శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 14, 2020 , 23:12:00

దేవుడు ఏదైనా బాధ్యత అప్పగిస్తాడేమో!

దేవుడు ఏదైనా బాధ్యత అప్పగిస్తాడేమో!

  • పీవీతో అనుబంధాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు

పీవీ నరసింహారావు 1990లోనే చనిపోతారనుకున్నారు. కానీ ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది అనుకోకుండా దేశంలోనే కీలకపదవి చేపట్టారు. తన చాణక్యంతో, రాజనీతిజ్ఞతతో దేశం దశ, దిశను మార్చారు. ఆ ప్రయత్నంలో ఎదుర్కొన్న సవాళ్లు, చివరి ఘడియల్లో ఎదుర్కొన్న కష్టాలను పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ప్రధాని కావటానికి ముందు పీవీ ఆరోగ్యం క్షీణించిందని అంటారు కదా? అప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉండేది?

నాన్న ప్రధాని కావడానికి 10 నెలల ముందు ఆయనకు అమెరికాలో గుండె ఆపరేషన్‌ (ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ) జరిగింది. అప్పటికి ఆయన వయస్సు 70 ఏండ్లపైనే. షుగర్‌ వ్యాధి కూడా ఉంది. ఆపరేషన్‌ ఎలా అవుతుందో ఏమోనన్న ఆందోళన కలిగింది.అప్పటికే మా చెల్లెలు అమెరికాలో డాక్టర్‌. అక్కడే ప్రపంచ ప్రసిద్ధి పొందిన హార్ట్‌ సర్జన్‌ డెంటన్‌ కూలేను సంప్రదించింది. సర్జరీ పూర్తయింది. నాలుగు రోజుల వరకు కూడా నాన్న మామూలు స్థితికి రాలేదు. ఐదో రోజున ఆయన కోలుకున్నారు. మెలకువ రాగానే ఆయన ‘నాలుగు రోజుల క్రితమే నా పని అయిపోవాలి. కానీ ఆ దేవుడు ఇంకా నన్ను ఎందుకు బతికించాడంటావురా? ఇంకా నేను చేసేది ఏమైనా ఉందేమో! ఏదైనా బాధ్యత అప్పగిస్తాడేమో!’ అన్నారు. ఆ తర్వాత 10 నెలలకే పరిస్థితులు తారుమారై నాన్న ప్రధాని అయ్యారు. చనిపోయే విషయం కూడా నాన్నకు ముందే తెలిసేమో. చనిపోవడానికి ముందు నన్ను పిలిచి..‘మా నాన్న పిలుస్తుండురా. మన ఊరి చెరువు కట్టమీద నుంచి ఇద్దరం వెళుతున్నాం’ అని తనకు వచ్చిన కలను చెప్పారు. ఆ మరుసటి రోజే నాన్న కన్నుమూశారు. 

నాన్న పదవుల్లో ఉండగా మిమ్మల్ని ఏ విధంగా చూసేవారు. అధికారాన్ని ఉపయోగించుకునేవారా?

సీఎం, పీఎం ఇలా ఏ హోదాలో ఉన్నా అధికారదర్పానికి దూరంగానే ఉంచారు. ఇందుకు రెండు ఘటనలు సాక్ష్యంగా నిలుస్తాయి. 1969లో నేను ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నాను. అప్పుడు నాన్న మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతుంది. నా పరీక్ష కేంద్రం చాదర్‌ఘాట్‌లో పడింది. ఓవైపు కాల్పులు, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. పరీక్షలకు ఎలా వెళ్లాలి? అని అడిగితే ‘అందరి పిల్లలు ఎలా వెళ్తున్నారో నువ్వు కూడా అలాగే వెళ్లి పరీక్ష రాయి’ అన్నారు. దీంతో కాలినడకన వెళ్లి పరీక్ష రాసొచ్చాను. ఇక మరో ఘటన.. మా అన్నయ్య రంగారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ మంచి స్నేహితులు. అప్పుడప్పడే రాజకీయాల్లోకి వచ్చారు. ప్రచారం కోసం కారు కావాలనుకొని.. తన తండ్రి వద్ద ఉండే అధికారులకు ఫోన్‌ చేసి కారు పంపించాలని అడిగారు. అధికారులు కాదనలేక కారు పంపించారు. అప్పుడు నాన్న వేరే రాష్ర్టానికి వెళ్లారు. ఆయన వచ్చిన తర్వాత అన్నయ్య కారు తీసుకెళ్లిన విషయం అధికారులు నాన్నకు చెప్పారు. వెంటనే జైపాల్‌ను పిలిచి ‘ఏరా జైపాల్‌ నా పేరు చెప్పి జీఏడీ నుంచి కారు తీసుకెళ్లారా’ అని అడిగారు. వెంటనే జైపాల్‌ ‘అవును బాపు’ అని చెప్పారు. వెంటనే నాన్న కల్పించుకొని ‘ఆ కారులో ఎన్ని కిలోమీటర్లు తిరిగారో లెక్కించి నాకు చెప్పండి’ అన్నారు. ఆ తర్వాత నాన్న కిలోమీటర్ల ప్రకారం కారుకు అద్దె చెల్లించారు. 

