బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 10:42:09

హైదరాబాద్‌ సహా పలు జిల్లాలో వర్షం

హైదరాబాద్‌ సహా పలు జిల్లాలో వర్షం

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం కూకట్‌పల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా దుబ్బాకలో 82 మిల్లీ మీటర్లు, కొండపాకలో 70.3 మి.మీ వర్షాపాతం నమోదైంది. అక్కడక్కడా తేలిక పాటి జల్లులు కురిశాయి. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో 14 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నల్గొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, కుమ్రంభీం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురవగా.. పలు చోట్ల జల్లులు పడ్డాయి.

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 

ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని చెప్పింది. తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo