సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 02:41:12

మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు

మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు

  • శంకర్‌పల్లి ఫ్యాక్టరీ నుంచి 44 బోగీలు
  • కాజీపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఊసెత్తని కేంద్రం
  • విభజన చట్టంలో హామీకి తిలోదకాలు

మేధో సర్వో డ్రైవ్స్‌.. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా కొండకల్‌ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఏడాదిలోపే రైల్వేశాఖ నుంచి రూ.2,211 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందింది. వందే భారత్‌ వంటి రైళ్ల బోగీలలో ఉపయోగించే సామగ్రిని తయారుచేయనున్నది. 

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా నానుతున్నది. రాష్ట్ర విభజన చట్టంలో దీనిపై కేంద్రం హామీ కూడా ఇచ్చింది. ఈ హామీని నమ్మి రాష్ట్ర ప్రభుత్వం రూ.380 కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. ఆరున్నరేండ్లు గడుస్తున్నా దీనిపై అతీగతీ లేదు.

ఇప్పటికే హైదరాబాద్‌లో విమానాల విడిభాగాలు, ఆపాచీ హెలికాప్టర్ల విడిభాగాలు తయారవుతున్నాయి. మరి కోచ్‌ల తయారీ పరిశ్రమకు కేంద్రం ఎందుకు సానుకూలత వ్యక్తం చేయడంలేదు? కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ద్వారా వేలమంది తెలంగాణ యువతకు ఉపాధి లభించేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? 

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన మేధో సర్వో డ్రైవ్స్‌ ప్రైవేటు సంస్థ రైల్వేశాఖ నుంచి భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. భారతీయ రైల్వే త్వరలో పట్టాలెక్కించనున్న వందే భారత్‌ వంటి రైళ్ల బోగీలను ఈ సంస్థ రూపొందించి, సరఫరా చేయనుంది. ఈ మొత్తం కాంట్రాక్టు విలువ రూ. 2,211కోట్లు. అత్యాధునిక సదుపాయాలతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టనుంది. దేశీయ కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్‌కు చెందిన మేధో సంస్థ ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది. మొత్తం కాంట్రాక్టు విలువలో 75 శాతం స్థానిక వస్తు వినియోగం ఉండాలన్న షరతును ఈ సంస్థ నెరవేర్చింది. 16 రైళ్లకు సంబంధించిన 44 బోగీల డిజైన్‌, అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా చేసే కాంట్రాక్టును ఈ సంస్థ పొందింది. ఐదేండ్లపాటు బోగీల మెయింటెనెన్స్‌ బాధ్యత కూడా ఈ సంస్థదే. గత ఆగస్టులో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో మేధో సంస్థ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి రాష్ట్ర మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. ప్రైవేటు రంగంలో నెలకొల్పనున్న దేశంలోనే అతిపెద్దదైన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం కొండకల్‌, వెలిమల గ్రామాల్లో 106 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఫ్యాక్టరీ ఇంకా నిర్మాణ దశలో ఉండగానే భారీ కాంట్రాక్టు లభించడం విశేషం. మరో 20 నెలల్లో బోగీల సరఫరాను ఈ సంస్థ ప్రారంభించనుంది. 1984లో యుగేందర్‌ స్థాపించిన మేధా కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూ నేడు రైల్వే కోచ్‌లు, లోకోలు తయారుచేసే సంస్థగా ఎదిగింది. రైల్వేశాఖకు ఇప్పటికే పలు రకాల పరికరాలను సరఫరా చేస్తున్న ఈ సంస్థకు హైదరాబాద్‌ శివార్లలోని చర్లపల్లి, బోడుప్పల్‌లో కూడా పరిశ్రమలు ఉన్నాయి. కొండకల్‌ కోచ్‌ ఫ్యాక్టరీతో వేలమందికి ఉపాధి లభించగలదన్న ఆకాంక్ష తాజా కాంట్రాక్టుతో సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ ఎప్పుడు?

  • భూమి ఇచ్చినా స్పందనలేని కేంద్రం

కొన్ని దశాబ్దాలుగా కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోనూ కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ స్థాపిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఆరునెలల్లో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి తప్పకుండా ఫ్యాక్టరీ పెడతామని పేర్కొన్నది. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు పూర్తి కావస్తున్నా అతీగతీ లేకుండాపోయింది. ఈ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించి.. రూ. 380 కోట్ల విలువైన 150 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలను రైల్వే అధికారులకు అందించింది. వాస్తవంగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి 135 ఎకరాలు సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికంగా భూమిని కేటాయించింది. రాష్ట్ర విభజన చట్టంలో హమీ ఇచ్చిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని స్థాపించాలంటూ సీఎం కేసీఆర్‌, రాష్ట్రానికి చెందిన ఎంపీలు పలుమార్లు ప్రధానమంత్రిని, కేంద్ర రైల్వే మంత్రిని కలిశారు. పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అయినా కేంద్రానికి కనికరం కలగడంలేదు.  

మంత్రి కేటీఆర్‌ అభినందన

వందే భారత్‌ రైళ్ల బోగీల తయారీ కాంట్రాక్టు దక్కించుకున్న మేధో సర్వో సంస్థను రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అభినందించారు. ట్విట్టర్‌లో శుక్రవారం ఆయన స్పందిస్తూ మేకిన్‌ ఇండియా మేడిన్‌ తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా మేధో సంస్థ కాంట్రాక్టు దక్కించుకున్నదని పేర్కొన్నారు.

VIDEOS

logo