గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:35:29

‘గుండె ఆపరేషన్‌'కు రామన్న ఆర్థిక భరోసా

‘గుండె ఆపరేషన్‌'కు రామన్న ఆర్థిక భరోసా

  • సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.7.60 లక్షలు మంజూరుకు హామీ
  • మంత్రి కేటీఆర్‌కు సారంపల్లి యువకుడి కృతజ్ఞతలు

సిరిసిల్ల రూరల్‌: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన వంగపల్లి రాజుకు అండగా నిలిచారు. శస్త్రచికిత్సకు వెచ్చించిన మొత్తాన్ని సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాజు మూడు నెలల కిందట గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని సన్‌షైన్‌ దవాఖానలో చేరాడు. వైద్యులు ఆపరేషన్‌ చేసి ప్రాణాలు కాపాడారు. ఇందుకు రూ.7.60 లక్షలు ఖర్చు చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గుగ్గిల్ల అంజయ్యగౌడ్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకుల సాయంతో రాజు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తన దీనస్థితిని వివరించడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సదరు యువకుడు ఆపరేషన్‌కు వెచ్చించిన మొత్తం నగదును సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరు చేయిస్తానని భరోసానిచ్చారు. అడిగిన వెంటనే ఆదుకుంటానని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు రాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బతికినంత కాలం కేటీఆర్‌కు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు.


logo