శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 16:59:02

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదే!

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదే!

చౌటుప్పల్‌: ఒకప్పుడు సాధారణ పౌరులు పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కాలంటే భయపడేవారు. అయితే, పోలీసింగ్‌లో వస్తున్న మార్పులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చర్యల కారణంగా పోలీసులు ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకొంటున్నారు. తెలంగాణలో ఇలాంటి పోలీసింగ్‌ ఎంతో కాలంగా కొనసాగుతున్నది. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేవారిని ఆప్యాయతతో పలుకరించి వారి సమస్యలను తెలుసుకొనేందుకు ప్రభుత్వం రిసెప్షన్‌ కౌంటర్లను ఏర్పాటుచేసింది. ఈ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ఆపదలో ఆదుకోవడం, రక్షణ కల్పించడం ఒక్కటే తమ పని కాదని తెలంగాణ పోలీసులు ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రజారవాణా నిలిచిపోవడంతో రాత్రి సమయాల్లో ఎందరినో ఇండ్ల వద్ద దింపి శహబాష్‌ అనిపించుకొన్నారు. రాచకొండ పోలీసులు మరో అడుగు ముందుకేసి.. కారు టైరు పంక్చరయి ఏమీ చేయాలో పాలుపోని వృద్ధ జంటకు సహాయం చేసి మంచితనాన్ని చాటిచెప్పారు. చౌటుప్పల్‌ సమీపంలో టైర్‌ పంక్చర్‌ అయి ఏం చేయాలో పాలుపోని సమయంలో మేమున్నామంటూ వచ్చిన కానిస్టేబుల్‌ ఆంజనేయులు, హోంగార్డు నర్సింహ్మారెడ్డి వారి కారు టైరు మార్చి ఆ వృద్ధుల ప్రయాణం కొనసాగేలా చేశారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన రాచకొండ పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి.. వృద్ధ దంపతులకు సహాయపడిన పోలీసులకు అభినందనలు తెలిపారు. 


logo