సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 01:39:26

రెండ్రోజులు వానలు

రెండ్రోజులు వానలు

  • 8 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం!
  • చురుకుగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మధ్య బంగాళాఖాతంలోని విదర్భ ప్రాంతంలో ఈ నెల 8వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ మొత్తంతోపాటు పలు ప్రాంతాల్లో విస్తరించాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షం

విదర్భ ప్రాంతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో మూడ్రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతోనే గురువారం సాయంత్రం గ్రేటర్‌లోని పలుచోట్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్‌ పాటిగడ్డలో రాత్రి 8.30 గంటల వరకు అత్యధికంగా 1.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని శ్రీనగర్‌కాలనీ, కీసరలోని దమ్మాయిగూడలో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. వర్షంతో గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 35.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.4 డిగ్రీలు నమోదయ్యాయి.


logo