గురువారం 04 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:56:55

నియంత్రిత సాగుతోనే ఆధరవు

నియంత్రిత సాగుతోనే ఆధరవు

  • రైతుకు లాభం.. సీఎం కృత నిశ్చయం
  • నాణ్యమైన పంట, గిట్టుబాటు ధర ప్రధానం
  • మార్కెట్‌ను బట్టే దిగుబడుల తరలింపు
  • జిల్లాల వారీగా పంటల సాగు ప్రణాళిక
  • వరుస సమావేశాలతో పకడ్బందీ వ్యూహం
  • నేడు వ్యవసాయ మంత్రి కీలక  సమీక్ష
  • హాజరు కానున్న డీఏవోలు, శాస్త్రవేత్తలు
  • రేపు ముఖ్యమంత్రి విస్తృతస్థాయి భేటీ
  • మంత్రులు, కలెక్టర్లు, రైతుబంధులు హాజరు

ఈన గాచి నక్కల పాల్జేసినట్టు రైతు కష్టం దళారుల పాలు కాకుండా చూడాలంటే మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే, డిమాండ్‌ ఉన్నంతవరకే పండించేలా చూడాలని, ఇది తప్ప మరో మార్గం లేదన్న వ్యవసాయ నిపుణుల సూచనతో ఏకీభవించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు. దీన్నొక యజ్ఞంలా చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళిక రచించబోతున్నారు. 

వ్యవసాయం.. ఒక ప్రయోగమైతే.. రైతే పరిశోధకుడు.. అనుభవ సారమే అసలు ఫలితం..

అదును నుంచి పదును దాకా, నారు పోసే  నాటి నుంచి పంట కోసే దాకా తపస్సులా చేస్తేనే సాగుబడి ఫలిస్తుంది. దిగుబడి రెట్టింపవుతుంది. పంట పొలాలు, సాగు నీళ్లు, ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నప్పుడు ఫలసాయమూ పరిమితంగానే ఉండేది. అందువల్ల పరిమితమైన ఆలోచనలు సరిపోయేవి.  మరి పొలమూ పెరిగి, ఫలమూ పెరుగుతున్నప్పుడు?! అప్పుడు ధాన్యం ధనంగా మారాలంటే  ఆలోచన కూడా అందనంత ఎత్తున ఉండాలి! 

నేల.. విత్తు సమన్వయంతో కలిసినప్పుడే పొలం మొలకెత్తుతుంది. ప్రభుత్వం, రైతులు కలిసి కదిలినప్పుడే వ్యవసాయం ఫలిస్తుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సేద్యంపై ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయమూ ప్రణాళికాబద్ధమే. 24 గంటల ఉచిత విద్యుత్తు అయినా.. మిషన్‌ కాకతీయ అయినా.. కాళేశ్వరం ప్రాజెక్టు అయినా..  రైతుబంధు అయినా.. రైతు బీమా అయినా! అంతిమంగా వాటి అసలు లబ్ధిదారు రైతు! తెలంగాణ రైతును రాజుచేసే ఆ విధానాల పరంపరలో భాగమే.. తాజాగా చేపట్టిన నియంత్రిత వ్యవసాయం! సహజంగానే దీని లబ్ధిదారూ రైతే!! 

రాష్ట్రంలో ప్రజలు ఏం తింటున్నారు? ఎంత తింటున్నారు? అందులో ఇక్కడే ఉత్పత్తి అయి అందుబాటులోకి  వస్తున్నది ఎంత? అని పరిశీలిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వాడుతున్న చింతపండు కన్నా, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది 50 వేల టన్నులు తక్కువ. ఈ కొరత తీర్చడానికి వేల చింత చెట్లు నాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గోదావరి జీవ జలం, మంచి జవగల్ల పొలం వరాలుగా పురోగమిస్తున్న తెలంగాణలో, వ్యవసాయంలో మరో విప్లవాత్మక మార్పు తేవాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది. సర్కారు, రైతులు ఇప్పటిదాకా చేసిన సంయుక్త సాగు సత్ఫలితాలు ఇచ్చిన తరుణంలో, దేశానికే ఆదర్శంగా మరో కీలక విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నది. గిరాకీ ఉన్న పంటల్నే పండించడం, గిరాకీ ఉన్నప్పుడే పంటను మార్కెట్‌కు తేవడం.. నియంత్రిత వ్యవసాయం సారాంశం! ఉమ్మడి రాష్ట్రంలో పంటలు పండక తెలంగాణ రైతులు నష్టపోయారు. ఆ కాలం పోయి ఇప్పుడు పంటలు ఇబ్బడిముబ్బడిగా పండుతున్నాయి. ఈ నేపథ్యంలో పండిన పంటకు సరైన ధర దక్కక రైతులు నష్టపోయే పరిస్థితిని నివారించాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించింది. 

