గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 01:19:56

లోకల్‌ రాఖీ మస్తు గిరాకీ

లోకల్‌ రాఖీ మస్తు గిరాకీ

 • l చైనా వస్తువుల బహిష్కరణతో  దేశీయంవైపు చూపు
 • l హైదరాబాద్‌లోని బేగంబజార్‌, ధూల్‌పేటలో తయారీ
 • l రక్షాబంధన్‌ వేళ దేశవ్యాప్తంగా  6 వేలకోట్ల వ్యాపారం
 • l సీఏఐటీ నిర్ణయంతో డ్రాగన్‌కు  రూ.4 వేల కోట్ల నష్టం?

  ఇప్పటిదాకా యాప్‌లతో దాడి..  ఇప్పుడు రాఖీలతో దాడి! చైనాపై  భారతావని ఆర్థిక యుద్ధం  చేస్తున్నది. గల్వాన్‌ ఘటనతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దేశ వస్తువుల  వాడకాన్ని తగ్గించాలని కోరింది.  ఈ నేపథ్యంలో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌  ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ)..ఆ దేశం నుంచి రాఖీలను దిగుమతి చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నది. 

  ఈ నిర్ణయంతో స్థానికంగా తయారుచేసే రాఖీలకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. 

  హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏటా రక్షాబంధన్‌ సందర్భంగా చైనా వేల కోట్ల వ్యాపారం చేస్తున్నది. రాఖీల ముడిసరుకు, దారాలు, పూసలు, చమ్మీలు, స్పాంజ్‌, ఇతరత్రా అలంకరణ సామగ్రిని తక్కువ ధరకు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నది. ఏటా దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల రాఖీలను విక్రయిస్తుండగా, సుమారు రూ.6 వేల కోట్ల వ్యాపారం కొనసాగుతున్నది. అందులో చైనా వాటానే రూ.4 వేల కోట్లు కావడం గమనార్హం. గల్వాన్‌ ఘటన ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. చైనా రాఖీలను బహిష్కరిస్తున్నట్టు సీఏఐటీ పేర్కొంది. వ్యాపారులకు సంబంధించి కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ అనేది దేశంలో అతిపెద్ద సంస్థ. ఇందులో సుమారు 40 వేల అసోసియేషన్లు భాగస్వాములుగా ఉండగా, సుమారు 7కోట్ల మంది వ్యాపారులు సభ్యులుగా ఉన్నారు. సరిహద్దుల్లోని సైనికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకుగాను చైనా రాఖీలను, రాఖీలకు సంబంధించిన ఉత్పత్తులను ఈ సారి దిగుమతి చేసుకోవడం లేదని ప్రకటించింది. ఇప్పటికే చైనాకు ఇచ్చిన వెయ్యికోట్ల రాఖీల తయారీఆర్డర్‌ను రద్దు చేసినట్టు వెల్లడించింది. ఈ సారి పూర్తిగా భారతీయ రాఖీలతో పండుగను జరుపుకోవాలని సీఏఐటీ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బహుమతులు, బొమ్మలు, మిఠాయి తదితర మొత్తం 3వేల రకాల చైనా ఉత్పత్తులను కూడా బహిష్కరించేందుకు ప్రణాళికను సీఏఐటీ సిద్ధం చేయడం గమనార్హం.

  మన రాష్ట్రంలో..

  హైదరాబాద్‌లోని ధూల్‌పేట, బేగంబజార్‌, రహీంనగర్‌, మంగళ్‌హాట్‌, సుల్తాన్‌బజార్‌కు చెందిన వ్యాపారులు రాఖీలను తయారుచేస్తుంటారు. ఇక్కడ తయారైన రాఖీలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు, కొనుగోలుదారులు ఖరీదు చేస్తుంటారు. రూ.2 నుంచి మొదలు రూ.2 వేల ధర పలికే రాఖీలు సైతం అందుబాటులో ఉంటాయి. బేగంబజార్‌ మార్కెట్‌లో సిద్ధిఅంబర్‌బజార్‌, గోషామహాల్‌, గౌలిగూడ తదితర ప్రాంతాల్లోని బంగారు వర్తక వ్యాపారులు సైతం బంగారు, వెండి రాఖీలను తయారుచేసి విక్రయిస్తుంటారు. ఈ సారి చైనా నుంచి పోటీ లేకపోవడంతో స్థానిక రాఖీలకే డిమాండ్‌ పెరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

  పక్కా లోకల్‌

  దేశంలో రాఖీల తయారీకి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ప్రసిద్ది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి తదితర ప్రాంతాల్లోనూ వివిధ రకాల రాఖీలు తయారవుతుంటాయి. వీటి తయారీలో ఎక్కువగా మహిళలే పాల్గొంటుంటారు. ఈ ప్రాంతాల నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు రాఖీలకు దిగుమతి అవుతుండేవి. కొన్నేండ్లుగా వాటి మార్కెట్‌కు చైనా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. చైనా తయారు చేస్తున్న రాఖీలు, సరఫరా చేస్తున్న ముడిసరుకులు తక్కువ ధరలోనే లభ్యం కావడమే అందుకు కారణం. ఫలితంగా స్వల్పకాలంలోనే రాఖీల మార్కెట్‌లో ఆ దేశం గుత్తాధిపత్యాన్ని సాధించింది. ఈసారి నెలకొన్న పరిస్థితుల రీత్యా చైనా మార్కెట్‌కు తీరని నష్టం వాటిల్లనున్నది. లోకల్‌ రాఖీలకు విపరీతమైన డిమాండ్‌ పెరగనుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.    logo