ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:31:13

పీవీ.. ఓ దీపస్తంభం

పీవీ..  ఓ దీపస్తంభం

‘నమస్తే తెలంగాణ’తో ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ కేవీ రమణాచారి 

‘తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు ఒక దీర్ఘదర్శి, సూక్ష్మగ్రాహి, ఒక తాత్విక శక్తి. ఒక దీపస్తంభం. భారతీయ సంస్కృతికి మానవాకృతి. తెలుగునాట పుట్టి దేశ సౌభాగ్యానికి వెలుగై నిల్చి, శాశ్వత యశస్కుడైన ఆ నాయక శిఖామణి భారత జాతి యావత్తు గర్వించదగ్గ మహోన్నతమూర్తి’ అని ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ కేవీ రమణాచారి అభివర్ణించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయనతో తనకున్న జ్ఞాపకాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. 

పీవీ నరసింహారావును మొదటగా మీరు కలుసుకున్న సందర్భం..

నేను ఏపీ సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా ఉన్న సమయంలో పీవీ ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వారికి ప్రత్యేకంగా సురభి నాటకాలను చూపించాలనే తాపత్రయంతో ఢిల్లీలోని మహారాష్ట్ర రంగాయన్‌ థియేటర్‌లో మూడురోజుల పాటు మాయాబజార్‌, శ్రీకృష్ణలీలలు, సతీ అనసూయ నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేయించాం. సమయాభావం, తానున్న పరిస్థితుల వల్ల రాలేకపోతున్నానని, నాటక ప్రదర్శనలు పూర్తయిన మరుసటిరోజున కళాకారులు తనను కలువవచ్చని సాంస్కృతిక శాఖ కార్యదర్శి భాస్కర్‌ఘోష్‌తో పీవీ మాకు సందేశం పంపారు. నాటక ప్రదర్శనలు ముగిసిన తరువాత 105 మంది కళాకారులను తీసుకుని ప్రధాని నివాసానికి వెళ్లాం. అప్పుడే మొదటిసారిగా పీవీని నేను దగ్గరి నుంచి చూడటం. కళాకారులను పీవీ ఆహ్వానించి, ఆప్యాయంగా పలుకరించిన తీరు చూసి ఆశ్చర్యమేసింది. పీవీ నిరాడంబరత తెలిసింది. సురభి కళాకారులను పరిచయం చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన వారంతా అనేక ఆర్థిక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నా నాటక కళను విడిచిపెట్టకుండా వందేళ్లకు పైగా నిరాటంకంగా ప్రదర్శనలిస్తూ ఆ కళను బతికిస్తూ వస్తున్నారంటూ వారి నాటక కళా వైభవాన్ని పీవీకి వివరించారు. ఆ తరువాత ‘వారందరికీ ఏం చేస్తే బాగుంటుంది’ అంటూ అడిగారు. అనంతరం సుమారు 65 మంది కళాకారులకు ఆర్థిక సహకారం అందించారు. 

పీవీతో మీకున్న మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

పీవీని నేను కలిసిన ప్రతి సందర్భమూ నాకు ప్రత్యేకమైనదే. అన్ని మధుర జ్ఞాపకాలే. అందులో ముఖ్యంగా నా ఆధ్వర్యంలో పీవీ సన్మానసభ జరగడం ఓ గొప్ప మధురానుభూతి. పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తరువాత ఒక తెలుగువాడు తొలిసారి ప్రధాని పీఠం అధిరోహించారని, అది తెలుగుజాతికి గర్వకారణమని, వారిని ఘనంగా సన్మానించాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సంకల్పించారు. ఆ బాధ్యతలను సాంస్కృతికశాఖ సంచాలకుడిగా ఉన్న నాకు అప్పగించారు. ఆ సభలో పీవీ ప్రసంగిస్తూ గద్గద స్వరంతో ‘మీరు ఏర్పాటుచేసిన ఈ సన్మానసభ నా బతుకు పుస్తకంలో ఒక పుటగా నిలిచిపోతుంది’ అని ప్రతిస్పందించారు. నాగఫణిశర్మ మహా సహస్రావధానం ఏర్పాట్లను కూడా నేనే దగ్గరుండి పర్యవేక్షించాను. ఆ అవధాన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి తిరిగివెళ్తున్న పీవీకి అప్పటి రాజ్యసభ సభ్యుడు రాజేశ్వర్‌రావు నన్ను పరిచయం చేశారు. ‘వీరిది కరీంనగర్‌ జిల్లా’ అని చెప్పగా ‘ఓ మా పిల్లాడివేనా’ అంటూ ఆప్యాయతతో నా వెన్నుతట్టారు. 

తెలుగు భాష, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి పీవీ చేసిన కృషి గురించి..