ఈన గాచి నక్కల పాల్జేసినట్టు రైతు కష్టం దళారుల పాలు కాకుండా చూడాలంటే మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే, డిమాండ్‌ ఉన్నంతవరకే పండించేలా చూడాలని, ఇది తప్ప మరో మార్గం లేదని వ్యవసాయ నిపుణులు చేసిన సూచనతో ఏకీభవించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు. దీన్నొక యజ్ఞంలా చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళిక రచించబోతున్నారు. ఇప్పటికే నిర్వహించిన సమావేశాలకు కొనసాగింపుగా, సంబంధిత వర్గాలతో సమావేశమై.. విధి విధానాల ముసాయిదా తయారుచేయాలని వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో మంగళవారం హాకాభవన్‌లో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, సాగు నిపుణులు, శాస్త్రవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. 


రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా బుధవారం ఉదయం పదిగంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్చార్డీ) లో మంత్రి ఆధ్వర్యంలో మరో విస్తృత సమావేశం జరగనున్నది. అన్ని జిల్లాల రైతుబంధు సమితుల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులు (డీఏవో), రాష్ట్ర వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, సాగు నిపుణులు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చింది. దీనికి కొనసాగింపుగా జిల్లాస్థాయిలో ఏ పంటను ఎంతమేరకు సాగుచేయాలో ఇందులో చర్చిస్తారు. ముసాయిదా ప్రతిపాదనలను రూపొందిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరగనున్నది. 

ప్రగతిభవన్‌లో గురువారం మధ్యాహ్నం రెండుగంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు హాజరవుతారు. ఎక్కడ ఏ పంటను ఎంత సాగుచేయాలనే జిల్లాలవారీ ప్రణాళికను ఖరారుచేస్తారు. నియంత్రిత వ్యవసాయ విధానానికి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయి సమాచారంతో బుధవారం సాయంత్రమే హైదరాబాద్‌ రావాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. 25 వేల లోపు రైతు రుణమాఫీ అమలు ఎంతవరకు పూర్తయింది? గోదాములు, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి స్థల సేకరణ ఎంతవరకు వచ్చింది? ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఎస్‌ఈజెడ్‌ల కోసం 500 నుంచి వెయ్యి ఎకరాల స్థలాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? తదితర వివరాలన్నింటినీ కలెక్టర్లు ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. ఈమేరకు వారు ఇప్పటికే బ్యాంకర్లు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వీటన్నింటి ఆధారంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు జరుగనున్నాయి. 

తాండూరు కందిపప్పు.. నర్సంపేట మిర్చి

ఉదాహరణకు తాండూరు కందిపప్పుకు మంచి పేరున్నది. వివిధ రాష్ర్టాలవారు దాన్ని ఇష్టంగా కొంటారు. అట్లాగే నర్సంపేట.. మిర్చికి, వరంగల్‌ పత్తికి కేరాఫ్‌. ఇక తెలంగాణ శాస్త్రవేత్తలు పరిశోధించి రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం షుగర్‌ పేషెంట్లకు ఎంతో ఉపయుక్తమైనది. వరంగల్‌ రైస్‌, నల్లగొండ రైస్‌ తదితర తెలంగాణ సన్నాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉన్నది. మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కొర్రలు, సజ్జలు వంటి తృణధాన్యాలకు మార్కెట్లో గిరాకీ పెరుగుతున్నది. ఈ పంటలకు తెలంగాణ నేల సంప్రదాయంగా ఎంతో అనుకూలమైనది. మరోవైపు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు సైతం మార్కెట్లో మంచి ధర పలుకుతున్నది. 

