బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:53:23

తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేద్దాం

తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేద్దాం

ఈ కరోనాతో మనుషులంతా విచిత్రంగా కనిపిస్తుండ్రు.. నేను వందల వేల సభల్లో మాట్లాడిన గానీ ఇలాంటి సభలో నేనెప్పుడూ మాట్లాడలే. మనిషిని గుర్తుపట్టడమే పెద్ద టాస్క్‌ అయింది. ఈ పరిస్థితులకు భిన్నంగా పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో జరుపుకొనే రోజు రావాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.         

- సీఎం కేసీఆర్‌  

శతజయంతి ఉత్సవాల కమిటీలో పరిమిత సంఖ్య ఏమీ లేదు. పీవీ గురించి తెలిసినవారు, పరిశోధన చేస్తున్నవారు ఎవరైనా సరే కమిటీలో ఉండొచ్చు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మంచిపని చేస్తున్నారని, తాము భాగస్వాములమవుతామని చెబుతున్నారు. సంతోషం కలిగింది.  పీవీ గురించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలనే ఆలోచన ఉన్నవారందరిని నేను ఆహ్వానిస్తున్నా. రాష్ట్రం, దేశం అనే తేడా లేదు. ఎవరైనా రావొచ్చు. పీవీకి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో, బ్రిటన్‌ మాజీ ప్రధాని జాన్‌ మేజర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నా యి. పాకిస్థాన్‌లో కూడా మిత్రులున్నారు. మన బిడ్డ, మన జాతి గర్వించే బిడ్డ, భరతజాతి ముద్దుబిడ్డ, దేశానికి ఎన్నో రకాల సేవలు అం దించిన తెలంగాణగడ్డ బిడ్డ కాబట్టి సమోన్నతంగా తెలంగాణ ఆత్మగౌరవబావుటాను గగనవీధిలో ఎగురేసే విధంగా శతజయంతి ఉత్సవాలను జరుపుదాం. ఉత్సవాల సందర్భంగా అవధానాలు, కవి సమ్మేళనాలు, రచయితల సమ్మేళనాలు, యజ్ఞయాగాలు కూడా జరుగుతాయి. 

పార్లమెంటులోనూ పీవీ చిత్రపటం 

పార్లమెంటులో పీవీ చిత్రపటం ఉండాలి. కానీ వాళ్లు పెట్టలేదు. మాజీ ప్రధానులకు ఇచ్చిన గౌరవం మన పీవీకి ఇవ్వలేదు. దాన్ని ఇప్పుడు మనం చేద్దాం. దీనికోసం మనందరం పోరాడుదాం. పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టడంతోపాటు పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో, క్యాబినెట్‌లో తీర్మానం చేసి నేనే స్వయంగా పీవీ కుటుంబసభ్యులతో, మంత్రి వర్గ సభ్యులను తీసుకెళ్లి ప్రధానిని కోరుతా.  పీవీ అభిమానులను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి చేయిస్తా. ఢిల్లీలో రిమెంబరింగ్‌ పీవీ పేరుతో జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తాం. 

పీవీ మెమోరియల్‌, మ్యూజియం

పీవీ చేసిన సేవలకు గుర్తుగా జ్ఞానభూమిలో ఒక మెమోరియల్‌, మ్యూజియం ఏర్పాటు చేయాలి. రామేశ్వరం వెళ్లినపుపడు అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ను చూశాను. దానికన్నా అద్భుతంగా పీవీ మెమోరియల్‌ను నిర్మించాలి.  కేకే నేతృత్వంలోని కమిటీ రామేశ్వరం సందర్శించి కలాం మెమోరియల్‌ను మించేలా తయా రు చేయించాలి. వచ్చే యేడాది జూన్‌ 28నాటికి మెమోరియల్‌ నిర్మాణం పూర్తికావాలి.  

పీవీ వ్యక్తిత్వ పటిమపై ప్రత్యేక పుస్తకాలు 

అముద్రితంగా ఉన్న పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ముద్రి స్తాం. అన్ని వర్సిటీలకు ఈ రచనలను పంపిస్తాం. పీవీ వ్యక్తిత్వ పటిమపై అద్భుతమైన స్థాయిలో మూడు నాలుగు ఎడిషన్స్‌ తీసుకురావాలని కేకేను కోరుతున్నా. వాటిని ఇండియాలోని అన్ని యూనివర్సిటీలకు, అన్ని భాషల్లో పంపిస్తాం.  ‘హౌ టు బిల్డ్‌ ఏ స్ట్రాంగ్‌ ఇండివిజ్యువాలిటీ’ అనే దానికి పీవీ ఓ ప్రతీక. ఈ పుస్తకాలు విద్యార్థులకు ఉపయోగంగా ఉంటాయి.

ఐదు కాంస్య విగ్రహాలు

ఐదు కాంస్య విగ్రహాలకు ఆర్డర్‌ ఇవ్వాలని సీఎస్‌కు చెప్పాను. పీవీతో అనుబంధం ఉన్నటువంటి వంగర, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, తెలంగాణ భవన్‌-న్యూఢిల్లీలో ఈ విగ్రహాలను పెడుతాం. అసెంబ్లీలో శాశ్వతంగా ఉండేలా భారీ స్థాయి లో పీవీ చిత్రపటం ఏర్పాటుచేయాలని స్పీకర్‌ను కోరుతున్నా. 

  • పీవీ పేరుతో ఆయన నూతన ఆర్థిక విధానాలపై కాకతీయ యూనివర్సిటీలో రిసెర్చ్‌ సెంటర్‌ను పెడుతాం.
  • తెలుగు అకాడమీకి పీవీ పేరు పెట్టాలనే సూచన వచ్చింది దాన్ని ప్రజలు కోరితే చేస్తాం. 
  • ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పీవీ పేరు పెడుతాం. పీవీ పేరును స్మరించుకునేలా కార్యక్రమాలుంటే భవిష్యత్‌ తరాలకు లాభం జరుగుతుంది.
  • పీవీ పేరిట ఒక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతా.  
  • హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పేరును పీవీ సెంట్రల్‌ యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్‌చేయాలని కేకే సూచించారు. దీనికి సంబంధించి ఈ రోజే ప్రధానికి లేఖ రాస్తా.. దీనికోసం ఫైట్‌ చేస్తాం. 
  • ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇలా అందరూ పాల్గొనేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం.


logo