శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 03:06:46

ఏడాదిలోనే చిట్టడివి!

ఏడాదిలోనే చిట్టడివి!

  • రామగుండం ఎన్టీపీసీలో‘మియావాకి’ అమలు
  • అర్బన్‌ ఫారెస్టు ఏర్పాటువిజయవంతం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తక్కువ జాగలో ఎక్కువ మొక్కలు పెంచి చిట్టడివిగా మార్చేందుకు తెలంగాణ అటవీశాఖ చేపట్టిన వినూత్న ప్రయోగం విజయవంతమైంది. పట్టణప్రాంతాల్లో చిన్న అడవులను సృష్టించేందుకు మియావాకి అనే సరికొత్త విధానంతో వేసిన తొలి అడుగు సత్ఫలితాలిచ్చింది. రామగుండం పట్టణంలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు హరితస్ఫూర్తిని చాటుతున్నది. 

53 జాతులు.. 3000 వేల మొక్కలు 

తెలంగాణలో మొదటిసారిగా రామగుండం పట్టణంలోని ఎన్టీపీసీకి చెందిన 1,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పైలట్‌ ప్రాజెక్టుగా మియావాకి విధానం ద్వారా అర్బన్‌ఫారెస్టు ఏర్పాటుకు అటవీశాఖ ప్రయత్నించింది. నాటి పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేన చొరవతో ఎన్టీపీసీ.. ఖాళీస్థలంలో అడవిని పెంచడానికి అంగీకరించింది. నేల నాణ్యత, నీటి లభ్యతను పరిశీలించి తగిన మొక్కలను ఎంపికచేశారు. 0.60 మీటర్ల లోతు వరకు గుంతలు తవ్వారు. అందులో ఎరువులు, జీవామృతం తదితరాలను పోశారు. మియావాకి విధానంలో 1,400 చదరపు మీటర్ల స్థలంలో 53 జాతులకు చెందిన 3,000 మొక్కలు నాటారు. ఏడాదిలోగా అవన్నీ ఏపుగా పెరిగాయి. రామగుండం పట్టణంలో అతిపెద్ద చిట్టడివిగా తయారైంది. దీంతో రాష్ట్రంలోని అనేక అర్బన్‌ పార్కుల్లో ప్రస్తుతం ఇదే విధానాన్ని అమలుచేస్తున్నారు. ఉప్పల్‌లోని భాగ్యనగర్‌ నందనవనం, చౌటుప్పల్‌లో అర్బన్‌పార్కు, మేడ్చల్‌లోని ఆక్సిజన్‌ పార్కుల్లోనూ ఈ విధానంలోనే మొక్కలు నాటారు. ఎక్కడ ఖాళీ జాగ కనిపించినా దీన్నే అమలుచేయాలని అటవీశాఖ భావిస్తున్నది.

ఇదీ మియావాకి విధానం

చిన్న పెరడును అడవిగా మార్చే పద్ధతిని జపాన్‌ శాస్త్రవేత్త అకిరా మియావాకి తీసుకొచ్చారు. ఆ శాస్త్రవేత్త పేరుతోనే మియావాకి విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంతో జపాన్‌లోని చిన్న ప్రాంతాల్లో తక్కువ జాగలో ఎక్కువ మొక్కలు నాటి అడవిని సృష్టించారు.logo