e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home Top Slides ముమ్మరంగా సహాయక చర్యలు

ముమ్మరంగా సహాయక చర్యలు

  • వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
  • యుద్ధప్రాతిపదికన విద్యుత్తు మరమ్మతు పనులు
  • వాగుల్లో చిక్కుకున్నవారిని కాపాడిన పోలీసులు
  • ఉత్తర తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

కుండపోత వానతో అతలాకుతలమైన పలు జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. వరదల కారణంగా తీవ్రంగా ధ్వంసమైన కరెంటు వ్యవస్థకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. పలు ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న పలువురిని ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు, పోలీసులు సురక్షితంగా కాపాడారు.

బొగత సందర్శన నిలిపివేత
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి వద్ద ఉన్న బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో శుక్రవారం నుంచి రెండురోజులపాటు సందర్శనను నిలిపివేశారు. పర్యాటకులు ఎవరూ వెళ్లకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకొన్నారు.

- Advertisement -

అధైర్యపడకండి.. పోలీసులొస్తున్నారు
వరద బాధితులకు డీజీపీ భరోసా
వరదల్లో చిక్కుకున్న బాధితులకు సహాయం చేసేందుకు పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు వస్తున్నారని, ఆందోళన చెందవద్దని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏదైనా సమస్య ఉంటే వెంటనే దగ్గరలోని పురావాస కేంద్రాలకు వెళ్లాలని, అత్యవసరమైతే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. భైంసా పట్టణంలో పోలీసులు చేస్తున్న సహాయక చర్యల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

నీట మునిగిన పంటలు.. నేలకొరిగిన స్తంభాలు
నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ వాగు ఉప్పొంగడంతో చుట్టుపక్కల పంటపొలాలు నీట మునిగాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలోని సుందరశాల గోదావరి ఉద్ధృతి కారణంగా నీట మునిగిన పంటలను కలెక్టర్‌ భారతీ హోళికేరీ పరిశీలించారు. కోటపల్లి మండలంలో నీట మునిగిన పంటలను ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ పరిశీలించారు. జన్నారం మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 25 ట్రాన్స్‌ఫార్మర్లు, 90 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

చేపలవేటకు వెళ్లి..
చేపల వేటకు వెళ్లి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోవరం పంచాయతీ పరిధిలోని కనుగుల చెరువులోపడి చట్టుబోయిన మహేష్‌ (25) మృతిచెందాడు. నిర్మల్‌ మండలంలోని రాణాపూర్‌కు చెందిన ఆడె గణేశ్‌ (30) మంజులాపూర్‌ వద్ద రోడ్డుపై వరదలో చేపలు పట్టేందుకు వెళ్లి కాలువ గుంతలో పడి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి వాగులో గల్లంతైన సండ్రల్‌పాడ్‌కు చెందిన బర్రెల కాపరి లచ్చులు మృతదేహం లభ్యమైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన పోలీస్టేషన్‌లో పనిచేసే హోంగార్డు కొరెంగ భీంరావ్‌ రాత్రి కాగజ్‌నగర్‌ వాద్ద వాగులో మునిగి చనిపోయాడు.

మంత్రులు వేముల, అల్లోల పర్యవేక్షణ
జలదిగ్బంధంలో చిక్కుకున్న నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలను శుక్రవారం వరుణుడు వదల్లేదు. శుక్రవారం కూడా పలుప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నిర్మల్‌, సారంగాపూర్‌లో వరద పరిస్థితిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని జీఎన్‌ఆర్‌కాలనీలో ఐజీ నాగిరెడ్డితో కలిసి పర్యటించారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ పట్టణంలో కప్పలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం, భీమ్‌గల్‌ ముచ్కూర్‌ గ్రామాల మధ్య గల జక్‌లాత్‌ ఒర్రె, ముచ్కూర్‌లో తెగిపోయిన నీలపల్లి చెరువును మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నీలపల్లి చెరువు తెగిపోయి ఇండ్లలోకి నీరు చేరిన సాలీంపూర్‌ గ్రామస్థులతో మంత్రి మాట్లాడారు. భైంసా పట్టణంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో ముంపు బాధితులకు పునరావాసం కల్పించారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పర్యటించారు. మంచిర్యాల పట్టణంలోని రాంనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌లోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పరిశీలించారు.

కృష్ణమ్మ పరుగులు.. గోదారమ్మ ఉరకలు
హైదరాబాద్‌, జూలై 23 (నమస్తే తెలంగాణ)/నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాలతోపాటు, ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద అంతకంతకూ పెరిగిపోతున్నది. శుక్రవారం ఉదయం స్వల్పంగా నమోదైన ప్రవాహాలు సాయంత్రానికి ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఇప్పటికే శ్రీరాంసాగర్‌, కడెం, ఎల్లంపల్లి, జూరాల, మిడ్‌మానేర్‌ తదితర ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana