శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 06:45:10

24 గంటలు వర్షసూచన.. లోతట్టు ప్రాంతాలపై బల్దియా నజర్‌

24 గంటలు వర్షసూచన.. లోతట్టు ప్రాంతాలపై బల్దియా నజర్‌

హైదరాబాద్‌ : రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం గ్రేటర్‌లోని హఫీజ్‌పేట, మియాపూర్‌, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.0 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతంగా నమోదైంది.

బల్దియా 24/7 అలర్ట్‌.. 

నగరంలోని లోతట్టు ప్రాంతాల వారు ఈసారి నిశ్చింతగా ఉండవచ్చని బల్దియా భరోసా ఇస్తున్నది. వరద కారణంగా ఏర్పడే ముంపు నుంచి వెంటనే తేరుకునే విధంగా సర్కిల్‌, జోనల్‌ స్థాయిలో సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసింది. అంతేకాదు, చెట్లు కూలడం, తదితర విపత్తులు సంభవించడం వంటి ఘటనలు జరిగిన వెంటనే వేగంగా సహాయక చర్యలు చేపట్టనున్నది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేందుకు సిబ్బందిని సిద్ధం చేసింది. 

రూ. 24.53 కోట్లు కేటాయింపు..

నగరంలో సుమారు 30 ప్రాంతాలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ఇవే కాకుండా అనేక చోట్ల డ్రైనేజీలోకి నీరు సాఫీగా వెళ్లకుండా ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వ్యర్థాలు అడ్డుగా నిలుస్తున్నాయి. ముంపునకు ఇది కూడా ఓ ప్రధాన కారణంగా ఉంది. అలాగే  వర్షం వల్ల చెట్టు విరిగి పడటం, శిథిల భవనాలు, గోడలు కూలడం తదితర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే, వాతావరణ కేంద్రం ద్వారా వర్ష సూచన వెలువడిన వెంటనే జీహెచ్‌ఎంసీకి చెందిన సహాయక బృందాలను క్షేత్రస్థాయికి పంపుతున్నారు. దాదాపు 30 చోట్ల సమస్య తీవ్రంగా ఉండటంతో అక్కడ నీటిని తోడిపోసేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. రెండు-మూడు రోజుల పాటు వర్షాలుపడే అవకాశం  ఉండటంతో అత్యవసర సహాయక చర్యల కోసం జోనల్‌, సర్కిల్‌ స్థాయిల్లో మొబైల్‌ టీమ్‌లను రంగంలో దింపారు. డీసీఎం వాహనాలతో కూడిన 87 మినీ మొబైల్‌ బృందాలు, అలాగే, జేసీబీలతో కూడిన 79 మొబైల్‌ మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో  మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు 101 స్టాటిక్‌ లేబర్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు.  వరద నివారణ చర్యల కోసం ఈ ఏడాది రూ. 24.53కోట్లు కేటాయించారు. 

ముంపు సమస్య తలెత్తే ముఖ్యమైన ప్రాంతాలు....

ఆలుగడ్డబావి, లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌, రాజ్‌భవన్‌రోడ్‌ విల్లామేరీ కాలేజీ, పంజాగుట్ట మోడల్‌హౌస్‌, కేసీపీ జంక్షన్‌, బల్కంపేట ఆర్‌యూబీ, జూబ్లీహిల్స్‌ నీరూస్‌ షోరూం, జూబ్లీహిల్స్‌ అపోలో క్రెడిల్‌ వైద్యశాల వద్ద, రాణిగంజ్‌ క్రాస్‌రోడ్‌, నాంపల్లి టీ జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ మినర్వా హాటల్‌, ఖైరతాబాద్‌ రాజీవ్‌గాంధీ విగ్రహం, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాలున్నాయి.  


logo