సోమవారం 25 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 15:04:45

వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం : సీఎం కేసీఆర్

వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతాక్రమంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలిపారు. పలు రాష్ర్టాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ప్రధాని మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై ప్ర‌ధాని చర్చించారు.  ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. 

వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణను రూపొందించిన‌ట్లు తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టీ మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటి వీసీ కరుణాకర్ రెడ్డి, కోవిడ్ నిపుణులు కమిటీ సభ్యుడు గంగాధర్ తదితరులు స‌మావేశంలో పాల్గొన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.


logo