శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:34

విక్రయానికి రాజీవ్‌ స్వగృహ ఇండ్లు

విక్రయానికి రాజీవ్‌ స్వగృహ ఇండ్లు

  • అంతర్జాతీయ కన్సల్టెన్సీకి ధరల అంశం
  • పదిహేను రోజుల్లో ధరలు ఖరారు
  • ఓపెన్‌ టెండర్ల ద్వారా ఇండ్ల అమ్మకం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘రాజీవ్‌ స్వగృహ పథకం’ కింద నిర్మించిన ఇండ్లను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హౌజింగ్‌ కార్పొరేషన్‌ 2009లో పోచారం, బండ్లగూడలో ఈ పథకం కింద సుమారు 4 వేల గృహాలను నిర్మించింది. నాటి పాలకులు స్పష్టమైన మార్గదర్శకాలను పాటించకపోవడంతో నిర్మాణాలు పూర్తయినా విక్రయాలు జరుగలేదు. ఈ ఇండ్ల అమ్మకంలోఉన్న అవరోధాలన్నింటినీ అధిగమించి ఇండ్లను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బండ్లగూడలో 2,246, పోచారంలోని 1,470 గృహాలను విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇండ్లకు విలువ కట్టే అంశాన్ని అంతర్జాతీయ కన్సల్టెన్సీ ‘నైట్‌ఫ్రాంక్‌'కు అప్పగించారు. మార్కెట్‌లో డిమాండ్‌, ఈ ప్రాజెక్టులోని నిర్మాణాల విలువ, ఎంత ధరకు అమ్మితే ప్రభుత్వానికి ఏ మేరకు ఉపయోగమనే విషయాలను అధ్యయనం చేసి రెండుమూడ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. దాని ఆధారంగా 15 రోజుల్లో ధరలను ఖరారు చేసి, ఓపెన్‌ టెండర్ల ద్వారా విక్రయించనున్నట్టు గృహనిర్మాణశాఖ అధికారులు వెల్లడించారు.


logo