మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 18:47:01

మరో మూడు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

మరో మూడు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

హైదరాబాద్‌ : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ముంపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో శనివారం నాటికి 106.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్‌లో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో సోమ, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంలో తీవ్రత ఎక్కువగా హైదరాబాద్‌ పరిధిలోనే ఉందని, అందుకే ఈ నెలలో ఆ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. అలాగే ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo