మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:23

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?

  • ఉస్మానియా దవాఖానలోకి వాన నీళ్లు
  • అసలు దోషులు ఈ విపక్షాలు, మేధావులు
  • హైకోర్టు కన్నా పురాతన భవనం
  • 2010 నుంచే ఉస్మానియాకు ముప్పు
  • దవాఖాన కూలే ప్రమాదాన్ని ఐదేండ్ల 
  • క్రితమే హెచ్చరించిన సీఎం కేసీఆర్‌
  • కొత్తది కడ్తామంటే ఆపిన విపక్షాలు
  • కాళ్లల్లో కట్టెలు.. నేడు మొసలి కన్నీళ్లు

బుధవారం హైదరాబాద్‌లో ఊహించని విధంగా భారీ వాన కురిసింది. పురాతనమైన ఉస్మానియా దవాఖానలోని  వార్డులోకి పెద్ద ఎత్తున వాననీరు ప్రవహించింది. రోగులు కనాకష్టం పడ్డారు. షరమామూలుగానే దీనిపై విపక్షాలు నిరసనలు వినిపించాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటాపోటీ పోస్టులు పెట్టారు. అయితే ఈ దుస్థితికి కారణమేమిటి, కారకులెవ్వరు? ఈ పాపం ఎవరిది?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: 2014-జూన్‌ 2 న తెలంగాణ రాష్ట్రం అవతరించింది. సరిగ్గా ఏడాది తర్వాత 2015 జూలైలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చరిత్రాత్మక ఉస్మానియా దవాఖానను సందర్శించారు. దాదాపు నూటపది సంవత్సరాల క్రితం నిర్మించిన దవాఖాన పూర్తిగా శిథిలమై.. సాధారణ నిర్వహణకు సైతం ఉపయుక్తంగా లేని పరిస్థితిని గమనించారు. దవాఖానలోని 11 బ్లాకుల్లో 8 బ్లాకులు ఎందుకూ పనికిరాకుండాపోయినయి. మరమ్మతులు కూడా చేయలేని దుస్థితిలో ఉన్న దవాఖానను కూల్చివేసి 24 అంతస్థుల చొప్పున అద్భుతమైన రెండు భారీ టవర్ల నిర్మాణంతో అత్యాధునిక హంగులతో ఉస్మానియాకు సరికొత్త రూపాన్నిస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటించడమే ఆలస్యం.. ఈగలకు బెల్లం ముక్క దొరికినట్టు.. విపక్షాలకు ఓ అంశం దొరికింది. ఒకరివెంట ఒకరు అనుచరగణాన్ని పోగేసుకొని ఉస్మానియాపై వాలిపోయారు. చారిత్రక నేపథ్యాన్ని వంకగా చూపుతూ భవనాన్ని కూల్చొద్దని ఆందోళనలు మొదలుపెట్టారు. మీడియా సమావేశాలు పెట్టారు. కోర్టుల్లో కేసులు.. అసెంబ్లీ సాక్షిగా ఆందోళనలు..  ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోవడానికి చెయ్యాల్సినన్ని పనులు చేశారు. 

చరిత్ర, సంస్కృతి తమ గుత్త సొత్తైనట్టు.. వాటిని తామే భుజాలమీద మోసుకొని పరిరక్షిస్తున్నట్టు చెప్పుకొనే ఇంటాక్‌ వంటి సంస్థలూ, ప్రజాసంఘాలు.. హక్కుల నాయకులు.. అబ్బో.. ఒకరా ఇద్దరా.. బోనాల జాతర మాదిరి ఉస్మానియా దవాఖానకు పోటెత్తారు. ఉస్మానియాలో చదువుకొని.. ఇక్కడి రోగులకు ఒక్కపూట కూడా వైద్యం చేయకుండా.. విదేశాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్‌ దవాఖానల్లో సూపర్‌ స్పెషాలిటీ గదుల్లో కూర్చొని వైద్యం చేస్తూ కోట్లకు పడగలెత్తిన మాజీ విద్యార్థి సంఘాల నాయకులైతే.. శిథిలమైపోయిన ఉస్మానియా భవనాన్ని కూల్చితే.. బుల్డోజర్ల ముందు పడుకొంటామని ఏసీ గదులనుంచి స్టేట్‌మెంట్లిచ్చారు. విపక్షాలతో సహా వీళ్లలో ఏ ఒక్కరూ ఉస్మానియాను పరిరక్షించడం ఎట్లనో ఒక్క సలహా ఇవ్వలేదు. 1168 బెడ్‌లు ఉన్న అంత పెద్ద దవాఖాన భవనం దురదృష్టవశాత్తూ కూలిపోతే పరిస్థితి ఏమిటన్నది ఎవ రూ ఆలోచించలేదు. మరమ్మతు చేసినా బాగుపడేస్థితిలో లేని దవాఖాన స్థానంలో ఆధునిక హంగులతో అద్భుత దవాఖాన నిర్మించి.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిస్సిగ్గుగా గండికొట్టారు. ఇవాళ అదే ఉస్మానియాలోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే.. రోగులు నానా ఇక్కట్లు పడ్డారంటే.. ఈ పాపం ఎవరిది? ఐదేండ్ల క్రితం కొత్త భవన నిర్మాణం ప్రారంభించి ఉంటే.. ఈ పాటికి అత్యద్భుతమైన నయా ఉస్మానియా దవాఖాన అందుబాటులోకి వచ్చి కరోనా ఆపత్కాలంలో ఆదుకొని ఉండేది కాదా? ఇవాళ మొసలి కన్నీళ్లు కారుస్తున్నవారు నాడు అడ్డుకొన్నందుకు ఏం జవాబు చెప్తారు? 


