శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 03:00:19

వాన జోరు.. రికార్డు హోరు

వాన జోరు.. రికార్డు హోరు

  • పదేండ్ల రికార్డును బద్ధలుకొట్టిన వర్షాలు
  • ఈ సీజన్‌లో 46 శాతం అధిక వర్షపాతం
  • రాష్ట్రంలో కురువాల్సింది 742.1 మి,మీ.. కురిసింది 1,082.5 మిల్లీమీటర్ల వర్షం
  • 23 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణం

రాష్ట్రంలో ఈ సారి కురిసిన జోరువానలు ఏకంగా పదేండ్ల రికార్డును బద్ధలుకొట్టాయి. ఇప్పటివరకు దాదాపు 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2010లో 32 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారిక లెక్కల ప్రకారం జూన్‌ 1 నుంచి శనివారం వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 742.1 మిల్లీమీటర్లు కాగా, ఈ సారి ఏకంగా 1,082.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్‌లోనూ 30 శాతం అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో భూగర్భ జలమట్టాలు పైపైకి వస్తున్నాయి. ఈ సారి ఏకంగా 531 టీఎంసీల వాన నీరు రీచార్జి అయ్యింది. ఆగస్టు నెలలోనే 310 టీఎంసీల జలాలు భూమిలోకి దిగాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ సారి వానకాలం ముగిసేందుకు ఇంకా రెండు రోజులుండగానే 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది.  2010లో తెలంగాణలో అత్యధికంగా 32 శాతం, 2019లోనూ 6 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు కలిసిరావడంతోనే అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెప్పారు. జూన్‌లో ఒకటి, జూలైలో ఒకటి, ఆగస్టులో 5 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వీటికితోడు తరచూ ఏర్పడిన ఆవర్తనాలు వర్షాలకు అనుకూల పరిస్థితులను కల్పించాయి. ఇలా ఎక్కువసార్లు ఏర్పడిన షీర్‌జోన్లు, ఉపరితల ఆవర్తనాలు ఈసారి అత్యధిక వర్షపాతాల నమోదుకు సహకరించాయి. ఈ సీజన్‌లో అత్యధికంగా ఆగస్టు రెండో, మూడో వారంలోనే వానలు కురిశాయి. ఆగస్టు 13 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా వర్షాలు కురిశాయి. ఆగస్టు 9న ఒక అల్పపీడనం, ఆగస్టు 13న మరో అల్పపీడనం, ఆగస్టు 19న మరో అల్పపీడనం, ఆగస్టు 24న ఇంకో అల్పపీడనం ఏర్పడ్డాయి. వరుసగా అల్పపీడనాలు ఏర్పడటం.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలి అధిక వర్షాలు కురిసేందుకు కలిసి వచ్చాయి. ఆగస్టు 13, 14, 15,16 తేదీల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్‌ నగరంపైనా ఈ వానలు ప్రభావం చూపాయి.

23 జిల్లాల్లో అత్యధికం

రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో సమృద్ధిగానే వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 742.1 మిల్లీమీటర్లకు, ఈ సారి 1,082.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 23 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 134 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. ఇక్కడ సాధారణ వర్షపాతం 653.5 మిల్లీమీటర్లకు, 1,530.7 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లాలో 532.8 మిల్లీమీటర్లకు 1,215.4 మిల్లీమీటర్ల వర్షపాతం( 128 శాతం అధికం), మహబూబాబాద్‌ జిల్లాలో సాధారణం కంటే 108 శాతం అధిక వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 60 శాతం, కరీంనగర్‌లో 76, జయశంకర్‌భూపాలపల్లిలో 63, సిద్దిపేటలో 96, వరంగల్‌రూరల్‌లో 90, భద్రాద్రికొత్తగూడెంలో 81, మహబూబ్‌నగర్‌లో 89, నాగర్‌కర్నూల్‌లో 77, జోగుళాంబ గద్వాలలో 91 శాతం అ త్యధిక వర్షపాతంనమోదైంది. కామారెడ్డి జిల్లాలో 26, పెద్దపల్లిలో 30, మెదక్‌లో 25, వికారాబాద్‌లో 33, మేడ్చల్‌మల్కాజిగిరిలో 32, హైదరాబాద్‌లో 30, రంగారెడ్డిలో 41, యా దాద్రిభువనగిరిలో 55, జనగామలో 54, సూర్యాపేటలో 38, ఖమ్మంలో 36 శాతం అధిక వర్షం నమోదైంది. 

షీర్‌జోన్‌ అంటే? 

రెండు ఆవర్తనాలు ఎదురెదురుగా ఏర్పడడాన్ని షీర్‌జోన్‌ అంటారు. ఉదాహరణకు పశ్చిమంవైపు ఒక ఆవర్తనం, తూర్పువైపు మరో ఆవర్తనం ఎదురెదురుగా ఉంటే.. ఆ రెండింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని షీర్‌జోన్‌ అంటారు. 16 డిగ్రీల ల్యాటిట్యూడ్‌ వద్ద ఇవి ఎక్కువగా ఏర్పడ్డాయి. ఈ కారణంగానే ఈ సారి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

అల్పపీడనాలు, షీర్‌జోన్‌లే కారణం

పదేండ్లలో ఈ సారి రికార్డుస్థాయిలో 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఏడాదిలో 9 అల్పపీడనాలు ఏర్పడటమే ఇందుకు కారణం. షీర్‌జోన్లు, ఆవర్తనాలు సైతం వర్షాలు కురిసేందుకు అత్యంత అనుకూల పరిస్థితులను ఏర్పరచాయి. 

- రాజారావు, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం