శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 03:49:01

రాజీవ్‌ స్వగృహకు పరిష్కారం

రాజీవ్‌ స్వగృహకు పరిష్కారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సమైక్య పాలకులు ఏడేండ్ల క్రితం వదిలేసి వెళ్లిన రాజీవ్‌ స్వగృహ ఇండ్లను తెలంగాణ ప్రభుత్వం కొలిక్కి తెస్తున్నది. రాజీవ్‌ స్వగృహ కింద 36 ప్రాజెక్టులు చేపట్టిన నాటి పాలకులు తెలంగాణలోని భూములను తనఖాపెట్టి బ్యాంకుల నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకొన్నారు. అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వంపై భారం మోపారు. మూడేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ అప్పుతోపాటు రూ.1,200 కోట్ల వడ్డీని బ్యాంకులకు చెల్లించి తనఖాలో ఉన్న 784 ఎకరాల భూములను విడిపించింది. ఇప్పుడు ఆ భూములను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇటీవల జరిగిన క్యాబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఫ్లాట్లు బుక్‌చేసుకొన్న లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యమిచ్చి మిగిలిన ఫ్లాట్లను మార్కెట్‌ ధర ప్రకారం అమ్మాలని భావిస్తుండటంతో మధ్యతరగతి వర్గాల సొంతింటి కల త్వరలో సాకారం కానున్నది.


నిలువునా ముంచారు

2007లో రూ.6,400 కోట్లతో రాజీవ్‌స్వగృహ ప్రారంభమైంది. 36 ప్రాజెక్టుల్లో 20 తెలంగాణలో, 16 ఏపీలో చేపట్టారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడే చాలామంది రూ.5 వేలు చొప్పున చెల్లించి ఫ్లాట్లను బుక్‌చేసుకున్నారు. ఈ ఇండ్ల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదల చేయగా.. అడ్వాన్స్‌ బుకింగ్‌ రూపంలో కొనుగోలుదారుల నుంచి రూ.370 కోట్లు రాబట్టారు. ఈ నిధులతో 2011 వరకు కొంత పని పూర్తిచేశారు. ఆ తర్వాత బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు 2012లో ఉన్నతాధికార కమిటీని నియమించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం.. 2013లో పేదల ఆశలకు గండికొడుతూ జీవో 11ను విడుదల చేసింది. రాజీవ్‌ స్వగృహ ఇండ్లను నిర్మించలేమని, అడ్వాన్స్‌ చెల్లించినవారికి డబ్బు వాపసు ఇవ్వాలని ఆ జీవోలో పేర్కొనడంతో పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇండ్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. తెలంగాణలోని 14 ప్రాజెక్టుల్లో నిర్మాణాలు చేపట్టి దాదాపు 3,716 ఫ్లాట్ల నిర్మాణాలను 96 శాతం మేరకు పూర్తిచేసింది. మరో 5,280 ఫ్లాట్లు 639 ఇండిపెండెంట్‌ ఇండ్లు సెమీ ఫినిషింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు అన్ని ప్రాంతాల్లో ఓపెన్‌ ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి.
logo