చివరిదశలో కేసులపై ఎలా స్పందించేవారు? 

నాన్న తన చివరి దశలో కేసులు, ఇతర సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా ఎక్కడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. తప్పు చేయలేదని ఆయనకు తెలుసు. దీనికి తోడు ఆయనే ఓ పెద్ద లాయర్‌. పెట్టిన కేసులు నిలబడవని ఆయనకు ముందే తెలుసు. అయన అనుకున్నట్లుగానే అన్ని కేసుల నుంచి బయటపడ్డారు. ప్రశాంతంగా కాలం చేశారు.  

ఆర్థిక సంస్కరణల ఆలోచనలు ఎప్పుడు, ఎలా కలిగాయి? 

ఓ రోజు సంస్కరణలపై ఆయన మాట్లాడుతూ ‘మన చట్టాలన్నీ బ్రిటిష్‌ వారు చేసినవే. వారికి అనుకూలంగా చేసుకున్నారు. వాటిని మనం ఇంకా ఎందుకు ఆచరించాలి. అవి ఈ రోజుల్లో ఎలా పనికొస్తాయి. మన ప్రజలకు తగ్గట్టుగా, ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలి’ అనేవారు. ఏ సంస్కరణ చేసినా, దాని ఫలాలు క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు చేరాలనేది ఆయన కోరిక. అందుకు అనుగుణంగానే ఆయన సంస్కరణలు చేశారు. 


నాన్నకు కాంగ్రెస్‌ సరైన గౌరవం ఇచ్చిందా?

నాన్న జీవిత కాలం కాంగ్రెస్‌ పార్టీకి పనిచేశారు. నా పార్టీ అనుకున్న వ్యక్తికి సొంత పార్టీయే చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. పార్టీ కోసం, దేశం కోసం ఎంతో కష్టపడ్డారు. అలాంటి వ్యక్తికి చివరి గడియల్లో పార్టీ నుంచి సరైన గౌరవం దక్కకపోవటం బాధగా ఉంది. సొంతపార్టీ వాళ్లు గుర్తించకపోయినా తెలంగాణ ప్రభుత్వం నాన్న సేవల్ని గుర్తించింది. ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు దేశవిదేశాల్లోని ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ నాకు ఎంతోమంది ఫోన్‌ చేసి నాన్నకు ఇప్పుడు సరైన గుర్తింపు లభించిందని అంటున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం.

రాజకీయాల్లో నిక్కచ్చిగా ఉండే నాన్న.. కుటుంబసభ్యులు, బంధువులెవర్నీ ప్రభుత్వ కార్యకలాపాలకు దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం మీ ఇష్టం అని చెప్పేవారు. ‘నా కొడుకు కావడమే రాజకీయాల్లో అర్హత కాదు’ అని చెప్పేవారు. ఇద్దరు అన్నయ్యలు కూడా చాలాకాలం పార్టీలో పనిచేసిన తర్వాతే సీటు సంపాదించుకున్నారు. ఇందుకోసం నాన్న ఎలాంటి సాయం చేయలేదు. ‘నేను పదవిలో ఉన్నానని మీరు ఏదైనా తప్పు చేస్తే నేను అస్సలు కాపాడను’ అనేవారు. ‘నేను ఎలా అయితే సొంతంగా ఎదిగానో.. వాళ్లు కూడా అదేవిధంగా  ఎదగాలి. వాళ్లు ఏది కావాలనుకుంటే అది కానివ్వాలి.. అది వారిష్టం’ అనేవారు.

