మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 26, 2020 , 07:11:01

రేపటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

రేపటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో నగర పౌరసరఫరాలశాఖ దీనికి సంబంధించిన బియ్యంతో పూర్తిస్థాయిలో సిద్ధమైంది. దీనిని 27వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి పౌరసరఫరాలశాఖ గిడ్డంగులకు బియ్యం తరలింపు పూర్తికావడంతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే రద్దీ పెరిగే అవకాశముండటంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రేషన్‌ దుకాణాలతోపాటు హైదరాబాద్‌ జిల్లాలోని కమ్యూనిటీ హాల్స్‌లో కూడా పంపిణీ చేపట్టనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందితోపాటు , జీహెచ్‌ఎంసీ, పోలీసుల సహాయ సహకారాలు కూడా తీసుకోనున్నారు. సహకారం అందించాలని పోలీసుశాఖతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఇప్పటికే పౌరసరఫరాలశాఖ సంప్రదించింది. సర్కిల్‌కు రెండు చొప్పున కమ్యూనిటీ హాళ్లను గుర్తించి అందులో బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికోసం పౌరసరఫరాలశాఖకు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల సేవలను వినియోగించుకోనున్నారు. మిగతా సిబ్బంది కోసం బిల్‌కలెక్టర్లను ఇచ్చే విధంగా జీహెచ్‌ఎంసీని కోరారు.logo