బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 12:56:05

రాష్ర్ట భ‌విష్య‌త్ కేసీఆర్ చేతిలోనే భద్రం : రావుల శ్రీధ‌ర్ రెడ్డి

రాష్ర్ట భ‌విష్య‌త్ కేసీఆర్ చేతిలోనే భద్రం : రావుల శ్రీధ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు చేతిలోనే భ‌ద్రంగా ఉంటుంద‌ని రావుల శ్రీధ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంత‌రం రావుల శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడారు. గ‌త 11 సంవ‌త్స‌రాల నుంచి బీజేపీలో వివిధ స్థాయిల్లో ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాను అని తెలిపారు. జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నాను. ఇవాళ దేశంలో, రాష్ర్టంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలించాక టీఆర్ఎస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నాయ‌క‌త్వంలో ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాను. కేసీఆర్, కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌తో పాటు హైద‌రాబాద్ బాగా అభివృద్ధి చెందింద‌న్నారు. ఈ రాష్ర్ట భ‌విష్య‌త్ కేసీఆర్ చేతిలోనే భ‌ద్రంగా ఉంటుంద‌న్నారు. దేశంలో అగ్ర‌గామిగా నిల‌వాలంటే కేసీఆర్ నాయ‌క‌త్వం త‌ప్ప‌నిస‌రి అని రావుల శ్రీధ‌ర్ రెడ్డి తెలిపారు. 

దుబ్బాక‌, జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

దుబ్బాక చైత‌న్య‌వంత‌మైన‌టువంటి ప్ర‌జాక్షేత్రం.. రేపు జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌ని శ్రీధ‌ర్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి తీరుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గ‌త ఫ‌లితం పునరావృతం కాబోతుంద‌న్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ నాయ‌క‌త్వంలో త‌న‌కున్న అనుభ‌వాన్ని, శ‌క్తియుక్తుల‌ను టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఉప‌యోగిస్తాను అని స్ప‌ష్టం చేశారు. ఇరిగేష‌న్‌, విద్యుత్, ఐటీ రంగంలో తెలంగాణ మందంజలో ఉంద‌న్నారు. ఈ రాష్ర్టం బాగుప‌డాలంటే కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఇది ప్ర‌తి పార్టీ నాయ‌కుడు గుర్తుంచుకోవాల‌న్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ ప్ర‌తి వ్య‌క్తిని, కుటుంబాన్ని దేవుడిలా ఆదుకున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు ప్ర‌భావిత‌మైన కుటుంబాల‌కు ఆర్థిక సాయం అంద‌జేశారు అని రావుల శ్రీధ‌ర్ రెడ్డి తెలిపారు.