ఇవీ వాస్తవాలు

2015 మార్చి 31వ తేదీన దవాఖానలోని ఎంఎస్‌-4 వార్డులోని సీలింగ్‌ కూలింది. అక్కడ అప్పుడు పనిచేస్తున్న దవాఖాన సిబ్బంది, రోగులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై ఆనాటి వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి దవాఖాన భవనం పటుత్వంపై నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని భావించి ఒక కమిటీ వేశారు. తెలంగాణ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లోని నిపుణులతో కూడిన అధికారులు వైద్యశాలను సందర్శించి ప్రభుత్వానికి లేఖ (నంబర్‌ 2110/టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ/ప్లానింగ్‌/2015-16తో ఏప్రిల్‌ 28) ఇచ్చారు. పాత భవనంలో దవాఖానను నడిపించడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. ఇక్కడి నుంచి మార్చడం మంచిదని సలహా ఇవ్వడంతోపాటు మరమ్మతులు చేస్తే ఐదేండ్లు మించి ఉపయోగం ఉండదని కూడా చెప్పింది. 

నివేదిక పరిశీలించాక రాష్ట్రంలో వైద్యరంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేశారు. నిపుణులు ఇచ్చిన నివేదికపై చర్చించిన తర్వాత.. అదేరోజు (2015 జూలై 23)న సీఎం కేసీఆర్‌.. నాటి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సీఎస్‌, ప్రముఖులను వెంటపెట్టుకొని దవాఖానను సందర్శించారు. బాగుచేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. దవాఖాన భవనం కండిషన్‌ ఎంతమాత్రం బాగాలేదని, తక్షణం రోగులను దగ్గరలోని దవాఖానలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లుచేయాలని వైద్యశాఖ అధికారులను అక్కడే ఆదేశించారు. 

ఇతర చోట్ల నిర్మిస్తే మెడికల్‌ సీట్లకు నష్టం

గతంలో వచ్చిన ప్రతిపాదన మేరకు ఉస్మానియా దవాఖానను చంచల్‌ గూడ జైలు స్థలానికి మార్చాలి. కానీ, ఎంసీఐ నిబంధనల మేరకు ఉస్మానియా దవాఖానకు మెడికల్‌ సీట్ల అనుమతి ఇవ్వాలంటే దానికి ఉన్న అనుబంధ దవాఖానకు ప్రధాన వైద్యశాలకు 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. దీన్ని ధిక్కరిస్తే తెలంగాణకు వచ్చే వైద్యవిద్య సీట్లు నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో మరోచోట నిర్మించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకున్నది. వారసత్వ కట్టడాల జాబితా నుంచి దవాఖానను తొలగించి పాత భవనాన్ని కూల్చకపోతే దానిచుట్టూ నిర్మించే కొత్త భవనాలను 4 అంతస్థులు మించి నిర్మించడానికి నిబంధనలు అంగీకరించవు. ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య 8 అంతస్థులతో కొత్త భవన నిర్మాణానికి 200 కోట్లు కేటాయించినా.. ఈ నిబంధన అడ్డుపడటంతోనే జీహెచ్‌ఎంసీ అనుమతినివ్వలేదు.

