సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:14:36

పంజాబ్‌ ఉగ్రవాదాన్ని అణచివేశారు

పంజాబ్‌ ఉగ్రవాదాన్ని అణచివేశారు

పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టేనాటికి దేశంలో ఎన్నో సమస్యలు తాండవం చేస్తున్నాయి. భారతదేశం దివాలా  తీసే స్థాయికి దిగజారిపోయింది. దేశవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు, దేశం బయటి నుంచి పొరుగు దేశాలతో ఇబ్బందులు, దేశంలోపల పెచ్చరిల్లిన ఉగ్రవాదం.. ఇలా అన్నివైపుల నుంచి ఆయనకు పెనుసవాళ్లు ఎదురయ్యాయి. అన్ని సమస్యలను ఒకేసారి టచ్‌ చేయకుండా, సందర్భానుసారంగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ పోయారాయన. అందులో చెప్పుకోదగ్గది.. పంజాబ్‌ ఉగ్రవాదం అణచివేత. 1980ల్లో ప్రత్యేక సిక్కు దేశం కోసం ఖలిస్థాన్‌ ఉద్యమం నడిచింది. 

1987-1991 మధ్య ఉగ్రవాదం తీవ్రస్థాయికి చేరింది. ఉగ్రవాదం మూలంగా అప్పటికే దాదాపు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది. పీవీ ప్రధాని పదవి చేపట్టేనాటికి పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనే కొనసాగింది. 1991 జూన్‌ 21న ప్రధాని పదవి చేపట్టిన పీవీ.. ఆరు నెలల తర్వాత పంజాబ్‌పై ఫోకస్‌ పెట్టారు. అప్పటి వరకు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పూర్తిగా అర్థం చేసుకొన్నారు. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ చీఫ్‌గా పనిచేసిన కేపీఎస్‌ గిల్‌ను ఆ ఏడాది డిసెంబర్‌లో పంజాబ్‌ డీజీపీగా నియమించారు. పీవీ రెండు వ్యూహాలను అనుసరించారు. అందులో ఒకటి గిల్‌ను డీజీపీగా నియమించడం, రెండోది ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడం. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తాను జోక్యం చేసుకోకుండానే కేపీఎస్‌ గిల్‌కు పూర్తి అధికారాలు ఇచ్చారు. 

దీంతో పోలీసు శాఖ పక్కా ప్రణాళికతో ఉగ్రవాదాన్ని పెకళించివేసింది.  పోలీస్‌ శాఖ ఏ చర్యకు ఉపక్రమించినా గిల్‌ ముందుగానే పీవీకి సమాచారాన్ని చేరవేసేవారు. పీవీ కూడా ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందజేశారు. ‘పీవీ నరసింహారావు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే మేం ఉగ్రవాదాన్ని విజయవంతంగా అణచివేయగలిగాం’ అని గిల్‌ స్వయంగా వెల్లడించారు కూడా. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఆర్మీ అవసరం లేకుండానే ఒక్క పంజాబ్‌ పోలీస్‌ శాఖే ఉగ్రవాదాన్ని అణచివేయడం హర్షించదగ్గది. దీన్నిబట్టే పోలీసులకు పీవీ ఎంత స్వేచ్ఛ ఇచ్చారన్నది అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తేసి, ఎన్నికల కోసం పీవీ రంగంలోకి దిగారు. ఎన్నికలు మంచి అభిప్రాయం కాదేమోనని చాలామంది ఆయనకు సలహాలు ఇచ్చారు. కానీ, ఆయన ముందుకే సాగారు. 1992 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయాన్ని దక్కించుకొన్నది. ఆ ఎన్నికల్లో మొత్తం 117 సీట్లకు గానూ కాంగ్రెస్‌ పార్టీ 87 సీట్లను గెలుచుకొన్నది.

- సెంట్రల్‌ డెస్క్‌


logo