ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 01:03:52

శత వసంతాల సౌమ్యవాది

శత వసంతాల సౌమ్యవాది

  • పీవీ శతజయంతి ఉత్సవాలు నేటి నుంచి
  • తెలంగాణ భూమి పుత్రుడికి రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి.. ఏడాది పొడవునా ఉత్సవాలు
  • హైదరాబాద్‌ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం.. సర్వమత ప్రార్థనలు, సంకీర్తనలు
  • నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దేశవిదేశాల్లో ఘనంగా జయంతి వేడుకలు

కాళోజీ అన్నట్టు పీవీ ఒక అందమైన కల! అలా వచ్చి అలలా ఎగిసి కలలా మాయమైపోయిన పీవీ.. సుదీర్ఘ కాలానికి ప్రత్యక్ష సాక్షి. కింది స్థాయి నుంచి శిఖరాగ్రందాకా.. స్వాతంత్య్ర సమరం నుంచి.. స్వతంత్ర భారత ప్రధాని దాకా.. సామ్యవాదం నుంచి సంస్కరణ వాదం దాకా.. నెహ్రూ, ఆ కుటుంబంలోని నాలుగోతరం దాకా.. రాజకీయంగా పీవీ ఎరుగని ఎత్తు లేదు.. చూడని పల్లమూ లేదు.. నిమ్నఉన్నతాల నడుమ ఉంటూనే వాటితో ఏ బంధమూ లేకుండా బతికిన కర్మయోగి పీవీ..

పదవులతో సంబంధం లేని ప్రతిష్ఠ ఆయనది. సంపదతో సంబంధం లేని వ్యక్తిత్వం ఆయనది. అద్దాల మేడలు, అధికారపు అట్టహాసాల నడుమ కూడా ఘనంగా సింప్లిసిటీని అనుభవించిన నాయకుడు ఆయన. నిగర్వి అయిన మేధావి అయన. అనుబంధాల దగ్గరితనంలోనే దూరాలను వెతుక్కున్న చమత్కారి ఆయన. జగమంత కుటుంబంలో ఏకాకిగా బతికిన ఒంటరి ఆయన. కోట్లాది జాతి జనులకు కొత్త మార్గం చూపించి కూడా ఆ ఖ్యాతి కోసం తపించని నిష్కాముకుడు ఆయన.

ఇరవయ్యో శతాబ్దంలో భారతదేశం గొప్ప వ్యక్తులుగా పదిమందిని ఎంపిక చేయదలిస్తే.. వారిలో అగ్రగణ్యుడు పీవీ. గడిచిన శతాబ్దంలో తెలుగుజాతి ఆధునిక చరిత్రలో అరుదైన ప్రతిభను వెదజల్లి తెలుగువారందరూ మన పీవీ అని సగర్వంగా చెప్పుకొనే కీర్తిని దక్కించుకున్నవాడు. మన తెలంగాణ బిడ్డ పీవీ.. కాళోజీ అన్నట్టు ఒక కల. జాతి జనుల కలలను నిజం చేసిన కళ! మాన్యుడైన అసామాన్యుడు పీవీ శతజయంతి ఉత్సవాలకు నేడే శ్రీకారం. 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10.30 గంటలకు పీవీ శత జయంతి ఉత్సవాలను  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. ముందుగా పీవీ ఘాట్‌ వద్ద సీఎం పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన వేదిక వద్ద సర్వమత ప్రార్థనలు, భజనలు, సంకీర్తనలు జరుగుతాయి. అనంతరం సభాకార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ కే కేశవరావు పాల్గొంటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగిస్తారు. కొవిడ్‌-19 దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులకు అనుమతిస్తున్నారు. పీవీ కీర్తి దశదిశలా చాటేలా దేశ విదేశాల్లో ఉత్సవాలను నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు ఏర్పాట్లు జరిగాయి. ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుకు అప్పగించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ దేశ విదేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఆయా దేశాల్లోని తెలుగువారితో మాట్లాడారు. ఇతర రాష్ర్టాల్లో కూడా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శతజయంతి ఉత్సవాల నిర్వహణను రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కే కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షిస్తున్నది. 

తెలుగు రాజనీతి వెలుగు

రాజనీతిజ్ఞత, సౌమ్య మనస్తత్వం, స్థితప్రజ్ఞత, సాహితీ ప్రతిభ ఇలా అనేక ఉన్నత లక్షణాల అరుదైన ముద్ర శ్రీ పీవీ నరసింహారావు సొంతం. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా, స్థిమితంగా, ప్రశాంతంగా ఎదుర్కొనే ఆయన పనితీరు నుంచి నేటి యువత నేర్చుకోవలసింది ఎంతో ఉంది.


ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే అనేక భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలతో సంస్కరణవాదిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయన, ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలోనూ అదే సంస్కరణల పర్వాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు చక్కని భవిష్యత్తు చూపించి, గాడిలో పెట్టేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు దేశం మరచిపోదు. 

- పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 


నేనొక చైతన్యోర్మిని నిస్తుల ప్రగతి శకలమును ఇది నా సంతత కర్మ మరే హక్కులు లేవు నాకు ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ వెలుగుటయే నా తపస్సు వెలిగించుట నా ప్రతిజ్ఞ!


కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు సన్నిహితుడై కూడా దూరంవాడు ఎప్పుడు చేతికందినట్లే ఉంటడు, కానీ తన ఎడాన్ని మాత్రం కాపాడుకుంటడు జాతరల్లోనూ ఒంటరివాడే ఎప్పుడూ తనలో తాను నిమగ్నుడే ఎప్పుడు చూచినా గాఢనిద్ర నుంచి ఇప్పుడే మేల్కొన్నట్లు బయటపడడు- ద్వంద్వ ప్రకృతో- స్వాభావిక గాంభీర్యమో ఎట్లా ఉన్నా ఉన్నట్లు అగుపడడు మన అవసరానికి అక్కరపడ్డా, పడకున్నా పీవీ పరాయివాడు కాదు. మనవాడు కలలు ఎప్పుడు ఎవనికి పనికొచ్చినయ్‌?

- పీవీ నరసింహారావుపై ప్రజాకవి కాళోజీ రాసిన కవిత


logo