బార్లా తెరుచుకున్న కాంగ్రెస్‌ నోర్లు

పీవీ అంటే సంస్కరణలు. సంస్కరణలు అంటే పీవీ. లైసెన్స్‌-పర్మిట్‌రాజ్‌ను ముగిస్తూ స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ దిశగా దేశాన్ని నడిపించాలనుకున్నారు. నడిపించారు. అయితే ఈ సంస్కరణల పట్ల బయటివారి కన్నా సొంతపార్టీలోనే విమర్శలు ఎక్కువగా రావడం ఆయనకు విసుగు తెప్పించింది. ఇంకా గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఆయన విధానాల పట్ల విపక్షాలలోనే ఎక్కువ మద్దతు వ్యక్తమైంది. సొంతపార్టీలో విమర్శల హోరు ఎక్కువగా ఉండటానికి ఆయన మీద అసూయ కారణమనేది వేరే విషయం. ఆ సందర్భంగా పీవీ చేసిన కామెంట్‌ ఏమిటంటే.. బయటి పార్టీల నోర్లు తెరచుకోవడమే లేదు.. కానీ కాంగ్రెస్‌ పార్టీలో నోర్లు మాత్రం బార్లా తెరచుకుంటున్నాయి అని చురక వేశారు. అర్జున్‌ సింగ్‌ లాంటి వాళ్లు ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేక చాలా ఎత్తులే వేశారు. కానీ అవన్నీ చివరకు పీవీ చాణక్యం ముందు చిత్తు కాక తప్పలేదు.

  • నాన్న రాజకీయాల్లోకి రాకుంటే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లి ప్రొఫెసర్‌గా స్థిరపడాలి అనుకున్నారు. కానీ, నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ తిరిగివచ్చి కొద్దిరోజులు బూర్గుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత ఉద్యమంలోకి దిగారు.
  • పదవులు, ఆస్తులపై సంభాషణ వచ్చినప్పుడు.. ‘ఈ పదవులు భగవంతుని నిర్ణయం. వీటిని ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చాడే తప్ప ధనం దోచుకోవడానికో, సంపాదించుకోవడానికో కాదు’ అనేవారు.
  • ఎన్నికల్లో పోటీ చేసేప్పుడు ఆయన తన కృషిని మాత్రమే నమ్ముకునేవారు. స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఎక్కడికెళితే అక్కడ స్థానిక భాషలో, గ్రామీణ ప్రజల యాసలో మాట్లాడేవారు. ఏ ఎన్నికల్లో కూడా నాన్న డబ్బు ఉపయోగించినట్టు, అక్రమమార్గాలను అనుసరించినట్టు చూడలేదు.

నాన్నకు అస్ట్రానమీ అంటే చాలా ఇష్టం. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చినా అస్ట్రానమీపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. 1969లో ఆయన మంత్రిగా ఉన్నపుడే నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ తదితరులు చంద్రునిపైకి వెళ్లారు. మంత్రిగా బిజీగా ఉన్నా నన్ను ప్రతి అరగంటకోసారి పిలిచి ‘మిషన్‌ విషయాలేంటి.. ఎక్కడి వరకు వెళ్లింది’ అని అడిగేవారు.

1996 ఎన్నికలకు ముందు.. రైతులతో మాట్లాడుతున్న నాన్న ఫోటో కావాల్సి వచ్చింది. అయితే అప్పటికి అలాంటి ఫొటో అందుబాటులో లేదు. దీంతో ఫొటో కోసం రైతులను ఏర్పాటు చేస్తాం.. నాన్న వచ్చి అక్కడ మంచం మీద కూర్చుండి మాట్లాడినట్లు నటిస్తే చాలు అని ఓ వ్యక్తి అన్నారు. ఇదే విషయం నేను భయపడుతూనే నాన్నకు చెప్పాను.  వెంటనే నాన్న మెల్లిగా నా వైపు తిరిగి ‘ఇప్పుడు కొత్తగా యాక్టింగ్‌ కూడా మొదలు పెట్టమంటావా.. వచ్చేవారం హర్యానా వెళుతున్నాం.. అక్కడ రైతులతో సమావేశం ఉంది.. కావాల్సివస్తే అప్పుడు తీసుకోండి’ అన్నారు.

- కొమ్మిడి స్వామిరెడ్డి


logo