బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:39:48

మానవాభివృద్ధిలో మనమెక్కడ?

మానవాభివృద్ధిలో మనమెక్కడ?

  • మానవాభివృద్ధి సూచిలో 129వ స్థానం 
  • తలసరి ఆదాయంలో 124వ ర్యాంకు
  • అసమగ్ర విధానాలు, పక్షపాత ధోరణే కారణం 
  • కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న కేంద్రం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విస్తారమైన ప్రకృతి వనరులు, అపారమైన సహజ సంపద ఉన్న భారత్‌.. మానవాభివృద్ధి సూచిలో మాత్రం ఎక్కడో అట్టడుగున మూలుగుతున్నది. స్వాతంత్య్రానంతరం గత 74 ఏండ్లుగా స్వదేశీ పాలకులే దేశాన్ని ఏలుతున్నప్పటికీ అడుగడుగునా అసమానత, వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇందుకు పాలకులు అనుసరిస్తున్న అసమగ్ర విధానాలు, పక్షపాత ధోరణే  కారణమని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నివేదిక పేర్కొంటున్నది. అభివృద్ధి పేరిట.. ఓట్లు, సీట్ల కోసం కొన్ని రాష్ర్టాలకు లక్షల కోట్లు నిధులు గుమ్మరించడం, మరికొన్ని రాష్ర్టాల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శించడం వల్లనే దేశంలో అభివృద్ధి అసమతుల్యంగా ఉన్నట్టు తెలుస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాలు భారీ ఎత్తున పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తిరిగి తమ వాటాను పొందడంలో మాత్రం తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి. కొన్ని దశాబ్దాలుగా.. చెల్లించే పన్నుల వాటా తక్కువగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి నిధులు పొందడంలో మాత్రం ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ముందువరుసలో ఉన్నాయి. 

యూపీ, బీహార్‌లో సమర్థమైన పాలకులు ఉన్నారంటూ కితాబునిచ్చే కేంద్రంలోని బీజేపీ నేతలు ఆ రాష్ర్టాలకే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ మానవాభివృద్ధి సూచిలో, తలసరి ఆదాయంలో అవి ఎంతో వెనుకబడి ఉన్నాయి. భారత్‌లో రాజకీయ పార్టీలు.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ర్టాలకు అవి పంపే పార్లమెంట్‌ సభ్యుల సంఖ్యను బట్టి కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక ప్రాధాన్యమిస్తాయని పలువురు అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అస్పష్టమైన, బూటకపు హామీ లు కుమ్మరిస్తూ ప్రభుత్వాలను ఏర్పాటుచేయడం వల్లనే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ), తలసరి ఆదా యం (పీసీఐ), మానాభివృద్ధి సూచి (హెచ్‌డీఐ)లో భారత్‌ ఎంతో వెనుకబడి ఉన్న ట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

భారత్‌ను దాటిపోయిన శ్రీలంక, బంగ్లాదేశ్‌

యూఎన్‌డీపీ 2019-20 నివేదిక ప్రకారం.. 189 దేశాలలో హెచ్‌డీఐలో భారత్‌ 129వ స్థానంలో ఉంది. ఇక తలసరి ఆదాయంలో 124వ స్థానంలో నిలిచింది. లక్సెంబర్గ్‌ 1,12,875 డాలర్లు (సుమారు రూ.82,39,875) తలసరి ఆదాయంతో మొదటిస్థానంలో ఉన్నది. అమెరికాలో తలసరి ఆదాయం 63వేల డాలర్లు (సుమారు రూ.45,99,000) కాగా భారత్‌లో 6,978 డాలర్లు (సుమారు రూ.5,09,394) మాత్రమే. నిన్నటి దాకా భారత్‌ కన్నా ఎన్నో రెట్లు వెనుకబడిన భూటాన్‌, శ్రీలంక, తాజాగా బంగ్లాదేశ్‌ సైతం తలసరి ఆదాయంలో భారత్‌ను అధిగమించినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. మానవాభివృద్ధి సూచికి 0 నుంచి 1.0 మధ్య ర్యాంకులు కేటాయిస్తారు. నార్వే 0.953 స్కోరుతో మొదటి ర్యాంకులో ఉండగా, రెండో స్థానంలో స్విట్జర్లాండ్‌ (0.944), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (0.939) ఉన్నాయి.  

చివరి స్థానంలో నిగర్‌ (0.354) ఉండగా, 129వ స్థానంలో ఉన్న భారత్‌ స్కోరు 0.640. హెచ్‌డీఐలో రాష్ర్టాల వారీగా కేరళ మొదటి స్థానంలో ఉండగా, బీహార్‌, యూపీ అట్టడుగున ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి పన్నుల వాటాను పొందడంలో ఇవి ముందున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు 18 శాతం (రూ.7,10,966 కోట్లు) అందుతుండగా, బీహార్‌ 9.7శాతం (రూ.3,82,529 కోట్లు) పొందుతున్నది. కానీ అధిక మొత్తంలో పన్నులు పంపుతున్న రాష్ర్టాలు.. కేరళ 2.5 శాతం, తెలంగాణ 2.4 శాతం, మహారాష్ట్ర 5.6 శాతం, కర్ణాటక 4.7 శాతం నిధులను మాత్రమే తిరిగి పొందుతున్నాయి. ప్రత్యేక హోదా పొందిన రాష్ర్టాలు (బీహార్‌ వంటివి) ఇతర రాష్ర్టాలు పంపుతున్న పన్నులపై ఆధారపడి బతుకుతున్నాయని ఆ నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ భారత్‌లో ఇంకా 28 శాతం (36.4కోట్లు) మంది పేదరికంలోనే ఉన్నారని ఎత్తిచూపింది.