నెహ్రూ తరువాత భారతదేశాన్ని పరిపాలించిన పండిత ప్రధాని పీవీ మాత్రమే. ఆయన సాహితీవేత్త. తెలుగుభాషాభివృద్ధికి పీవీ చేసిన కృషి ఎనలేనిది. తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటారు. మాడుగుల అవధానంలో పీవీ చేసిన ప్రసంగం ఒక అద్భుతం. తెలుగులో స్పష్టంగా, సూటిగా, నుడికారాలతో ఉపన్యసించడం ఆయనకే చెల్లు. దేవాదాయ, ధర్మాదాయ శాఖలో శ్రేయోనిధిని ఏర్పరచి పండితులను, వేద పండితులను ప్రోత్సహించారు. సమగ్ర దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ప్రవేశపెట్టారు. జానపద కళలను, కళాకారులను ప్రోత్సహించారు. ఆర్థిక భరోసా కల్పించారు. పోతన పంచశతి ఉత్సవాలను అఖిలభారత స్థాయిలో నిర్వహించారు. స్వయంగా అనువాదాలు చేసి తెలుగుసాహిత్యాన్ని యావత్‌ భారత్‌కు పరిచయం చేశారు. ఇతర భాషల్లోని మేలిమి రచనలను తెలుగులోకి అనుసృజన చేసి తెలుగువారందరికీ అందించారు. 

పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై..

తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు ఒక దీర్ఘదర్శి, సూక్ష్మగ్రాహి, ఒక తాత్విక శక్తి. ఒక దీపస్తంభం. భారతీయ సంస్కృతికి మానవాకృతి. తెలుగునాట పుట్టి దేశ సౌభాగ్యానికి వెలుగై నిల్చి, శాశ్వత యశస్కుడైన ఆ నాయక శిఖామణి భారత జాతి యావత్తు గర్వించదగ్గ మహోన్నతమూర్తి. సంస్కరణలతో గ్లోబల్‌ భారతావనికి పునాదులు వేసి, ఆర్థికాభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టించిన రాజనీతిజ్ఞులు. అయినా రాజకీయ కారణాల వల్ల ఆ మహనీయుడికి ఇప్పటివరకు తగినంత గుర్తింపు మాత్రం రాలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకు పూనుకున్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం హర్షించదగిన విషయం. పీవీ స్ఫూర్తిని నలుదిశలా చాటేలా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం ఆనందదాయకం. రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. కేంద్ర ప్రభుత్వం కూడా పీవీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించి ఆ స్ఫూర్తిని చాటుకోవాలి. శతజయంతి సంవత్సరమే అందుకు చక్కటి సందర్భం.

ఇంటర్వ్యూ: మ్యాకం రవికుమార్‌

 పీవీ వ్యక్తిత్వ ఔన్నత్యం గురించి..

బౌద్ధిక విరాట్‌ స్వరూపుడు పీవీ. ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న మౌన యుద్ధమతనిది. ఆయన నవ్వు, నడక, మాట, చూపు, హావభావాలు, ఉపన్యాస విన్యాసాలు, వ్యక్తిత్వ వైవిధ్యాలు తెలిసిన వాళ్లందరూ ‘అనువు కాని చోట అధికులమనరాదు’ అని గుర్తెరిగిన వివేకి, అపర చాణక్యుడిగా భావిస్తారు. తన నుంచి తాను విడిపోయి దూరంగా నిలిచి విమర్శనాత్మకంగా పరిశీలించాలనుకొని ‘లోపలి మనిషి’తో సంఘర్షించడం నిత్యకృత్యం. గుండెలో అగ్నిపర్వతం బద్దలవుతున్నా నిర్విచారంగా, నిర్వికారంగా, నిబ్బరంగా ఓటమిని గెలుపుగా మలచుకోగలిగే అజేయుడతను. క్షుద్ర రాజకీయాలకు, అనిబద్ధ విధానవర్తనులకు అందనివాడతడు. అంతుచిక్కనివాడు. అంతర్ముఖుడు. మత్తగజ సదృశ ధీరత ఆయన సొంతం. సహనం ఆయనకు పెట్టని కిరీటం. వృత్తిరీత్యా రాజకీయ నాయకుడే అయినా ప్రవృత్తిరీత్యా ఉదాత్త రాజనీతిజ్ఞుడు. సామాన్యుల్లో సామాన్యుడు. అసామాన్యుల్లో అసామాన్యుడు. 

