యాంపు కార్యాల‌యంలో మొక్కలు నాటారు.


logo