రైతుల తోడ్పాటుతోనే సఫలం

తెలంగాణలో ప్రజలకు సరిపడినన్ని కూరగాయలే ఉత్పత్తి కావడంలేదు. మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అంతెందుకు? చింతపండునే తీసుకొంటే.. తెలంగాణ ప్రజలు వాడుతున్న చింతపండుకన్నా, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది 50 వేల టన్నులు తక్కువ. ఈ కొరత తీర్చడానికి వేల సంఖ్యలో చింతచెట్లు నాటించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజలు ఏం తింటున్నారు? ఎంత తింటున్నారు? అందులో ఇక్కడే ఉత్పత్తి అయి అందుబాటులోకి వస్తున్నది ఎంత? అనే పరిశీలనచేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నియంత్రిత వ్యవసాయం పకడ్బందీగా అమలైతే.. రాష్ట్రంలో రైతు దశ మారిపోతుందని, ప్రణాళికబద్ధమైన వ్యవసాయానికి తెలంగాణ రోల్‌మాడల్‌గా నిలుస్తుందని వారు వివరించారు. ప్రభుత్వ కృషికి రైతుల తోడ్పాటు లభించినప్పుడే నియంత్రిత వ్యవసాయం సఫలమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. రైతులు ఇందుకు సమాయత్తం కావాల్సిన అవసరమున్నదని సూచించారు. 

లాభసాటిగా  సేద్యం

గిరాకీ ఉన్న పంటలను, తెలంగాణకే ప్రత్యేకమైన బ్రాండ్లను రైతులతో పండింపజేస్తే వాటికి ధర తప్పకుండా లభిస్తుంది. అందువల్ల రైతులను ఈ దిశగా నడిపించడమే ధ్యేయంగా నియంత్రిత వ్యవసాయ విధానం అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ అనుకొంటున్నారు. వ్యవసాయాన్ని కేవలం సంప్రదాయ వృత్తిగా పరిగణించకుండా, లాభసాటి మార్కెట్‌ నైపుణ్యంగా మార్చాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అటు నాణ్యమైన ఉత్పత్తులు, ఇటు మార్కెటింగ్‌ కౌశలం కలగలిపినప్పుడే రైతు ఇంట సిరుల పంట పండుతుందన్న వ్యవసాయ నిపుణుల మాటలతో ఏకీభవించిన కేసీఆర్‌, ఇందుకు నియంత్రిత వ్యవసాయమే పరిష్కారమని నిర్ణయించారు. దీనివల్ల మార్కెట్‌ ఒడిదుడుకుల ప్రభావం రైతుపై పడదన్నది ఆయన లెక్క. ఉదాహరణకు ఒక మార్కెట్లో ఒక వ్యవసాయ ఉత్పత్తి పేరుకుపోయి, సరైన ధర దక్కని పరిస్థితి ఉంటే, అది పూర్తిగా అమ్ముడు పోయేదాకా, అవసరమైతే మూడు నాలుగు రోజులపాటు రైతులు తమ దిగుబడిని తమవద్దే ఉంచుకునే పరిస్థితి రావాలని, అప్పుడే వారు మార్కెట్‌ను శాసించగలుగుతారని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు. 

ఇది జరగాలంటే రైతులు వ్యవస్థీకృతమై సంఘటిత శక్తిలా మారాలి. పంట విత్తే స్థితి నుంచి దిగుబడిని దాచుకునే దశ దాకా పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించాలి. నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సబ్సిడీ విత్తనాలు, కాళేశ్వరం నీళ్లు, రైతుబంధు వంటి పథకాలతో ఒక యజ్ఞంలా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రైతుబంధు సమితులతో అన్నదాతలను సంఘటిత శక్తిగా మారుస్తున్నది. ఏ పంట సాగు ఎంత ఉండాలో ప్రభుత్వమే చెప్తుందని ముఖ్యమంత్రి ప్రకటించడం, గోదాములు, కోల్డ్‌స్టోరేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎస్‌ఈజడ్‌లూ రైతు జేబును నింపడంలో భాగమే! 

