సోమవారం 01 జూన్ 2020
Telangana - May 14, 2020 , 02:27:04

ఏపీ మాటలు నమ్మేది ఎట్లా?

ఏపీ మాటలు నమ్మేది ఎట్లా?

  • టెలిమెట్రీకే దిక్కులేదు.. ఇక నీటిలెక్క తేలుస్తుందా?
  • ఏపీ తన వాటాకు లోబడి వాడుకోవడం వట్టిమాటే
  • సాంకేతిక పర్యవేక్షణే లేదు
  • కృష్ణాబేసిన్‌లో తెలంగాణ తాగునీటికీ కష్టమే
  • టెండర్లు పిలువకుండా ఏపీని ఆదేశించండి
  • ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ డిమాండ్‌
  • కృష్ణా బోర్డు చైర్మన్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుచేయాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ 2016లో ఆదేశిస్తే.. పోతిరెడ్డిపాడు దగ్గర నేటికీ సరైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటుకాలేదని తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. సాంకేతిక పర్యవేక్షణే లేనప్పుడు వాటాకు లోబడి కృష్ణా జలాలను వాడుకుంటామంటున్న ఆంధ్రప్రదేశ్‌ను నమ్మేదెలా? అని ప్రశ్నించారు. రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట విచారణ కొనసాగుతూనే ఉన్నదని.. తాత్కాలిక ఒప్పందం ప్రకారమే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల వాటాలను అనుసరిస్తున్నాయని గుర్తుచేశారు. 

ఈ నేపథ్యంలోనే శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహసామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో 203ను జారీచేసిందన్నారు. బుధవారం జలసౌధలో కృష్ణా యాజమాన్యబోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌అయ్యర్‌తో సమావేశమైన రజత్‌కుమార్‌ ఏపీ కొత్త ప్రాజెక్టుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. తెలంగాణ అభ్యంతరాలను సమగ్రంగా వినిపించారు. ఏపీ తన వాటాకు లోబడి నీటిని వాడుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే నీటి లెక్కింపుల్లో  పోతిరెడ్డిపాడు వద్ద సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండానే ముందుకుపోతున్న ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలువకుండా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తిచేశారు. తన పరిధిలో ఉన్న అధికారాల మేరకు బోర్డు వ్యవహరించి.. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ హామీ ఇచ్చినట్టు తెలిసింది. 

ఏపీ ఉత్తర్వుల ఆధారంగా ఫిర్యాదు

ఏపీపై గతంలో పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఫిర్యాదుచేశామని, కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను జతచేస్తూ మరోసారి కృష్ణాబోర్డుకు ఫిర్యాదుచేశామని రజత్‌కుమార్‌ తెలిపారు. బోర్డు చైర్మన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాకు 2009 తర్వాత ఈ ఏడాది మాత్రమే వరద వచ్చిందని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన చైర్మన్‌.. బోర్డు పరిధుల్లోఉన్న మేరకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రజత్‌కుమార్‌ తెలిపారు. ఏపీ తమ వాటాకు లోబడే వాడుకుంటామని చెపుతున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. మాటల్లో కాదు చేతులు ముఖ్యమని, పోతిరెడ్డిపాడు దగ్గర సరైన పర్యవేక్షణ లేని క్రమంలో దానిని ఎవరు చూస్తారని ప్రశ్నించారు. సమావేశంలో నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు ఉన్నారు.

30 ఏండ్ల లెక్కలివ్వండి

  • రెండురాష్ర్టాలకు కేంద్ర జలసంఘం సూచన

రెండు తెలుగురాష్ర్టాల మధ్య కృష్ణా బేసిన్‌లో మిగులు జలాల వాటాను సమగ్ర అధ్యయనం తర్వాతే తేలుస్తామని కేంద్రం నియమించిన కమిటీ తేల్చిచెప్పింది. 30 ఏండ్ల రికార్డులను పరిశీలించాకే నిర్ణయానికి రావాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. తెలుగురాష్ర్టాల పరిధిలో కృష్ణాబేసిన్‌లో జలాల మిగులును తేల్చేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కమిటీ బుధవారం సమావేశమైంది. ఢిల్లీ, హైదరాబాద్‌, విజయవాడ నుంచి ఇంజినీర్లు ఆన్‌లైన్‌లో ఈ సమావేశం నిర్వహించారు. కేంద్ర జలసంఘంలోని ఐఎంజీ విభాగానికి చెందిన సీఈ విజయ్‌ సరన్‌ ఢిల్లీ నుంచి పాల్గొనగా.. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ అంతర్రాష్ట్ర సీఈ నర్సింహారావు, కృష్ణాబోర్డు సభ్యుడు హరికేశ్‌మిశ్రా, డీఈ శ్రీధర్‌కుమార్‌.. విజయవాడ నుంచి ఏపీ అంతర్రాష్ట్ర సీఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 30 ఏండ్ల వివరాలు ఇచ్చేందుకు ఈ నెల 31వరకు గడువు కావాలని తెలంగాణ సీఈ కోరారు. ఏపీ సీఈ మాత్రం నీటి ఏడాది ముగుస్తున్న క్రమంలో త్వరగా వాటా తేల్చాలని, తద్వారా తాము వరద సమయంలో వాడుకున్న దానిలో కొంత మినహాయింపు వస్తుందని పేర్కొన్నారు. అయితే ఎలాంటి అధ్యయనం లేకుండా నిర్ణయం తీసుకోలేమన్న సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌... ఈ నెల 31లోగా రెండు రాష్ర్టాలు పూర్తి వివరాలను సమర్పించాలని సూచించారు. 


logo