తరలింపు ప్రక్రియకు బ్రేక్‌

దవాఖానను సందర్శించిన అనంతరం అక్కడ కొత్త భవనం కట్టడమే మంచిదని చెప్పడంతోపాటు నిధులు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దీంతో అధికారులు దవాఖానలోని రోగులను దగ్గరలోని వైద్యశాలలకు తరలించడంపై కసరత్తు మొదలుపెట్టారు. ఉస్మానియా దవాఖానను మొత్తం 27 ఎకరాల్లో నిర్మించారు. చుట్టూ ఉన్న స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. ఇక్కడో పోలీసుస్టేషన్‌ కట్టేందుకు కూడా అప్పటి ప్రభుత్వం దవాఖాన స్థలాన్నే తీసుకొన్నది. ఇక స్టాఫ్‌ క్వార్టర్లు, క్యాంటిన్‌, నర్సింగ్‌ కళాశాలపోను అక్కడ మిగిలింది రెండున్నర ఎకరాలు మాత్రమే. పాత భవనం రెండెకరాల 30 గుంటల స్థలంలో ఉన్నది.   మొత్తం 1168 పడకల సామర్థ్యం ఉన్న దవాఖానలో పాతభవనంలోనే 870 పడకలున్నాయి. మొత్తం 11 బ్లాకుల్లో 8 బ్లాకులు ఏమాత్రం పనికిరావని నిపుణులు తేల్చిచెప్పారు.  ఆర్థ్ధోపెడిక్‌ విభాగాన్ని కింగ్‌కోఠికి, మిగిలిన విభాగాలను పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌ దవాఖానల్లో సర్దుబాటుచేయాలని భావించారు. ఓపీ, అత్యవసర సేవలను మాత్రమే ఉస్మానియాలోని కొత్త భవనంలో కొనసాగించాలని, పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. తెలంగాణకే మణిమకుటంలా ఈ భవనం ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. 


మీరే ఆలోచించండి!

మీ ముత్తాత ఓ ఇల్లు కట్టించారు. మీరు పెద్దయ్యేనాటికి అది పాతదై కూలే స్థితికి చేరింది. దాన్ని తీసేసి కొత్త ఇల్లు కట్టుకుంటారా? లేక మా ముత్తాత కట్టించారని కూలిపోయే ఇంటిలోనే ఉంటూ సగర్వంగా కుమిలిపోతారా?

చారిత్రక నిర్మాణాలను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేయకుండా ఉండటం కోసం మనం హెరిటేజ్‌ యాక్ట్‌ చేసుకున్నాం. కానీ ఆ చట్టమే ప్రజా ప్రయోజనాలకు భంగకరమైనప్పుడు, చట్టానికి అతీతంగా ఆలోచించి, లేదా చట్టాన్ని మార్చి ప్రజలకు  మేలు చేయాలా? లేక చట్టం ఉన్నదని ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాలా? చట్టానికి, ప్రజా ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు చట్టాన్ని పక్కనపెట్టాలా? లేక ప్రజా ప్రయోజనాలనా? చట్టం.. చట్టం కోసమా? లేక మన కోసమా? సాంకేతిక చట్టం ముఖ్యమా? ప్రజల విశాల ప్రయోజనాలా? 

చార్మినార్‌, కుతుబ్‌షాహీ సమాధులను వారసత్వ కట్టడాలంటే అర్థముంది. ఎందుకంటే అవి అరుదైనవి, అలంకారికమైనవే తప్ప, ప్రజావసరాల కోసం కట్టినవి కావు. దవాఖాన కోసం, పరిపాలన కోసం కట్టిన భవనాలను  హెరిటేజ్‌ అంటే .. చార్‌సౌ సాల్‌ హైదరాబాద్‌లో వారసత్వ కట్టడమో, నిర్మాణమో కానిది ఏది?

ఒక అవసరం కోసం కట్టిన భవనం పాతదైతే.. దాన్ని తీసేసి అదే అవసరం కోసం కొత్త భవనం కట్టుకోవడం కూడా చారిత్రక తప్పిదమేనా? ఉన్నవాటిని ఉన్నట్టు అట్లాగే ఉంచేసుకుంటూ పోతే... మహానగరంలో పెరుగుతున్న ప్రజల అవసరాలకు స్థలం ఎక్కడి నుంచి రావాలి? జనం ఎక్కడికి పోవాలి? 

