గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:50:46

ప్రణబ్‌కు రాజకీయ పునర్జన్మ!

ప్రణబ్‌కు రాజకీయ పునర్జన్మ!

ఒక సీనియర్‌ నాయకుడిని చూస్తే మరో నాయకుడు జడుసుకోవడం సాధారణం. పరస్పర హననం పరిపాటి అయిన రాజకీయ రంగంలో పీవీ నరసింహారావు భిన్నమైన వ్యక్తి. ఆయన కాకలు తీరిన సీనియర్‌ నాయకుడైన ప్రణబ్‌ ముఖర్జీకి రాజకీయ పునర్జన్మను ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ. పీవీ నరసింహారావు కన్నా ప్రణబ్‌ ముఖర్జీ వయసులో కొంచెం చిన్నవారే. పీవీ 1921లో జన్మిస్తే, ప్రణబ్‌ 1935లో జన్మించారు. కాంగ్రెస్‌ కింది స్థాయి నాయకుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రణబ్‌పై ఇందిరాగాంధీ దృష్టి పడింది. దీంతో ఆయను రాజ్యసభకు టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించింది. వేగంగా ఎదిగిన ప్రణబ్‌ ఇందిరాగాంధీ మంత్రివర్గంలో నమ్మకమైన నాయకుడిగా ఉండేవారు. ఇందిరా గాంధీ ఆంతరంగికులలో పీవీ, ప్రణబ్‌ ఇద్దరూ ఉద్ధండులే. 

ఇందిరా గాంధీ వంటి నాయకురాలి  క్యాబినెట్‌లో నెంబర్‌టూగా వెలిగిపోవడం మామూలు విషయం కాదు. ప్రధాని ఇందిర లేనప్పుడు క్యాబినెట్‌ సమావేశాలు ఈయన మార్గదర్శనంలోనే సాగేవి. అంతటి శక్తిమంతుడు కనుక ఇందిరాగాంధీ హత్య జరిగిన తరువాత తక్షణం ఈయనే తాత్కాలిక బాధ్యతలు చేపడతారనే అభిప్రాయం ఏర్పడ్డది. ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని పదవి కోసం ప్రయత్నించారనే అభిప్రాయం కూడా ఉన్నది. ఇదే రాజీవ్‌ గాంధీ ఆగ్రహానికి కారణమై ఉండవచ్చు. కారణం ఏదైతేనేం రాజీవ్‌ గాంధీ అధికారంలో ఉన్నంత వరకు ప్రణబ్‌ను పక్కన పెట్టారు. 

రాజీవ్‌ గాంధీ కారణంగా కాంగ్రెస్‌నుంచి బయటకు వెళ్ళి రాష్ట్రీయ సమాజ్‌వాది కాంగ్రెస్‌ పేర సొంత పార్టీ పెట్టుకున్నారు. కొంతకాలానికి రాజీవ్‌ గాంధీతో ఉన్న విభేదాలు తొలిగిపోయాయి. దీంతో ఆయన 1989లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అయినా ప్రణబ్‌కు పూర్వ వైభవం రాలేదు. కాంగ్రెస్‌ నాయకత్వానికి దూరమైన అనేక మంది సీనియర్‌ రాజకీయ నాయకుల మాదిరిగానే ప్రణబ్‌ భవిష్యత్తు శూన్యంగా మారిపోయింది. వాస్తవం చెప్పాలంటే, ప్రణబ్‌ మేధావి, వ్యూహ చతురుడే తప్ప ప్రజా పునాది లేదు. ఒక్క నియోజకవర్గం నుంచి కూడా కచ్చితంగా గెలుస్తాడని చెప్పలేని బలహీనమైన రాజకీయ పునాది. ఇందిరాగాంధీ అండతో రాజ్యసభ సభ్యత్వం లభించేది. 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆయన మొదటి సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇంతటి బలహీనమైన నాయకుడు పార్టీ మద్దతు లేకుండా నెగ్గుకు రావడం అసాధ్యం. కానీ పీవీ నరసింహారావు ప్రధాని కావడంతో ప్రణబ్‌ దశ కూడా తిరిగింది. పీవీ కనుక బలహీన మనస్కుడు అయితే ప్రణబ్‌ వంటి రాజకీయ దురంధరుడిని దగ్గరికి రానీయరు. కానీ ప్రణబ్‌ ముఖర్జీకి  పీవీ రాజకీయంగా మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. 1991లో ప్రణబ్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 1995లో విదేశాంగ మంత్రిగా నియమించడంతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. కాంగ్రెస్‌ రాజకీయాలలో, దేశ వ్యవహారాలలో ప్రణబ్‌ చక్రం తిప్పడం మొదలుపెట్టారు. 1998లో సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కావడం వెనుక ప్రణబ్‌ కీలక పాత్ర పోషించారు. 

ఇందిరా గాంధీ క్యాబినెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్‌ సింగ్‌ ఆర్‌బీఐ గవర్నర్‌. ఆ తరువాత మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయినప్పుడు ప్రణబ్‌ ఆయన మంత్రివర్గంలో పనిచేయవలసి వచ్చింది! రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖలు నిర్వహించారు. పలు మంత్రివర్గ బృందాలకు నేతృత్వం వహించారు. ఏ సంక్షోభం ఏర్పడినా ప్రణబ్‌కు అప్పగించేవారు. పీవీ రాజకీయ పునర్జన్మ ఇచ్చిన తరువాత ప్రణబ్‌ మళ్ళీ ఎదుగుతూ రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించారు. ప్రణబ్‌ రాష్ట్రపతి కాదగిన మహానాయకుడు అనేది అందరూ అంగీకరిస్తారు. అంతటి యోగ్యుడు పీవీ చలవ లేకపోతే మరుగునపడి పోయేవారేమో.


logo