మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:26:51

కరోనా కల్లోలం!

కరోనా కల్లోలం!

  • వేగంగా పెరుగుతున్న కేసులు
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరింత ఎక్కువ
  • క్రమంగా జిల్లాలకు మహమ్మారి వ్యాప్తి
  • నిర్లక్ష్యమే వైరస్‌ వ్యాప్తికి దోహదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: క్షణ క్షణం.. భయం భయం.. అడుగు బయట పెట్టాలంటే అయోమయం.. ఇతరులను కలువాలంటే అనుమానం! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు రాష్ట్రంలోనూ విజృంభిస్తున్నది. రోజురోజుకూ వైరస్‌ జడలు విప్పుకొంటున్నది. లాక్‌డౌన్‌కు ముందు పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ సడలింపులతో పూర్తిగా అదుపుతప్పుతున్నది. మాకేమవుతుందిలే అనే కొందరి నిర్లక్ష్యం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి రోజు 100కు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా, క్రమంగా ఇతర జిల్లాలకూ వైరస్‌ వ్యాప్తిచెందుతున్నది.

పది రోజులుగా విజృంభణ

పది రోజులుగా వరుసగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో కొన్ని జిల్లాల్లో కేసులు నమోదైనప్పటికీ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వం విజయవంతమైంది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత రావాణా ప్రారంభమైంది. వ్యాపారాలు, హోటళ్లు, దేవాలయాలు, ఇతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతూ వస్తున్నది. హైదరాబాద్‌కే పరిమితమైన వైరస్‌ కొన్ని జిల్లాలకు విస్తరిస్తున్నది. ప్రస్తుతం జిల్లాల్లో తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత మందికి వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద సమస్య

జీహెచ్‌ఎంసీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. రోజూ నమోదవుతున్న కేసుల్లో మూడొంతుల ఇక్కడే నమోదవుతున్నాయి. జూన్‌ 1న జీహెచ్‌ఎంసీలో 79 కేసులు కాగా, ఆ తర్వాత 6న 152 కేసులు, శనివారం 179, ఆదివారం 195 కేసులు నమోదయ్యాయి. గత పదిరోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. కేసులపై నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండానే రోడ్లపై తిరుగటం, భౌతికదూరం పాటించక వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ వరకు పరిస్థితి అదుపులోనే ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నది.


logo