శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 02:44:02

పీవీకి భారతరత్న ఇవ్వాలి

పీవీకి భారతరత్న ఇవ్వాలి

  • సమాలోచన సభ ఏకగ్రీవ తీర్మానం
  • దేశానికి పీవీ బహుముఖ సేవలు
  • క్లిష్టపరిస్థితుల్లో ప్రధానిగా సమర్థ పాలన
  • ఆ సేవలు యువతరానికి తెలియాలి
  • జాగృతి అధ్యక్షురాలు కవిత 
  • విదేశాల్లోనూ పీవీ విగ్రహాలు 
  • శతజయంతి కమిటీ అధ్యక్షుడు కేకే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశానికి అపార సేవలు అందించి, భారత్‌ అభివృద్ధికి దోహదపడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానంచేయాలని మంగళవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన పీవీ సమాలోచన సభ ఏకగీవ్రంగా తీర్మానించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రవేశపెట్టిన ఈ ఏకవాక్య తీర్మానాన్ని ఎంపీ కే కేశవరావు, సభికులు కరతాళధ్వనులతో స్వాగతించారు. త్వరలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిచేస్తామని కవిత తెలిపారు. 

శతజయంతి ఉత్సవాల సమయంలోనే భారతరత్నను ప్రదానంచేస్తే బాగుంటుందని, ఆ దిశగా కేంద్రం చొరవ చూపాలని కోరారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని సోషల్‌మీడియా వేదికగా అనేకమంది వ్యక్తులు, సంస్థలు కోరుతున్నాయని, వారికి ప్రతిఒక్కరూ మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ తేజం మన పీవీ పేరిట ‘సాహితీ సౌరభం - అసమాన దార్శనికత’ అంశంపై సమాలోచన సభను హైదరాబాద్‌లోని గ్రాండ్‌ హయత్‌లో బుధవారం నిర్వహించారు. శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే కేశవరావు, జాగృతి అధ్యక్షురాలు కవిత తొలుత పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం కవిత మాట్లాడుతూ.. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తన రాజనీతిజ్ఞత, విప్లవాత్మక సంస్కరణలతో భారత్‌ను అభివృద్ధిపథంలో నడిపించారని కొనియాడారు. పీవీ అందించిన సేవలు యువతరానికి తెలిపేలా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని జాగృతి సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రధానిగా పీవీ ఉన్న సమయంలో టెర్రరిస్టులు ఎన్నోసార్లు భారత్‌ను బెదిరింపులకు గురిచేసినా వాటికి ఆయన ఏనాడూ తలొగ్గలేదని గుర్తుచేశారు. ఎంత ఉన్నతస్థాయికి చేరుకున్నా అంతే వినయంగా ఒదిగారని శ్లాఘించారు. ఆధ్యాత్మికం, చరిత్ర, రాజకీయం, సామాజికం.. ఇలా ప్రతి అంశంపై అపార ప్రతిభ కలిగి ఉండటమే కాకుండా, మాట్లాడి ఒప్పించగల మేధావి అని తెలిపారు. నిర్వహించిన ప్రతిశాఖలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

10 రాష్ర్టాల్లో విగ్రహాలు

పీవీ సేవలను భావితరాలకు తెలిపేలా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎంపీ కే కేశవరావు కృతజ్ఞతలు తెలిపారు. జ్ఞానభూమిలో పీవీ స్మారక భవన నిర్మాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. పలు దేశాలతోపాటు దేశంలోని 10 రాష్ర్టాల్లో పీవీ విగ్రహాలను ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో ఏర్పాటుచేసే అంశంపై ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం జగన్‌తో మాట్లాడామని వివరించారు.

విదేశాల్లోనూ కార్యక్రమాలు

విదేశాల్లోనూ పీవీ శతజయంతి సభలు నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల తెలిపారు. పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవి మాట్లాడుతూ.. తమ తండ్రి రాష్ర్టానికి, దేశానికి అందించిన సేవలతోపాటు సాహిత్యం, సంస్కరణలు తదితర అంశాలను వివరించారు. సీఎం కేసీఆర్‌ వల్లే పీవీకి సముచితస్థానం లభిస్తున్నదని అన్నారు. ప్రముఖ రచయిత కల్లూరి భాస్కరం మాట్లాడుతూ.. పీవీ రచించిన బృహన్నవల ఇన్‌సైడర్‌ విశిష్టతను, దానిని తెలుగులో లోపలి మనిషి పేరుతో అనువదించిన సందర్భంగా పీవీ నరసింహారావు తెలిపిన విషయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో జాగృతి సభ్యులు, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

లుక్‌ కల్చర్‌ను.. బుక్‌ కల్చర్‌గా మార్చేందుకు కృషి

ప్రస్తుతం యువతలో ఎక్కువగా లుక్‌ కల్చర్‌ ఉన్నదని, దానిని బుక్‌ కల్చర్‌గా మార్చేందుకు జాగృతి ఆధ్వర్యంలో మొదటి నుంచి కృషిచేస్తున్నామని కవిత తెలిపారు. ప్రతినెలా బుక్‌ క్లబ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కరోనాతో కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆ కార్యక్రమాన్ని పీవీ బుక్‌ క్లబ్‌ పేరిట పునఃప్రారంభిస్తామన్నారు. ప్రతినెలా ఒక ప్రాచీన పుస్తకం, నవీన పుస్తకాన్ని తెలంగాణ యువ సమాజానికి పరిచయం చేయనున్నామన్నారు. సాహితీవేత్త, అపరచాణక్యుడు పీవీకి అక్షర నివాళి అర్పించాలనే సంకల్పంతోనే దీనికి శ్రీకారం చుట్టామని తెలిపారు.


logo