మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:34

ద్రవ్య సంస్కరణలతో ఆర్థిక క్రమశిక్షణ

ద్రవ్య సంస్కరణలతో ఆర్థిక క్రమశిక్షణ

లైసెన్స్‌-పర్మిట్‌ రాజ్‌ స్థానంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన దార్శనికుడు పీవీ నరసింహారావు. రాజకీయ నాయకుల నుంచి ఆర్థికమంత్రిని ఎంచుకోకుండా ఆర్థిక నిపుణుడైన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ఆ కీలక పదవిలోకి తీసుకురావడంలోనే పీవీ చాణక్యం దాగుంది. రకరకాల రుగ్మతలతో సతమతమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయాలంటే ఈ డాక్టరే సరిపోతారని ఆయన ఉద్దేశం. రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా, ప్రపంచబ్యాంకులో ప్రతినిధిగా, ఇంకా అనేక ఇతర పదవుల్లో పనిచేసిన అపారమైన అనుభవమున్న మన్మోహన్‌కు ఆర్థిక రంగమంటే కొట్టిన పిండి. ఆయన మామూలు రాజకీయ నాయకుల తరహాలో కాలక్షేపం చేయకుండా సూటిగా రంగంలోకి దిగారు. పీవీ సారథ్యంలో ఆర్థిక సంస్కరణలను ఒక్కటొక్కటిగా ఆవిష్కరించారు. అందులో ముఖ్యమైనది ద్రవ్య సంస్కరణలు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు ద్రవ్య క్రమశిక్షణ నెలకొల్పడం అత్యవసరం. 1991లో ద్రవ్యలోటు జీడీపీలో 8.4 శాతం వరకు ఉన్నట్టు మనకు డేటా ద్వారా తెలుస్తున్నది. అందుకో 1991-92 బడ్జెట్లో ద్రవ్య అసమతూకాన్ని సరిదిద్దేందుకు సాహసంతో కూడిన చర్యలు చేపట్టారు. 1990-91లో 8.4 శాతంగా ఉన్న లోటును 1991-92లో సుమారు 2 శాతం తగ్గించి 6.5 శాతానికి తీసుకువెళ్లాలని సంకల్పించారు. అందుకు ప్రభుత్వ వ్యయం తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, మొత్తం పన్నుల ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గుదలను నిలువరించడం, వృథాఖర్చులకు అడ్డుకట్టవేయడం అనే త్రిముఖ వ్యూహాన్ని అనుసరించారు. కొన్ని కఠినమైన, ఇబ్బందికరమైన నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గించడం, చక్కెరపై లెవీ ఎత్తివేయడం, కొన్ని పబ్లిక్‌ రంగ సంస్థల్లోని  ప్రభుత్వ వాటాల్లో కొంతభాగాన్ని అమ్మేయడం వంటివి అందులో ఉన్నాయి. ఆదాయబపన్ను, ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాలు మరింత బాగా అమలు చేసి సర్కారు ఆదాయాన్ని పెంచుకునేందుకు, పన్ను వ్యవస్థను మరింత సుస్థిరం, పారదర్శకం చేసేందుకు ఉద్దేశించిన రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సులను ఆమోదించడం కూడా ఓ గొప్ప నిర్ణయమే. రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈ నిర్ణయాలను తీసుకోవడం సాధ్యం కాదు. ఈ సాహసానికి ఒడిగట్టిన ధీశాలి పీవీ. మన్మోహన్‌ భుజాల మీద శతఘ్నులు పెట్టి పాత వ్యవస్థను పేల్చిపారేసిన పీవీని రాజకీయ చతురుడు అనకుండా ఏమనగలం.logo