సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 01:46:45

అమ్మకానికి రాజీవ్‌ స్వగృహ

అమ్మకానికి రాజీవ్‌ స్వగృహ
  • విధివిధానాల ఖరారుకు కార్యదర్శుల కమిటీ ఏర్పాటు
  • ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
  • కార్పొరేషన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజీవ్‌ స్వగృహ ఆస్తులను యథాతథంగా విక్రయించేందుకు ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని నియమించింది. 80శాతం నిర్మాణాలు పూర్తయిన రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లతోపాటు రాజీవ్‌ స్వగృహకు చెందిన ఇతర ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన విధివిధానాలను కమిటీ ఖరారుచేస్తుంది. గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు కార్యదర్శుల కమిటీని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 


ఉమ్మడి రాష్ట్రంలో తాకట్టు

గతంలో వాటా సొమ్ము చెల్లించినవారితోపాటు ఇతరులు ఎవరైనా ఈ ఇండ్లను కొనుగోలు చేసుకోవచ్చునని జీవోలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్‌ స్వగృహ ఇండ్లను నిర్మించేందుకు రాజీవ్‌స్వగృహ కార్పొరేషన్‌ ఏర్పాటయ్యింది. అప్పట్లో రూ.8,504 కోట్ల అంచనాతో 32 ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో తెలంగాణ ప్రాంతంలో రూ.6,301 కోట్లతో 20 ప్రాజెక్టులు మొదలయ్యాయి. వీటి కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలోని 784 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి, రూ.1000 కోట్ల రుణం తీసుకొన్నది. ఆ తర్వాత కార్పొరేషన్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో 2011లోనే ఇండ్ల నిర్మాణం నిలిపివేశారు. 


ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీర్చకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రూ.1071.99 కోట్లు చెల్లించి, తనాఖా పెట్టిన భూములను విడిపించింది.  తాజాగా ఈ ఫ్లాట్లను యథాతథంగా విక్రయించి, నిధులు సమకూర్చడం ద్వారా కార్పొరేషన్‌ను ఆర్థిక సంక్షో భం నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ఇండ్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చిన్నప్పటికీ, మధ్య తరగతి సొంతింటి కలను తీర్చేందుకు వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలను దృష్టిలో పెట్టుకొని రాజీవ్‌ స్వగృహ ఆస్తుల ధరలను ఖరారు చేయనున్నారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా అమ్మకం ప్రక్రియను చేపట్టనున్నారు. కమిటీ పూర్తి విధివిధానాలను ఖరారు చేయనున్నది. 


logo