బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 00:04:42

కోలుకుంటున్న రజినీకాంత్‌

కోలుకుంటున్న రజినీకాంత్‌

  • నిలకడగా సూపర్‌స్టార్‌ ఆరోగ్యం
  • అపోలో దవాఖాన హెల్త్‌ బులెటిన్‌
  • ఫోన్‌లో తమిళనాడు సీఎం పరామర్శ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తమిళ అగ్రనటుడు, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ క్రమంగా కోలుకుంటున్నారు. రక్తపోటులో హెచ్చుతగ్గులతో దవాఖానలో చేరిన రజినీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని జూబ్లీహిల్స్‌ అపోలో దవాఖాన వైద్యులు శనివారం వెల్లడించారు. శుక్రవారంతో పోలిస్తే రక్తపోటు అదుపులోకి వచ్చిందని తెలిపారు. పలు వైద్యపరీక్షల ఫలితాల్లో ఎలాంటి సమస్యలు లేవని తేలినట్టు హెల్త్‌ బులెటిన్‌ విడుదలచేశారు. మరికొన్ని పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉన్నదని చెప్పారు. ఆదివారం ఉదయం వరకు రజినీకాంత్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని, రిపోర్టులు సానుకూలంగా వస్తే డిశ్చార్జి చేసే విషయంపై నిర్ణయం తీసుకొంటామని దవాఖానవర్గాలు పేర్కొన్నాయి. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన రజినీకాంత్‌ రక్తపోటులో హెచ్చుతగ్గులతో శుక్రవారం అపోలో దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. రజినీకాంత్‌ను తమిళనాడు సీఎం కే పళనిస్వామి శనివారం ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. రజినీకాంత్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

రజినీ త్వరగా కోలుకోవాలి: మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

రజినీకాంత్‌ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర మంత్రులు కే తారకరామారావు, హరీశ్‌రావు ఆకాంక్షించారు. శనివారం మంత్రులు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘అసమానమైన ప్రతిభ ఉన్న వ్యక్తి, తలైవా రజినీకాంత్‌ త్వరగా కోలుకోవాలి’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలి’ అని మంత్రి హరీశ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


logo