బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 13:50:27

రాష్ట్రంలో నడుస్తున్నది రైతు రాజ్యం : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో నడుస్తున్నది రైతు రాజ్యం : మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్‌ : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెద్ద వంగర మండల కేంద్రంలో సెర్ప్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం చిన్న వంగర గ్రామంలో కొబ్బరికాయ కొట్టి కల్లాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రైతును రాజుగా చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.

ఇంత నిబద్ధతతో పని చేస్తున్న సీఎం దేశంలో ఎక్కడా లేరన్నారు. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల్లో సాగు జరిగిందని, గతంలో పోలిస్తే మూడు రెట్లు అధికమని తెలిపారు. పెద్ద మొత్తంలో దిగుబడులను మహమ్మారి సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించడం సాహసోపేతమేనని, అలాంటి సీఎం మనకు ఉండడం అదృష్టమన్నారు. ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ధాన్యాన్ని తేమ, తాలు లేకుండా మార్కెట్లకు తేవాలని, ఇచ్చిన టోకెన్లు, నిర్ణీత తేదీల్లో మాత్రమే తేవాలని సూచించారు. మార్కెట్లకు వచ్చి రైతులు ఆగం కావొద్దని, రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాలు నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ కలెక్టర్‌ గౌతమ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.