గురువారం 02 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:31

మన భూమి పుత్రుడి స్మరణలో..

మన భూమి పుత్రుడి స్మరణలో..

 • ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు
 • 28న పీవీ జానభూమిలో ప్రారంభం
 • ఏడాది పొడవునా కార్యక్రమాలు
 • ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం
 • ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు 
 • 50 దేశాల్లో నరసింహుడి జయంతి వేడుకలు
 • పీవీకి భారతరత్న కోసం అసెంబ్లీలో తీర్మానం
 • ప్రధాని నరేంద్రమోదీ వద్దకు స్వయంగా వెళతా
 • పీవీ రచనల పునర్ముద్రణ, స్మారక అవార్డు
 • హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌: కేసీఆర్‌

 పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా. యావత్‌ దేశ ప్రజలకు పీవీ గొప్పతనం చెప్పేలా జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించాలి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారతదేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన.. అసాధారణ ప్రజ్ఞాశీలి.. తెలంగాణ పోరుగడ్డ నుంచి మేటి పోటరి జగజ్జట్టిగా ఎదిగి.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన తెలుగుమేధ.. నెహ్రూ వంశం తరువాత ప్రధానమంత్రి బాధ్యతను అయిదేండ్లపాటు నిరాటంకంగా నిర్వహించిన రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు విశ్వవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలను ఏడాది పొడవునా జరుపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. విభిన్నరంగాల్లో పీవీ దేశానికి అందించిన విశిష్ఠ సేవలను గొప్పగా తలుచుకొనేలా, చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

పీవీ జయంతి అయినా ఈ నెల 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అదేరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో జయంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘పీవీ తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉన్నదని, ఆయన గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా ఏడాది పొడవునా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, ఇదే విషయంలో స్వయంగా ప్రధానిని కలిసి విన్నవిస్తానని పేర్కొన్నారు. 

పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏయే కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమీక్షలో ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ కే కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు.


 • ఈ నెల 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యతో జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
 • అదేరోజు దాదాపు 50 దేశాల్లో జయంతి వేడుకలు జరుపాలి. ఈ కార్యక్రమాలను ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పర్యవేక్షిస్తారు.
 • పీవీకి తెలంగాణతోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ర్టాలతోపాటు దేశవ్యాప్తంగా చాలామందితో అనుబంధం ఉన్నది. ప్రధానిగా, విదేశాంగశాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లోనూ ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. అందుకే పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో నిర్వహించాలి. 
 • పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇస్తాం.
 • ‘పీవీ తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉన్నది. ఆయన గొ ప్పతనం,సేవలు విశ్వవ్యాప్తం చేసేలా ఏడాది పొ డవునా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలి.
 • రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ పెట్టినట్టే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుకావాలి. కేకే నేతృత్వంలోని కమిటీ సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి.. పీవీ మెమోరియల్‌ ఎలా ఉండాలో సూచించాలి. 
 • వివిధ సందర్భాలకు సంబంధించిన పీవీ ఫొటోలను సేకరించి, వాటిని భద్రపరచాలి. ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహించాలి.
 • హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగరతోపాటు ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో కాంస్య విగ్రహాలను నెలకొల్పాలి.  
 • అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్ని పెట్టాలి. పార్లమెంటులోనూ పెట్టాలని కేంద్రాన్ని కోరతాం.
 • పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషాకోవిదుడిగా, రచయితగా సేవలందించారు. ఆయారంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్‌ తీయాలి. ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలి.
 • పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పీవీకి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పీవీ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైంది? అనే విషయాలతో ప్రత్యేక సంచిక రావాలి. ఆర్థిక నిపుణులతో వ్యాసాలు రాయించాలి.
 • పీవీ..సర్వేల్‌లో మొదటి రెసిడెన్షియల్‌ స్కూల్‌ పెట్టి.. గురుకులాల స్థాపనకు నాంది పలికారు. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇలా విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి ని వివరిస్తూ ప్రత్యేక సంచిక తీసుకురావాలి.
 • పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా.
 • దేశ ప్రజలకు పీవీ గొప్పతనం చెప్పేలా జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను, ప్రధాని నరేంద్ర మోదీని ఉత్సవాలకు ఆహ్వానించాలి. వారు పాల్గొనే కార్యక్రమాల రూపకల్పన చేయాలి.
 • మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉన్నది. వారిద్దరినీ భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి.
 • పీవీ గొప్ప సాహితీవేత్త. అనేక రచనలు చేశారు.  ఆయన రాసిన పుస్తకాలను పునర్‌ముద్రించాలి. అముద్రితంగా ఉన్న వాటిని కూడా ముద్రించి లైబ్రరీలకు, విద్యాసంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలి. ఈ బాధ్యతను సాహి త్య అకాడమీ, సాంస్కృతికశాఖ తీసుకుంటుంది.
 •  దేశవ్యాప్తంగా ఉన్న పీవీ అభిమానులు, అనుచరుల సూచనలు తీసుకోవాలి. వారి అభిప్రాయాలను సావనీర్‌, ప్రత్యేక సంచికల్లో పొందుపరచాలి. వారిని జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలి.
 • హైదరాబాద్‌, ఢిల్లీ, వరంగల్‌, కరీంనగర్‌, మం థని, బరంపురం, నాగపూర్‌ తదితర నగరాల్లో పీవీ ఉన్నారు. ఆయా సందర్భాల్లో ఆయనతో గడిపిన వారు, ఆయనతో అనుబంధం ఉన్నవా రు ఉంటారు. వారినీ భాగస్వాములను చేయాలి.
 • బిల్‌క్లింటన్‌, జాన్‌మేజర్‌ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో కూడా పీవీకి అనుబంధం ఉన్నది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలైతేవారిని ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలి. 
 • పీవీ గొప్పతనం దేశానికంతా తెలిసేలా హోర్డింగ్‌లు ఏర్పాటుచేయాలి. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో హోర్డింగులు పె ట్టాలి. హైదరాబాద్‌లో కనీసం 100 చోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటుచేయాలి.
 • విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషిచేసినవారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పీవీ స్మారక అవార్డు నెలకొల్పాలి. క్రమం తప్పకుండా అవార్డులివ్వాలి.
 • విద్యాసంస్థలు పునఃప్రారంభమైన తర్వాత వి ద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. 
 • రాష్ట్రంలోని ప్రతి ఊరికీ పీవీ గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా పీవీ ఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి.  
 • పీవీ తెలుగువాడు, తెలంగాణ వాడు, జర్నలిస్టు, సాహితీవేత్త. పీవీకి ఘనమైన అక్షర నివాళి అర్పించేలా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి. కవులు పాటలు రాయాలి. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలి.