పాత భవనాన్ని కూలిస్తే వారసత్వ కట్టడమంటారు. మూఢ నమ్మకాలంటారు. దాని కింద నిధి నిక్షేపాలున్నాయి, దోచుకునేందుకే కూలుస్తున్నారని నిందలు వేస్తారు. పోనీ ఊరవతల కడదామంటే రియల్‌ వ్యాపారం కోసమే అక్కడ కడుతున్నారంటారు. ఏదీ చేయకుండా ఊరుకుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇది సీఎం వైఫల్యం అంటారు.

అది ఉస్మానియా దవాఖాన అయినా.. రాష్ట్ర సచివాలయమైనా... ఏది చేద్దామన్నా కేసులు, వ్యాజ్యాలతో ముందరికాళ్లకు బంధాలు వేస్తుంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఎలా పని చేయాలి? 

ఇదీ.. జరిగింది!

31.3.2015 , ఎంఎస్‌-4 వార్డులోని సీలింగ్‌ కూలింది

28.4.2015 , ఉస్మానియా పరిస్థితిపై నిపుణుల కమిటీ నివేదిక

23.7.2015 , నివేదికపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష  మంత్రి, అధికారులతో కలిసి ఉస్మానియా సందర్శన, నూతన భవనానికి ప్రతిపాదన, రోగులను తరలించాలని ఆదేశం

05.8.2015 , దవాఖాన కూల్చివేతను ఆపాలని హైకోర్టులో పిటిషన్‌

కాళ్లలో కట్టె పెట్టిన ప్రతిపక్షాలు..


ప్రభుత్వం ఉన్నతాశయంతో ప్రతిపాదనలు రూపొందించే పనిలో ఉండగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కపెట్టున ఆందోళనలు చేపట్టాయి. ఆరునూరైనా దవాఖాన నిర్మాణం అడ్డుకుంటామని హూంకరించాయి. కనీసం 1.20 లక్షల చదరవు అడుగులతో కొత్త భవనం కట్టాలని ప్రభుత్వం యోచించింది. దవాఖానకు మిగిలి ఉన్న స్థలంతోపాటు కబ్జాకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనంచేసుకొని అద్భుత సౌకర్యాలతో వైద్యశాలను కట్టాలని అనుకొన్నది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్‌ నేత వీ హన్మంతరావు, ప్రస్తుత కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి వంటి వాళ్లందరూ దవాఖాన నిర్మాణాన్ని అడ్డుకున్నారు. హైకోర్టులో కేసులువేశారు. పాత భవనం అలాగే ఉండాలని పట్టుపట్టారు. తమ గొంతులో ప్రాణం ఉండగా ఇక్కడ కొత్త దవాఖానను కట్టనివ్వబోమన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడబలుక్కొని అడ్డుకోవడంతో ప్రభుత్వం కూడా మరమ్మతులు చేయించింది. అయితే, మరమ్మతులు చేయిస్తే ఐదేండ్లు కూడా ఉండదని నిపుణుల కమిటీ చెప్పింది. నాడు విపక్షాలు కొత్త దవాఖాన నిర్మాణాన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే ఇవాళ ఈ తిప్పలు ఉండేవి కావని రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 

ఆధునీకరణ ఎందుకు ఆగింది?


పాత సెక్రటేరియేట్‌ కూల్చడాన్ని ఒంటికాలుపై నిలబడి అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఇక  ఇప్పుడు తాజాగా ఉస్మానియా దవాఖాన దొరికింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉస్మానియా హాస్పిటల్‌లోకి వర్షం నీళ్లు చేరాయని, ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ  పల్లవి ఎత్తుకున్నారు. బుధవారం నగరంలో కురిసిన వర్షంతో నిజంగానే ఉస్మానియా దవాఖానలోకి నీళ్లు చేరాయి. అక్కడి వార్డుల్లోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాస్తవమే. దీనిపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ సోషల్‌ మీడియా కేంద్రంగా ఆరోపణలు మొదలుపెట్టాయి. కానీ, వాస్తవంగా జరిగిందేమిటి..? ఉస్మానియా దవాఖాన ఇంతటి దుస్థితికి కారకులు ఎవ్వరు? నిజంగా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదా? ప్రభుత్వం పట్టించుకున్నపుడు ప్రతిపక్షాలు ఏం చేశాయి? ఈ ప్రశ్నలకు ప్రతిపక్షాల దగ్గర సమాధానమున్నదా? ఐదేండ్ల క్రితమే  మొదలుకావాల్సిన ఉస్మానియా దవాఖాన ఆధునీకరణ కేవలం రాజకీయ దుగ్ధతో ఆగిపోయింది వాస్తవం కాదా?


logo