తొలి విదేశీ పయనం.. తొలి లేఖ

పీవీ నరసింహారావుకు 1974 లో కావలసినంత ఖాళీ సమయం ఉండేది. అప్పుడే కూతురు సరస్వతి గర్భవతి కావడంతో ఆమె దగ్గరుండాలని భావించి మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళారు. అదే ఆయన తొలి విదేశీ ప్రయాణం. అమెరికాలో చట్ట సవరణ వల్ల 1970 నాటికి విదేశీ డాక్టర్లు ఆ దేశానికి వెళ్ళేవెసులుబాటు కలిగింది. అలా అవకాశం పొందిన తొలితరం భారతీయ మెడికల్‌ డాక్టర్లలో సరస్వతి ఒకరు. కూతురికి కాన్పు కాలంలో పీవీ మనోైస్థెర్యాన్నిచ్చారు. ఆమెకు కొడుకు పుట్టినప్పుడు పీవీ ఇంటికి ఒక లేఖ రాశారు. ‘నాకు గుర్తున్నంతవరకూ ఆయన రాసిన మొదటి జాబు అదే. సరస్వతికి కొడుకు పుట్టాడని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని రాశారు’ అని కొడుకు రాజేశ్వరరావు గుర్తుచేసుకుంటారు. 

ఒక సీనియర్‌ అడ్మినిస్ట్రేటర్‌గా.. పీవీ సంస్కరణలపై అభిప్రాయం..

పీవీ సహజంగానే సంస్కరణాభిలాషి. ఆయన ప్రతిపాదించిన ప్రతి సంస్కరణకు సామాన్య ప్రజాహితమే ప్రాతిపదిక. జైళ్లశాఖ మాత్యులుగా ఓపెన్‌ జైలు సిస్టం తీసుకొచ్చి ఖైదీల మానసిక పరివర్తనకు బాటలు వేశారు. ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీసును నిషేధించి వారిని పేదలకు అందుబాటులో ఉండేలా చేశారు. విద్యాశాఖమంత్రిగా నవోదయ గురుకులాలకు శ్రీకారం చుట్టి పేదలకు విద్యను చేరువచేశారు. భూసంస్కరణలు అమలుపరిచి పేదలకు భుక్తి చూపారు. పంచాయతీరాజ్‌ సంస్కరణలతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు. మానవ వనరుల శాఖామాత్యులుగా శాస్త్ర సాంకేతిక, శాస్త్రీయ విద్య వైపు యువత దృష్టిని మళ్లించారు. విదేశాంగ విధానం, విదేశీ మారక నిల్వలు, లైసెన్స్‌ విధానం, వ్యవసాయోత్పత్తుల ధరల పెంపు, ప్రైవేటు విద్యుదుత్పాదన, ప్రైవేటు సంస్థలు, ఉపాధి కల్పనలో ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం, దేశీయ విపణిలో పాశ్చాత్య కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, మెరుగైన జీవనశైలి, ఆర్థిక స్వావలంబన విధానం.. ఇలా సంపన్న భారతం వైపు దూసుకుపోతున్న వైనమంతా పీవీ తలపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలేనన్నది నిర్వివాదాంశం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈనాటి సుప్రతిష్ఠిత భారతావనికి పునాది పీవీ తలపెట్టిన సంస్కరణలే. 

మేధావి మాట

సంస్కరణల బాట పూలబాట కాదు. ప్రజాస్వామ్యంలో మరింత కఠినతరం. ఇందుకు ప్రయత్నించిన ప్రతి దేశం ఇబ్బందులనెదుర్కొన్నదే. సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబించి, అద్భుతాలు సాధించిన దేశాలను చూశాక, మన విషయంలోనూ ఇది సరైన విధానం కాగలదని నేను విశ్వసించాను. రాజకీయంగా విభేదాలు ఉండవచ్చు. సంస్కరణలలో కొన్ని అంశాల తీరుతెన్నులు నచ్చకపోవచ్చు. కానీ మొత్తం మీద దేశానికి అంతా మంచిజరగాలని కోరేవారంతా మనకున్న ఉత్తమ మార్గం ఇదే అని అంగీకరిస్తారని నా నమ్మకం. మార్పు ఫలితాలనివ్వడానికి దీర్ఘకాలం పట్టినా, తొందరలో ఫలితాలనిచ్చినా, ఈలోగా ఎదురయ్యే కష్టనష్టాలు, ఒనగూడే ప్రయోజనాలు అందరికీ చెందాలి. 

మన అభివృద్ధికి దిశను నిర్ణయించుకునేటప్పుడు అది పర్యావరణ అనుకూలమైనది, కొనసాగించే అవకాశం కలదని నిర్ధారించుకోవాల్సి ఉంటుందనే అవగాహన వచ్చింది. మన సహజ సంపదను పదిలంగా కాపాడుతున్న మన ప్రజలకు మనం కృతజ్ఞులమై ఉండాలి.. మనం, ఇతర దేశాలు ఒకరితో ఒకరు సహకరించుకుని పర్యావరణాన్ని కాపాడుకోగల పద్ధతులను కనుగొనగలిగితే అది ప్రపంచానికి, భూగోళానికే అమూల్య కానుక అవుతుంది.

- పీవీ నరసింహారావు