వంగరలో పీవీ మ్యూజియం

భీమదేవరపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వంగరలో పీవీ మ్యూజియం ప్రారంభించేందుకు పూర్తి ఏర్పాట్లుచేశారు. పీవీ నివసించిన పురాతన భవనం పక్కనే మరో కొత్త భవనాన్ని నిర్మించారు. పీవీ ఉపయోగించిన వస్తువులు, రచించిన పుస్తకాలను ఈ మ్యూజియంలో ఉంచేందుకు పీవీ తనయుడు ప్రభాకర్‌రావు పూర్తి ఏర్పాట్లుచేస్తున్నారు. పీవీ జయంతి రోజున (ఈ నెల28న ) ఈ మ్యూజియాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏడాదిపాటు శతజయంత్యుత్సవాలు జరుపాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై వంగర గ్రామస్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

పీవీతో సాన్నిహిత్యం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీవీకి అరుదైన గౌరవం ఇచ్చారు. పీవీ స్వగ్రామం వంగర నా నియోజకవర్గంలో ఉండటం చాలా ఆనందంగా ఉన్నది. ప్రతిఏటా వంగరలో జరిగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు నేను తప్పక హాజరవుతాను. పీవీతో మాకుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉన్నది. అందుకే నేను పీవీ సార్‌తో సన్నిహితంగా మెదిలాను. అది నాకు చాలా గర్వంగా ఉన్నది. 

- వొడితల సతీశ్‌కుమార్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే

పీవీ.. మన ఠీవి

 • తెలంగాణతనానికి ధోవతి కట్టి ఠీవిగా నిలబెడితే దాని పేరు పీవీ..
 • పెద్దరికానికి సెల్లావేసి అద్దంలో చూపిస్తే ఆ ప్రతిబింబం పేరు పీవీ..
 • మర్యాదను మహామనీషిగా తీర్చిదిద్ది సౌమ్యంగా చూపిస్తే ఆ మాన్యతపేరు పీవీ..
 • చాణక్యనీతికి  రూపం కల్పించి కనులకు కడితే ఆ ప్రతిరూపం పీవీ..
 • మౌన గాంభీర్య రాజనీతిజ్ఞతకు నిలువెత్తు సంతకం పీవీ..
 • మన కాలపు సాహితీ సమరాంగణ సార్వభౌముడు పీవీ..

తెలంగాణ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, వ్యూహరచనా దురంధరుడు,  కాకలు తీరిన రాజకీయ యోధుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, దక్షిణాది నుంచి తొలి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను అపూర్వంగా.. అద్భుతంగా 365 రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అసామాన్యుడిగా మారిన సామాన్యుడు.. మనీషిగా హిమవన్నగమంత ఎదిగిన మామూలు మనిషి కీర్తికి శాశ్వతత్వం కల్పించడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేస్తున్నది. 


logo