సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 02:39:01

దురాక్రమణల లెక్క పక్కా

దురాక్రమణల లెక్క పక్కా
  • ‘రేవంత్‌ భూదందా’పై కలెక్టర్‌కు ఆర్డీవో నివేదిక
  • 5.21 ఎకరాలు బోనావెకెన్షియా పరిధిలో చేర్చాలని సిఫారసు
  • అసలు పట్టాదారు ఇంటిపేరు ‘వడ్డె’..
  • మధ్యలోచేరిన ‘దబ్బా’ ‘ఎర్రగండ్ల’

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ: ప్రభుత్వ భూముల కబ్జా, నీటివనరుల విధ్వంసానికి పాల్పడిన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అక్రమాలపై దర్యాప్తులో ప్రభుత్వం వేగం పెంచింది. రేవంత్‌రెడ్డి అండ్‌ కో సాగించిన భూదందాపై రెవెన్యూ అధికారులు నిజానిజాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వేనం. 127, 128, 34, 35,160లపై రాజేంద్రనగర్‌ ఆర్డీవో కే చంద్రకళ.. రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు సోమవారం నివేదిక సమర్పించినట్టు తెలిసింది. కోమటికుంట చెరువు కబ్జాను నియంత్రించకుండా ఉదాసీనంగా వ్యవహరించిన శేరిలింగంపల్లి తాసిల్దార్‌ వంశీమోహన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం ఆర్డీవో నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి. 


పత్రాలు లేకుండానే మారిన ఇంటిపేర్లు

గోపన్‌పల్లిలోని సర్వేనంబర్‌ 127లో 10.27 ఎకరాలు 1954-55 ఖాస్రా పహాణీలో వడ్డె హనుమ పేరిట ఉన్నది. 1960-61లో పట్టాదారుడిగా వడ్డె హనుమయ్య.. సాగుదారుగా వడ్డె లక్ష్మయ్యగా పేర్కొన్నారు. 1964 నుంచి 68 వరకు పట్టాదారు, సాగుకాలంలో వడ్డె లక్ష్మయ్య తండ్రి హనుమయ్యగా నమోదయింది. 1969-70, 1972-73, 1974-75లో వడ్డె మల్లమ్మ తండ్రి లక్ష్మ య్య పేరు.. 1975-76, 1976-77 పహణీల్లో వడ్డె మల్లయ్య తండ్రి లక్ష్మయ్య తదితరుల పేరిట రాశారు. ‘కాస్తు కాలమ్‌'లో మాత్రం టీ లీల, వెంకటరామయ్య పేరిట రెండెకరాలు, సూర్యనారాయణ పేరిట ఎకరం ఉన్నది. మిగిలిన ఐదెకరాల్లో మాత్రం కాస్తు కాలమ్‌లోనూ వడ్డె మల్లయ్య తదితరుల పేర్లే ఉన్నాయి. 1979-80 నుంచి 1988-89 వరకు మల్లయ్య తదితరుల పేరిట మొత్తం 10.21 ఎకరాలు రికార్డు చేశారు. 1989-90 నుంచి 1990-91 వరకు మల్లయ్య, మాద సుందరేషు పేరిట రికార్డు చేశారు. కానీ కాస్తుకాలమ్‌లో ఏ వెంకట్రావు 1.10 ఎకరాలు, రవి, మైసయ్యల పేరిట రెండెకరాలు, శ్రీరామ జయసింహ పేరిట రెండెకరాలుగా పేర్కొన్నారు. 


1990-91లో అలీ సలాంబిన్‌ మహమూద్‌ పేరిట 1.24 ఎకరాలు, రవి, మైసయ్యల పేరిట రెండెఎకరాలు అనుభవిస్తున్నట్టు ఉన్నది. 1976-77 వరకు హనుమయ్య, లక్ష్మయ్య, మల్లయ్యల ఇంటిపేరు వడ్డె అని ఉండగా.. 1979-80 నుంచి 1990-91 వరకు మల్లయ్యకు సంబంధించిన పహాణీల్లో ఇంటిపేరు లేదు. 1993-94 నుంచి ఇంటిపేరు దబ్బా (dabba)గా వచ్చింది. దబ్బా మల్లయ్యకు తోడు కో పార్టనర్‌గా ఏ వెంకటరావు, సలాంబిన్‌ మహాఫూజ్‌, సుందరేష్‌ మాదిల పేర్లు చేరాయి. అవికూడా 1993-94 నుంచి 1997-98 వరకు వచ్చాయి. 1998-99 నుంచి 1999-2000 లో దబ్బ మల్లయ్యకు కో పార్టనర్‌గా ఆర్‌ కళావతిబాయి పేరు చేరింది. ఏ వెంకట్రావు, అలీసలాంబిన్‌ల పేర్లను ఎలాంటి ఆధారాలు చూపించకుండానే రౌండప్‌ చేశారు. 2001-2002, 2002-03, 2003-04లో అలీసలాంబిన్‌, ఏ వెంకట్రావు, ఏ వెంగేశ్వర్‌రావు, ఆర్‌ కళావతి, శ్రీరామ జయసింహ పేరిట 10.21 ఎకరాలు చూపారు. అదికూడా పట్టాదారు, కాస్తు కాలమ్‌లో నమోదుచేశారు. 2004-05 నుంచి 2012-13 పహణీల్లో ఏ రేవంత్‌రెడ్డి, అలీసలీంబిన్‌, వెంకట్రావు, వెంగేశ్వర్‌రావు, ఆర్‌ కళావతి, శ్రీరామజయసింహల పేరిట 10.21 ఎకరాలు నమోదైంది. 


