బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:53

భూపాలపల్లి మహిళకు అరుదైన గుర్తింపు

భూపాలపల్లి మహిళకు అరుదైన గుర్తింపు

  • మైనింగ్‌ సెకండ్‌ క్లాస్‌ మేనేజర్స్‌ సర్టిఫికెట్‌ సాధించిన సంధ్య
  • ట్విట్టర్‌లో అభినందించిన ఎమ్మెల్సీ కవిత

భూపాలపల్లి టౌన్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రాసకట్ల సంధ్య ఇండియన్‌మైనింగ్‌ సెక్టార్‌లో అండర్‌గ్రౌండ్‌ సెకండ్‌ క్లాస్‌ మేనేజర్స్‌ సర్టిఫికెట్‌ సాధించిన తొలి మహిళగా రికార్డుకెక్కింది. సింగరేణి కార్మికుడు రాసకట్ల రఘు కుమార్తె సంధ్య కొత్తగూడెంలో బీటెక్‌ మైనింగ్‌ పూర్తిచేసింది. 2018లో ప్లేస్‌మెంట్‌ ద్వారా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ హిందూస్థాన్‌ జింక్‌ వేదాంత కంపెనీలో ఉద్యోగం పొంది ఏడాదిపాటు అండర్‌గ్రౌండ్‌లో పనిచేసి సంస్థ మన్ననలు పొందింది. ఆమె ప్రతిభను గుర్తించి న యాజమాన్యం డీజీఎంఎస్‌ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేప్టీ) ధన్‌బాద్‌కు రెఫర్‌ చేసింది. డీజీఎంఎస్‌ ఆమెకు ఇండియన్‌ మైనింగ్‌ సెక్టార్‌లో అండర్‌గ్రౌండ్‌ సెకండ్‌ క్లాస్‌ మేనేజర్స్‌ సర్టిఫికెట్‌ను అందజేసింది. దేశ వ్యాప్తంగా భూగర్భ గనుల్లోనూ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలో ఎంపీగా ఉన్న కవిత పార్లమెంట్‌లో కోరారు. ఈ మేరకు మైనింగ్‌ సంస్థలు సానుకూలంగా స్పందించి ఉద్యోగాలు కల్పించాయి. దేశంలోనే తొలిసారి సర్టిఫికెట్‌ పొందిన సంధ్యను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ ద్వారా అభినందించారు.