గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:59:04

అంబాలాకే ఎందుకు?

అంబాలాకే ఎందుకు?

  • వ్యూహాత్మక ఆపరేషన్లకు కేంద్రం  
  • అత్యాధునిక సాంకేతికత సొంతం

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అంబాలా స్థావరాన్ని ఎంచుకోవటం వెనుక పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని ఐఏఎఫ్‌ అధికారులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాలతో పోలిస్తే అంబాలా తక్కువ ఎత్తులో ఉంటుందని, పైలట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు విశాలమైన గగనతలం (కొండ ప్రాంతాలకు దూరంగా) ఈ స్థావరంలో ఉన్నదని తెలిపారు. మౌలిక సదుపాయాలు, విమానాల మరమ్మతులు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని వివరించారు. ఎలాంటి కొత్త రకమైన విమానం వచ్చినప్పటికీ, ఎక్కువ మొత్తంలో డబ్బును వెచ్చించకుండానే దానికి మరమ్మతులను చేసేందుకు కావలసిన నిపుణులు, సాంకేతిక సహకారం అంబాలాలో ఉన్నదని రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ పీకే బార్బోరా తెలిపారు.  

దేశ రాజధాని ఢిల్లీని శత్రు దేశాల నుంచి కంటికి రెప్పలా కాపాడటానికి, సరిహద్దులకు శక్తివంతమైన విమానాలను నిమిషాల వ్యవధిలో తరలించడానికి అంబాలా వంటి అధునాతన సుదుపాయాలు ఉన్న స్థావరమే సరైనదని నిపుణులు తెలిపారు. తొలి రెండు జాగ్వర్‌ స్కాడ్రన్‌లు, మిగ్‌-21 బైసన్‌ తొలి స్కాడ్రన్‌ కూడా ఇక్కడే ఉన్నాయి. కాగా 1948లో అంబాలా స్థావరాన్ని వాయుసేన ఏర్పాటు చేసింది. 1947-48 పాక్‌తో యుద్ధం నుంచి 2019లో జరిగిన బాలాకోట్‌ దాడి వరకు పలు ఆపరేషన్‌లలో అంబాలా స్థావరంలోని విమానాలు కీలక పాత్ర పోషించాయి.


logo