శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:28:14

శృంగేరి ఆస్థాన విద్వాంసుడిగా రామకృష్ణశాస్త్రి

శృంగేరి ఆస్థాన విద్వాంసుడిగా రామకృష్ణశాస్త్రి

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: ప్రముఖ జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష విద్వాంసుడిగా నియతులయ్యారు. దసరా సందర్భంగా శృంగేరి పీఠంలో జరిగిన ప్రత్యేక ఉత్సవంలో విధుశేఖర భారతీస్వామి ఆయనకు ఆస్థాన జ్యోతిష విద్వాంసుడిగా నియమిస్తూ పట్టాను ప్రదానం చేశారు. ఈ మేరకు శృంగేరి పీఠం మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది. జ్యోతిషశాస్త్రంలో రామకృష్ణశాస్త్రి చేసిన పరిశోధనలు, సనాతన సూర్య సిద్ధాంతంపై సమర్పించిన పరిశోధనా పత్రాన్ని అధ్యయనంచేసిన అనంతరం విధుశేఖరులు వారిని నియమించినట్లు తెలిపారు. తెలుగునాట చిన్న వయసులోనే జ్యోతిష శాస్ర్తాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి మూడు పీహెచ్‌డీ పట్టాలను సాధించి, నాలుగు బంగారు పతకాలను అందుకున్న రామకృష్ణశాస్త్రి ప్రస్తుతం ఉస్మానియా, తెలుగు విశ్వ విద్యాలయంలో  ఎంఏ ఆస్ట్రాలజీ (దూరవిద్య) కోర్సుకు గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.