శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 00:05:05

బాల్యం నుంచి భ్రమణ కాంక్ష!

బాల్యం నుంచి భ్రమణ కాంక్ష!

తీర్థయాత్రలు.. కొత్త ప్రాంతాలను సందర్శించడంపై పీవీ నరసింహారావు అమితాసక్తి చూపేవారు. బాల్యంలో గుట్టలు ఎక్కడం, గుహల్లో దూరడం, పొలాల వెంట తిరగడం చేస్తుండేవారు. వరంగల్‌లో విద్యాభ్యాసం కొనసాగిన రోజుల్లో సెలవు దినాల్లో తాపీగా బయల్దేరి సిద్ధేశ్వరుడి గుడి, పద్మాక్షిగుడి, భద్రితాలాబ్‌ గుట్ట, భీమారం రోడ్డు, ఖాజీపేట స్టేషన్‌, ఓరుగల్లు కోట, రాతిప్రాకారం మొదలగు చారిత్రక ప్రదేశాలను చుట్టివచ్చేవారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ తరఫున ఉత్తరదేశ యాత్ర చేపట్టగా, అందులో పీవీ పాల్గొన్నారు. తిరిగి వచ్చిన తరువాత ఆ యాత్ర విశేషాలను కొన్ని నెలల పాటు సవివరంగా చెప్పేవారు. పంజాబ్‌ ప్రాంతంలోని పాడిపంటలు, అక్కడి అతిధి మర్యాదలు, బొంబాయిలోని ఘన కర్మాగారాలు, నౌకాస్థావరం, ఎలక్ట్రిక్‌ ట్రైన్‌, మ్యూజియం ఇలా ఒక్కో అంశాన్ని విసుగూ విరామం లేకుండా వివరించేవారని గుర్తు చేసుకుంటారు. 

ఇక జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయన అభిరుచికి తగినట్టుగానే విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ సెంటోసా థీమ్‌ పార్క్‌, సముద్ర తీరంలో మ్యూజికల్‌ లైట్‌ అండ్‌ సౌండ్‌ షోను చూసి ఆ టెక్నాలజీకి విస్మయం చెందారు. అలా అనేక దేశాల్లో పర్యటించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా పర్యటించిన ప్రాంతంలో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించేవారు. వచ్చాక ఆ యాత్ర విశేషాలను, అక్కడి వింతలను, టెక్నాలజీని సవివరంగా తన సన్నిహితులకు వివరించేవారు. అత్యధిక దేశాలు తిరిగిన మన దేశ నేతల్లో పీవీ కూడా ఒకరుగా నిలవడం ఆయన అభిలాషను తెలుపుతుంది.


తాజావార్తలు


logo