గురువారం 09 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 19:09:42

వలస కార్మికులకు ఇక్కడే రేషన్‌ సరుకులు

వలస కార్మికులకు ఇక్కడే రేషన్‌ సరుకులు

హైదరాబాద్‌: వలస కార్మికులకు చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణలో పనిచేస్తున్న వారికి ఇక్కడే రేషన్‌ అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్మ నిర్భార్‌ భారత్‌ స్కీం క్రింద ప్రతి వలస కూలీకీ 5 కిలోల బియ్యం రెండు కిలోల కందిపప్పు అందించనున్నారు. మొదటగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రేషన్‌దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు అందించి.. ఇక్కడ విజయవంతమైతే అన్ని జిల్లాల్లో అమలుచేయాలని నిర్ణయించారు. 

‘టీఎస్‌ మైగ్రేంట్‌ యాప్‌' ద్వారా వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. యాప్‌ ద్వారా వలస కార్మికుల ఆధార్‌ నంబర్‌ అప్‌లోడ్‌ చేస్తే జాతీయ డేటాతో కనెక్టవుతుంది. ఇప్పటివరకు నగరంలో దాదాపు 55,127 మందిని యాప్‌ ద్వారా గుర్తించారు. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారనే తేడా లేకుండా లాక్‌డౌన్‌ పీరియడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 12 కిలోల బియ్యం అందించింది. ఐతే ప్రస్తుతం కూడా రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోలు అందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు అందిస్తున్నది. ఇప్పటికే రెండు దఫాలుగా ఒకసారి 34,283 మందికి 411.068 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందించగా, రెండో దఫా 39,844 మంది వలస కార్మికులకు 478.080 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేశారు. మూడో దఫా ఆత్మ నిర్భార్‌ స్కీం క్రింద అందించే బియ్యం పంపిణీ చౌకధరల దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలుచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ  పౌరసరఫరాలశాఖ కమిషనర్‌.. నగర సీఆర్వో బాల మాయాదేవిని ఆదేశించారు. 


logo