ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 19:09:56

వేద వ్యవసాయంపై ఈ 18న‌ రామకృష్ణ మఠం వెబినార్

వేద వ్యవసాయంపై ఈ 18న‌ రామకృష్ణ మఠం వెబినార్

హైదరాబాద్ : రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 21వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్ర‌ముఖ‌ వ్యక్తులతో వెబినార్‌లు నిర్వహిస్తోంది. రిసర్జంట్ ఇండియా పేరుతో వేద వ్యవసాయంపై వెబినార్ నిర్వహిస్తోంది. ఈ నెల 18న ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమంలో కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ముఖ్యవక్తగా పాల్గొంటారని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. మరో వక్తగా వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ బాలాజీ సుకుమార్ వెబినార్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ప్రస్తుతం భారతీయ వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండ‌లం కాశింపేట గ్రామంలో ఆయన కృష్ణ బియ్యాన్ని(న‌ల్ల బియ్యం) పండిస్తున్నారు. తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం విభాగానికి చెందిన కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్య‌వ‌సాయంలో ప్ర‌యోగాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇటీవలే కౌటిల్య సాగుచేస్తున్న పొలాన్ని సందర్శించారు. కృషి భారతం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలను ప్రశంసించారు. కృష్ణ బియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి ప్రాధాన్యం ఇవ్వాలని కౌటిల్య కృ‌ష్ణ‌న్ కోరుతున్నారు. కృ‌షి భార‌తం సంస్థ తరపున కౌటిల్య క్రమం తప్పకుండా వృ‌ష‌భోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. వేద వ్యవసాయంపై రైతు సోద‌రుల‌కు ఎక్కువ ప్రయోజనాలుంటాయని కౌటిల్య చెబుతున్నారు.logo