శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 02:44:02

కాలుష్యాన్ని తరిమేస్తున్న వర్షాలు

కాలుష్యాన్ని తరిమేస్తున్న వర్షాలు

  • వాయు నాణ్యత సూచీలో హైదరాబాద్‌ గ్రీన్‌జోన్‌
  • రాష్ట్రంలో సాధారణంకంటే అధికంగా వర్షపాతం
  • కరోనా పరిస్థితులు కూడా ఒక సానుకూలాంశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వాయు నాణ్యతలో హైదరాబాద్‌ సురక్షిత నగరమని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. తాజాగా ఆ బోర్డు విడుదల చేసిన బులిటెన్‌లో హైదరాబాద్‌ గ్రీన్‌జోన్‌లో ఉంది. అంటే ఇక్కడ వాయునాణ్యత 50 పాయింట్లకు లోపే ఉన్నదని నిర్ధారించింది. వాయునాణ్యత పెరగడానికి రాష్ట్రంలో అధికంగా కురుస్తున్న వానలే కారణమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. వాయు నాణ్యత 50 పాయింట్ల లోపు ఉంటే ఆ ప్రాంతంలోని ప్రజలకు సచ్ఛమైన గాలి అందుబాటులో ఉన్నట్టు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వాయు నాణ్యత సూచి సగటున 30 నుంచి 35 పా యింట్ల మధ్య రికార్డవుతున్నది. జనాభా, వాహనాలు, పరిశ్రమలు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోనే స్వచ్ఛమైన గాలి ఉంటే... రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో మరింత స్వచ్ఛమైన గాలి ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నా రు.  వాహనాలు, పరిశ్రమలు తదితరాల నుంచి విడుదలయ్యే 12 రకాల ఉద్గారాలు గాలి స్వచ్ఛతపై ప్రభావం చూపుతాయి. వర్షాల వల్ల గాలి నాణ్యతను దెబ్బతీసే కారకాలు వాతావరణం నుంచి వేరై వాయు నాణ్యత పెరుగుతుంది. రాష్ట్రంలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 469.70 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 556.20 మిల్లీమీటర్ల మేర వానలు పడ్డాయి. ఇది సాధారణ వర్షపాతం కంటే 19 శాతం. 

కరోనా రూపంలో ప్రకృతి అవకాశం

లాక్‌డౌన్‌ సమయంలో రవాణా వ్యవస్థ, పరిశ్రమలు స్తంభించడంతో ప్రపంచవ్యాప్తంగా సీవోటూ విడుదల 17 శాతం తగ్గినట్టు లీడ్స్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. దేశంలో లాక్‌డౌన్‌కు ముందుతో పోల్చితే గాలిలోని పీఎం-10, పీఎం-2.5 మాలిన్యాల శాతం సగానికిపైగా తగ్గింది. ప్రపంచ దేశాలన్నీ రూ.లక్షల కోట్లు గుమ్మరించినా సాధ్యం కాని పనిని కరోనా ఒంటిచేత్తో చేసేసింది.

అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి 

2050 నాటికి వాతావరణ సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలని ప్రపంచ దేశాలు గతంలో నిర్ణయించాయి. ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగగా, చైనా, బ్రెజిల్‌ ఉల్లంఘిస్తున్నాయి. దీంతో ‘1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌' లక్ష్యసాధన అవకాశాలు 50 శాతం లేవని అంచనాకు వచ్చారు. కరోనా పుణ్యాన గ్రీన్‌హౌజ్‌ విడుదల తగ్గడంతో అవకాశాలు 55 శాతానికి పెరిగాయి. దీన్ని అందిపుచ్చుకొంటూ చమురు వినియోగాన్ని తగ్గించడం, పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించగలిగితేనే భవిష్యత్తు తరాలకు లాభం కలుగుతుంది.

వాయు నాణ్యత పెరిగింది 

కాలుష్య నియంత్రణలో కీలకమైనది వాయు నాణ్యత. వర్షాల వల్ల వాయు నాణ్యత పెరిగింది. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్నాయి. దీనివల్ల గాలిలో కాలుష్య కారక ఉద్గారాలు కలువడంలేదు. గాలి నాణ్యత పెరుగుతున్నది. మిగిలిన నగరాల కంటే హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగవుతున్నది.

- దాసరి ప్రసాద్‌, టీపీసీబీ శాస్త్రవేత్త

సమృద్ధిగా వర్షాలు

నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది తెలంగాణలో అనుకూల వర్షాలు ఉంటాయని, వానాకాలం సీజన్‌కు ముందే ఐఎండీ తెలిపింది. అదేరకంగా వానలు కురుస్తున్నాయి. సీజను అంతా ఇలాగే ఉంటుంది. అనుకూల వర్షాల వల్ల పంటల పరంగా, పర్యావరణ పరంగా సమతులంగా ఉంటుంది.

- రాజారావు, డిప్యూటీ డైరెక్టర్‌, ఐఎండీ


logo