సోమవారం 25 జనవరి 2021
Telangana - Oct 23, 2020 , 01:31:17

స్పందించి.. సాయమందించి

స్పందించి.. సాయమందించి

  • సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ
  • హెటిరో డ్రగ్స్‌ వితరణ 10 కోట్లు
  • రామోజీ గ్రూప్‌ విరాళం 5 కోట్లు
  • ఉపాధ్యాయులు ఒకరోజు వేతనం
  • ఒకరోజు వేతనాన్ని ప్రకటించిన ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం
  • హెటిరో విరాళం 10 కోట్లు

గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫౌండర్‌, చాన్స్‌లర్‌ జీ విశ్వనాథ్‌ తరఫున  కోటి రూపాయల విరాళాన్ని మంత్రి కే తారకరామారావుకు అందజేస్తున్న సంస్థ ప్రతినిధి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘చేయి చేయి కలుపుదాం.. వరద బాధితులను ఆదుకుందాం’ అన్న సీఎం కేసీఆర్‌ పిలుపునకు దాతలు స్పందిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో వరదలతో క‘న్నీరు’ నిండిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలు గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కే తారకరామారావును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. హెటిరో డ్రగ్స్‌ సంస్థ రూ.10 కోట్ల విరాళాన్ని అందజేసింది. సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్న ట్టు సంస్థ చైర్మన్‌ పార్థసారథిరెడ్డి తెలిపారు. రామోజీగ్రూప్‌ సంస్థ చైర్మన్‌ రామోజీరావు ప్రకటించిన రూ.5 కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు అందించారు. 


ఈ సందర్భంగా రామోజీరావుకు కేటీఆర్‌ ఫోన్‌చేసి ధన్యవాదాలు తెలిపారు. కిమ్స్‌ హాస్పిటల్‌, యశోద హాస్పిటల్‌ చెరో కోటి రూపాయల విరాళాన్ని అందించాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తరఫున సంస్థ వ్యవస్థాపకుడు, చాన్స్‌లర్‌ జీ విశ్వనాథ్‌ రూ.కోటి చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. మెడికవర్‌ హాస్పిటల్‌ తరఫున రూ.50 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళమిచ్చారు. సాగర్‌ సిమెంట్స్‌ లిమిటెడ్‌ తరఫున రూ.50 లక్షల విరాళం చెక్కును సంస్థ ప్రెసిడెంట్‌ కే గణేశ్‌ బీఆర్కేభవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందించారు. ప్రముఖ హీరో రామ్‌ పోతినేని రూ.25 లక్షలు, ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌ శంకర్‌ రూ.10 లక్షల చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా కుటుంబసభ్యులతో కలిసి ఫౌండేషన్‌ తరఫున రూ.10 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందించారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు విరాళాలిచ్చిన ప్రతి ఒక్కరికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 


ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఒకరోజు వేతనం విరాళం

వరద బాధితులను ఆదుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలు ముందుకొస్తున్నాయి. తమ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం గురువారం ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరాచారి, ఇతర నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, కే దశరథ్‌ ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి తమ సమ్మతిపత్రాన్ని అందజేశారు. 


logo