గిరాకీ ఉంటేనే.. గిట్టుబాటు

పంటలు పండించిన తర్వాత గిట్టుబాటు ధరలకోసం డిమాండ్‌ చేయడమంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమేనన్నది సీఎం కేసీఆర్‌ భావన. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి, మార్కెట్‌ ఒరవడి ఆధారంగా పంటలు వేయడమొక్కటే రైతుల సమస్యలకు అసలు పరిష్కారంగా సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగంచేసుకుని, అద్భుతమైన దిగుబడులు సాధించడంలో తెలంగాణ రైతులు దేశానికే రోల్‌మాడల్‌గా మారారనీ, ఇక పండించిన పంటకు సరైన ధర పొందడమే తదుపరి కర్తవ్యమని ఆయన కచ్చితమైన అభిప్రాయం. ఏదో ఒక పంట వేసి, దాన్ని మార్కెట్‌దాకా మోసి, కొనాలంటూ దేబిరించే కన్నా, వ్యాపారే రైతు వద్దకు వచ్చి పంట కొనే పరిస్థితి సృష్టించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. డిమాండ్‌ ఉన్న నాణ్యమైన పంటలు పండించినప్పుడే ఇది సాధ్యమని ప్రభుత్వం భావిస్తున్నది. 

పంటల మ్యాపింగ్‌ డ్రాఫ్ట్‌ సిద్ధం

రాష్ట్రస్థాయిలో పంటల మ్యాపింగ్‌ రూపకల్పన చేయడానికి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా స్థాయిలో నియంత్రిత సాగుపై  సమీక్షలు నిర్వహించారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు చేసిన సూచనల ఆధారంగా కలెక్టర్లు పంటల మ్యాపింగ్‌ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ మ్యాపింగ్‌ ఆధారంగా రాష్ట్రంలో రైతుల కోసం నాణ్యమైన విత్తనాలను సర్కారు అందుబాటులో ఉంచనున్నది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉండే పంటలను పండించేలా తెలంగాణ రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం చేయనున్నది. సీఎం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేయాలో నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు తెలిపారు. డ్రాఫ్ట్‌ మ్యాపింగ్‌కు గురువారం సీఎం కేసీఆర్‌ నిర్వహించే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి తుది రూపం ఇవ్వనున్నారు. 

అధికారులు సూచించిన పంటలే వేయాలి

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను పండించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన. అందుకు అనుగుణంగా రైతులందరూ అధికారులు సూచించిన పంటలను పండించాలి. రైతుకు ప్రయోజనం కలుగడంతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి ఆలోచన దేశానికే ఆదర్శం. 

-తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి 

చెప్పిన పంటలు వేస్తేనే లాభం

వ్యవసాయ శాఖాధికారులు సూచించిన పంటలను వేయడం ద్వారా రైతులకు మేలు. రైతాంగం మొత్తం ఒకే పంటను వేయడం ద్వారా ధర ఉండకపోగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నీటివనరులు, ఆయా ప్రాంతాల్లోని భూములను పరిగణలోకి తీసుకొని వ్యవసాయాధికారులు పంటలు వేయించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చెప్పారు. 

 -కొండబాల కోటేశ్వరరావు, విత్తానాభివృద్ధి సంస్థ చైర్మన్‌ 

 కేసీఆర్‌ ఆలోచన గొప్పది

డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన గొప్పది. మూస పద్ధతిలోఅందరూ ఒకే పంటను సాగుచేయడం వల్ల మంచిధర దక్కడం లేదు. ఎక్కువమంది మొగ్గు చూపుతున్న సన్నరకాలను సాగుచేయాలి. 

- పుల్కం గంగన్న, రైతుబంధు సమితి గంగాధర మండల , కోర్డినేటర్‌, కరీంనగర్‌ జిల్లా 

 ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం

గతంలో సాగునీరు లేక పంటలు పండటమే గగనంగా ఉండె. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో సాగునీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నాడు పంటలు పండని రోజు రైతుకు ఎలా నష్టం వచ్చిందో.. నేడు అందరూ ఒకేరకం పంటలు పండిస్తే మళ్లీ నష్టమొస్తది. అందుకే సీఎం కేసీఆర్‌ ఆలోచనచేసి ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేయాలని చెప్పిండు. 

- లక్ష్మీనర్సింహయాదవ్‌, రైతుబంధు సమితి ,మహబూబ్‌నగర్‌ జిల్లా డైరెక్టర్‌


logo