బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:38

భూసంస్కరణలకు ముందే కౌలుదారీ చట్టం

భూసంస్కరణలకు ముందే కౌలుదారీ చట్టం

పేదలకు మేలు చేసేలా సంస్కరణలు ఉండాలని పీవీ నరసింహారావు అంటుండేవారు. అందుకే బ్రిటిషర్లు తీసుకొచ్చిన చట్టాలను సవరించేందుకు, దేశ ప్రజలకు అవసరమయ్యేలా చట్టాలు తయారుచేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ‘మన చట్టాలన్నీ బ్రిటిషర్లు తయారు చేసినవే. అవి వారికి అనుకూలంగా చేసుకున్నారు. వాటిని మనమెందుకు ఆచరించాలి. అవి ఈ రోజుల్లో ఎలా పనికొస్తాయి. మన ప్రజలకు తగ్గట్టు, ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు మార్పులు చేసుకోవాలి’ అనేవారు. ఆ ఆలోచనల నుంచే సంస్కరణలు పుట్టుకొచ్చాయి. ఏ సంస్కరణలు చేసినా వాటి ఫలాలు క్షేత్రస్థాయి ప్రజలు, పేద ప్రజలకు చేరాలనేది ఆయన కోరిక. 

ఆయన చేసిన సంస్కరణల్లో కీలకమైనది భూ పరిమితి చట్టం. అయితే, అంతకంటే ముందే కౌలు రైతుల సంక్షేమ చట్టం కోసం తీవ్రంగా కృషి చేశారు. 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి కాగా, రామానంద తీర్థ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే పీవీ పార్టీ జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఒకవైపు ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడిని సమర్థవంతంగా తిప్పికొడుతూనే, మరోవైపు స్వామిజీ ఆశయాలను ముందుకు వెళ్లేందుకు అహర్నిశలు కృషిచేశారు. అప్పటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ హైదరాబాద్‌ స్టేట్‌ వ్యవసాయ విధానంలో సంస్కరణలను తీసుకు రావాలని నిర్ణయించారు. దాన్ని కొండా వెంకటరంగారెడ్డి, జనార్దన్‌రావు దేశాయ్‌ వంటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. 

ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సైతం చట్ట అమలుకు తటపటాయించారు. సంస్కరణలను తీసుకొస్తే కాంగ్రెస్‌ పార్టీ నేతలకు గ్రామాల్లో చాయ్‌ పోసేవాళ్లు కూడా ఉండబోరని పరోక్షంగా హెచ్చరించారు. కానీ పార్టీ తరఫున రామానందతీర్థ స్వామీజీ, పీవీ నరసింహారావు మాత్రం నెహ్రూ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇలా పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నెహ్రూ జోక్యం చేసుకొని పార్టీ జాతీయ నాయకులు గుర్జిలాల్‌ నందా, ఆర్కే పాటిల్‌ను హైదరాబాద్‌కు పంపారు. వారితో జరిగిన సుదీర్ఘ సమావేశంలో పీవీ క్రియాశీలక పాత్ర పోషించారు. చట్టం తీసుకొస్తే కలిగే ప్రయోజనాలను వాళ్లకు వివరించి, మరో వర్గాన్ని ఒప్పించేలా చేశారు. అలా.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ స్టేట్‌లో భూసంస్కరణలు అమలయ్యాయి. అదే కౌలుదారీ చట్టంగా వచ్చింది. దీంతో కౌలు రైతులకు రక్షణతో పాటు ప్రయోజనాలు చేకూరాయి.logo