బుధవారం 27 మే 2020
Telangana - May 16, 2020 , 01:07:01

మూడు జిల్లాల్లో ర్యాండమ్‌ సర్వే

మూడు జిల్లాల్లో ర్యాండమ్‌ సర్వే

ఐసీఎమ్మార్‌, ఎన్‌ఐఎన్‌ ఆధ్వర్యంలో 600 రక్త నమూనాల సేకరణ 

కొవిడ్‌-19 సామాజికవ్యాప్తి, రోగ నిరోధకశక్తి అంచనాల కోసం సర్వే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 సామాజిక వ్యాప్తి, ప్రజల్లో రోగ నిరోధశక్తి అంచనాలు రూపొందించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూ ట్రిషియన్‌ (ఎన్‌ఐన్‌) బృందాలు శుక్రవారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సర్వేను ప్రారంభించాయి. కామారెడ్డి, నల్లగొండ, జనగామ జిల్లాల్లో 200 మంది చొప్పున 600 మం ది నుంచి ర్యాండమ్‌గా రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించాయి. సర్వే కోసం మూడుజిల్లాల్లో 10 గ్రామాల చొప్పున 30 గ్రామాలను  ఎంపికచేశాయి. ప్రతిజిల్లాలో ఐదు బృందాలు సర్వే చేస్తున్నాయి. తొలిరోజు ఆయాజిల్లాల్లో ఐదు గ్రామాల చొప్పు న.. ఒక్కోగ్రామంలో 40 మందికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ రూపొందించిన ఎలిసా కిట్లతో ర్యాండమ్‌గా రక్త నమూనాలు సేకరించారు. శనివారం కూడా మరో 600 మంది నుంచి రక్త నమూనాలు సేకరించనున్నారు. ప్రతి గ్రామంలో 18 ఏండ్లకు పైబడిన మహిళలు, పురుషులను సమానంగా ఎంపికచేసుకుని సేకరిస్తున్నారు. ఒక్కో జిల్లా లో ర్యాండమ్‌గా 400 మందికి పరీక్షలు చే యాలని, ఇందులో వైద్య సిబ్బందికి కూడా నిర్వహించాలని ఐసీఎమ్మార్‌ నిర్దేశించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రక్త నమూనాలు సేకరిస్తున్నాయి. వీటిని చెన్నై ప్రయోగశాలకు పంపుతారు. అక్కడినుంచి ఢిల్లీకి పంపేందుకు ఏర్పాట్లుచేసినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. కేంద్రం చేపట్టిన ఈ సర్వే ద్వారా దేశవ్యాప్తంగా ఆయాప్రాంతాల ప్రజల్లో రోగ నిరోధకశక్తి ఏ మేరకు ఉన్నది, శరీరంలో యాంటీబాడీ పనితీరుపై అంచనాలను రూపొందించి భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టనున్నట్టు సర్వే బృందం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 69 జిల్లాల్లో 24 వేల మందికి ర్యాండమ్‌గా రక్త నమూనాలు సేకరించాలని ఐసీఎమ్మార్‌ ఇప్పటికే నిర్ణయించింది. 

ఎక్కడెక్కడ సర్వే చేశారంటే..

కామారెడ్డి, జనగామ, నమస్తే తెలంగాణ/ నీలగిరి: జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 15 చోట్ల ఐసీఎమ్మార్‌, ఎన్‌ఐఎన్‌ బృందాలు సర్వేచేశాయి. జనగామలోని 2వ వార్డుతోపాటు మరో నాలుగు గ్రామాల్లో, నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, కట్టంగూర్‌, ఇందుగుల, తానేదారుపల్లితోపాటు జిల్లాకేంద్రంలోని 37వ వార్డులో, కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలోని 4 వార్డు, తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌, ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు, రాజంపేట మండలం తలమడ్ల, మాచారెడ్డి మండలం భవానిపేటలో రక్త నమూనాలు సేకరించాయి.


logo