శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 02:23:10

వడగండ్ల వాన

వడగండ్ల వాన

  • ఏడు జిల్లాల్లో వర్షం
  • ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుకు యువకుడి మృతి

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. యాదాద్రి జిల్లాల్లో వడగండ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. పిడుగుపాటుకు ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు మరణించాడు. అకాల వర్షానికి తోడు వడగండ్లు పడటంతో పలు రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసింది.

యాదాద్రిలో వడగండ్ల బీభత్సం..

యాదాద్రిలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున కురిసిన వడగండ్ల వానకు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంటపాటు వడగండ్లు పడటంతో స్థానికులు వాటిని సేకరించి కుప్పలు కుప్పలుగా పోశారు. ఇంతటి భారీస్థాయిలో వడగండ్లు ఎప్పుడూ పడలేదని యాదగిరిగుట్ట పట్టణ వాసులు తెలిపారు. గాలిదుమారానికి హైదరాబాద్‌-వరంగల్‌ ప్రధాన రహదారిపై హోర్డింగ్‌లు, సైన్‌ బోర్డులు కొట్టుకుపోయాయి. యాదాద్రి కొండపైనా భారీ వర్షం కురిసింది. ఘాట్‌రోడ్డుపై విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, ఆలేరు, మోటకొండూర్‌ తదితర మండలాల్లో వరిపైరు నేలవాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 

యువకుడి మృతి..

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం సరాండి గ్రామంలో చింతచెట్టుపై పిడుగుపడటంతో అక్కడే  ఉన్న మసాదె అనిల్‌ (22) మరణించాడు. గాలివానకు కైరిట్‌ గ్రామంలో భారీ చెట్టు పశువులపాకపై పడింది. దహెగాం మండలంలో కురిసిన వర్షానికి పలు పంటలకు నష్టం జరిగింది. పెంచికల్‌పేట్‌ మండల కేం ద్రంతోపాటు పలు గ్రామాల్లో శనగ, మక్కజొన్న, వరికి నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంతోపాటు మండలంలోని ఈజ్‌గాంలో వడగండ్లు పడ్డాయి. ఈదురుగాలులతో పలు చెట్లు నేలకొరిగాయి. 

కరీంనగర్‌ జిల్లా కేంద్రంతోపాటు కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, శంకరపట్నం, సైదాపూర్‌ మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం, కోమటిపల్లి, తొండ్యాల లక్ష్మీపురం, బోరు నర్సాపురం గ్రామాల్లో శుక్రవారం సాయం త్రం వడగండ్ల వాన కురవడంతో వరి, మిర్చి, నువ్వులు, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలంలోని పెర్కివీడ్‌, మణికొండ సమీపంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి ధాన్యం నేలరాలింది. మణికొండలో పిడుగుపడటంతో పశువుల కొట్టం పూర్తిగా దగ్ధం కాగా, అందులో ఉన్న ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లిలోని ఓ కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో మంటలు అంటుకున్నాయి. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో తేలికపాటి వాన

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల శుక్రవారం సాయం త్రం తేలికపాటి వర్షం కురిసింది.  ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు రాజేంద్రనగర్‌లో 5.8 మి.మీ., బహుదూర్‌పురాలో 5 మి.మీ., షేక్‌పేటలో 3.8 మి.మీ., చార్మినార్‌లో 2.3 మి.మీ. వర్షపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.  

భారీగా పంట నష్టం


  • వడగండ్లతో తీరని దెబ్బ
  • 22,363 ఎకరాల్లో పలు పంటలకు దెబ్బ
  • ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయశాఖ 

ఈదురు గాలులు, వడగండ్ల వర్షాలకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా 22,363.036 ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. 13 జిల్లాల్లోని 200 మండలాల్లో వడగండ్ల వాన ప్రభావం చూపింది. దీంతో మక్కజొన్న, వరి, జొన్న, గోధుమ పంటలతోపాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మక్కజొన్న 9,380.781 ఎకరాలు, వరి 12,256.540 ఎకరాలు, జొన్న 688.928 ఎకరాలు, గోధుమ 37.050 ఎకరాల విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. వరంగల్‌, నల్లగొండ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కొంతమేరకు పంటనష్టం వాటిల్లింది. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు సమాచారం. 


logo