వడ్డె హనుమయ్య డాక్యుమెంట్‌ 161/1968 ప్రకారం టీ లీల తండ్రి సత్యనారాయణరావుకు రెండెకరాలు, 162/1968 ప్రకారం కే వెంకట్రామయ్య తండ్రి పుల్లయ్యకు రెండెకరాలు, 163/1968 ప్రకారం సత్యనారాయణ తండ్రి దక్షిణమూర్తికి ఎకరం వంతున విక్రయించారు. 

కానీ,1979-80 పహాణీలను మార్చి వడ్డెగా ఇంటిపేరు మాయమైంది. అంటే అక్కడి పట్టాదారులకు వారసులెవరూ లేరు. దాంతో దబ్బా మల్లయ్య పేరు చేర్చారు. 

దబ్బా మల్లయ్య, రామయ్య, ఎల్లయ్య, ఆంజనేయులు, కిష్టయ్యల నుంచి డాక్యుమెంట్‌ నం.2577/1988 ప్రకారం శ్యాంలెట్‌ మైసయ్య తండ్రి రామయ్య 10.20 ఎకరాలకు జీపీఏ తీసుకున్నారు. డాక్యుమెంట్‌ నం.10844/1989 ప్రకారం ఎన్‌ రవి తండ్రి చంద్రయ్య, ఎస్‌ మైసయ్య తండ్రి రామయ్యలు 2 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇక అక్కడి నుంచి 22 సేల్‌డీడ్ల ద్వారా పలువురికి భూమిని విక్రయించారు. అందులో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కూడా ఉన్నారు. 

అంతకుముందే లీల, వెంకట్రామయ్య, సూర్యనారాయణలకు వడ్డె కుటుంబం ఐదెకరాలు విక్రయించింది. కానీ దబ్బా మలయ్య, అతని కుటుంబసభ్యులు జీపీఏ డాక్యుమెంట్‌ నంంబర్‌ 2577/1988 ద్వారా శ్యాంలెట్‌ మైసయ్యకు 10.20 ఎకరాలు అప్పగించారు. మరో 1.15 ఎకరాలను వెంగేశ్వర్‌రావుకు బదిలీచేశారు. ఆ తర్వాత దబ్బా మల్లయ్య డాక్యుమెంట్‌ నంబర్‌ 44/2005 ప్రకారం జీపీఏను క్యాన్సిల్‌ చేసుకున్నారు.

ఎర్రగండ్ల కుటుంబం చాలా డాక్యుమెంట్లు చేశారు. అయితే, రికార్డులు, డాక్యుమెంట్లల్లో ఆ కుటుంబం లేదు. వారినుంచి అమ్మకాలు, కొనుగోళ్లు కూడా చెల్లవని తేలింది.     

రెవెన్యూ రికార్డులు, చట్టం ప్రకారం వడ్డె కుటుంబం నుంచి కొనుగోళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు కానున్నాయి. ఆ తర్వాత దబ్బా, ఎర్రగండ్ల ఇంటిపేరు కలిగిన వ్యక్తులు అమ్మిన, కొన్న డాక్యుమెంట్లు చెల్లవని నివేదికలో స్పష్టంచేసినట్టు తెలిసింది.


క్షేత్రస్థాయి పరిశీలన

సర్వేనంబర్‌ 127లో 12.02 ఎకరాలకు ప్రహరీ నిర్మించి, గేట్లు ఏర్పాటుచేశారు. ఇందులో సర్వే నంబర్‌ 34లోని ప్రభుత్వ భూమి 1.21 ఎకరాలు కబ్జా చేశారు. బండ్లబాట కింద 10 గుంటలు కనుమరుగయింది. 

కోమటికుంటలో ఎఫ్‌టీఎల్‌ 32 గుంటలు, బఫర్‌ జోన్‌ కిందకు 22 గుంటలుగా తేలింది. 

వాల్టా చట్టం, ఏసీ(టీఏ) ల్యాండ్‌ రెవెన్యూ యాక్ట్‌, 1317 ఫస్లీ సెక్షన్‌ 24ను ఉల్లంఘించారు. 

స్థానిక విచారణ ప్రకారం నిర్మాణాలను ఏ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డిగా తేలింది. 

సర్వే నంబర్‌ 127లో 5.21 ఎకరాలకు వారసులు లేరు. లేదా హక్కుదారులు లేరు. దాంతో బోనావెకెన్షియా చట్టం 1974 పరిధిలోకి వస్తుంది. అడ్వకేట్‌ జనరల్‌, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ లీగల్‌ ఒపీనియన్‌ ప్రకారం చర్యలు చేపట్టనున్నారు.


logo